Site icon HashtagU Telugu

Kuppam Chandrababu : కుప్పం వైసీపీ బంద్ పై నెగ్గిన‌ చంద్ర‌బాబు

Cbn Kuppam

Cbn Kuppam

టీడీపీ చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌లో పైచేయిగా నిలిచారు. ఆయ‌న అనుకున్న ప్ర‌కారం అన్న క్యాంటిన్ ద్వారా ఆహారాన్ని అక్క‌డి పేద‌ల‌కు అందించారు. అధికార వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపును ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా సామాన్యులు సైతం రోడ్ల మీద‌కు వ‌చ్చారు. చంద్ర‌బాబు వ‌డ్డించిన అన్న క్యాంటిన్ భోజ‌నం కోసం క్యూ క‌ట్టారు. దీంతో చంద్ర‌బాబు విజ‌యం సాధించిన‌ట్టు ఫీల్ అవుతూ క్యాడ‌ర్ తో సంతోషాన్ని పంచుకున్నారు.

మూడు రోజుల ప‌ర్య‌ట‌న కోసం కుప్పం వెళ్లిన చంద్ర‌బాబును అడ్డుకుంటూ వైసీపీ శ్రేణులు బుధ‌వారం రాళ్లు విసిరాయి. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ప్ర‌తిగా తిర‌గ‌బ‌డ్డాయి. ఫ‌లితంగా ఇరు పార్టీల క్యాడ‌ర్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. కుప్పం వ్యాప్తంగా గురువారం నాడు బంద్ నిర్వ‌హించ‌డ ద్వారా చంద్ర‌బాబుకు నిర‌స‌న తెలిపాల‌ని వైసీపీ యోచించింది. ఆ మేర‌కు ప్ర‌జ‌లకు పిలుపు ఇచ్చింది. కానీ, వైసీపీ బంద్ ను ప‌ట్టించుకోకుండా టీడీపీ య‌థాత‌దంగా బ‌స్తాండ్ సెంట‌ర్లో అన్న క్యాంటిన్ ను షెడ్యూల్ ప్ర‌కారం ప్రారంభించ‌డానికి సిద్ధం అయింది. ఆ స‌మ‌యంలో వైసీపీ క్యాడ‌ర్ అక్క‌డ‌కు చేరుకుని క్యాంటిన్ ను ధ్వంసం చేయ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది.

అన్న క్యాంటిన్ ధ్వంసం చేసిన విష‌యాన్ని తెలుసుకున్న చంద్ర‌బాబు నేరుగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి పాద‌యాత్ర‌గా క్యాంటిన్ కు వ‌చ్చారు. వైసీపీ దాష్టీకాన్ని నిర‌సిస్తూ అక్క‌డే ఆయ‌న భైఠాయించారు. దీంతో హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఆ జిల్లాకు చెందిన ఎస్పీ నేరుగా ప‌రిస్థితిని స‌మీక్షించారు. అక్క‌డే చంద్ర‌బాబు క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేస్తూ జ‌గ‌న్, డీజీపీ మీద చెల‌రేగిపోయారు. ఇప్పుడు రండి చూసుకుందాం అంటూ స‌వాల్ చేశారు. అంతేకాదు, మ‌గాడివైతే రా చూసుకుందాం అంటూ జ‌గ‌న్ కు స‌వాల్ చేయ‌డం ఆయ‌న ఉగ్ర‌రూపానికి నిద‌ర్శ‌నంగా క‌నిపించింది.

ఆ త‌రువాత అన్న క్యాంటిన్ కు వండిన భోజ‌నాన్ని క్యాడ‌ర్ త‌ర‌లించారు. దాన్ని ప్రారంభించిన చంద్ర‌బాబు అక్క‌డే ఆయ‌న కూడా భోంచేసి కార్య‌క‌ర్త‌ల‌కు ధైర్యాన్ని నింపారు. వైసీపీ ఇచ్చిన బంద్ ను ప‌ట్టించుకోకుండా ముందుకొచ్చిన జ‌నాన్ని చూసి చంద్ర‌బాబు మురిసిపోయారు. ఆ విష‌యాన్ని టీడీపీ క్యాడ‌ర్ చెప్పుకుంటూ పొంగిపోతోంది.

కుప్పం చంద్ర‌బాబు టూర్ సంద‌ర్భంగా వైసీపీ వ్య‌వ‌హ‌రించిన తీరును నిర‌సిస్తూ అమ‌రావ‌తి కేంద్రంగా టీడీపీ నేత‌లు నిర‌స‌న‌కు దిగారు. డీజీపీ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నాకు పూనుకున్నారు. డీజీపీ కార్యాల‌యంలోని దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, పోలీసులు మోహ‌రించ‌డంతో ప‌రిస్థితిని అదుపు చేశారు. ఆ సంద‌ర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు, ఇత‌ర నేత‌లు వైసీపీ తీరుపై విరుచుప‌డ్డారు. మొత్తం మీద చంద్ర‌బాబు రెండో రోజు కుప్పం టూర్ ర‌చ్చ‌ర‌చ్చ‌గా క్లిక్ అయింద‌న్న‌మాట‌.