3 Capitals Agenda: 3 రాజధానులే వైసీపీ ప్రధాన అజెండా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశమే ప్రధాన అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 05:00 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశమే ప్రధాన అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది. 2024లో జరగనున్న రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రానికి మూడు రాజధానులు అనేదే ప్రధాన నినాదంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి కంటే మూడు రాజధానుల పట్లే ఎక్కువ మంది ఆసక్తి కనపరుస్తున్నారని, తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలను ఎన్నికల్లో గట్టి దెబ్బతీయడానికి ఇదే సరైన మార్గంగా జగన్‌మోహన్ రెడ్డి ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. అధికార వికేంద్రీకరణపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఘాటుగా స్పందించింది.గట్టిగా సమాధానం చెప్పింది.మూడు రాజధానులపై తాజాగా ఎన్నికలకు వెళ్లాలని నిమ్మల రామా నాయుడు జగన్ మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. ఎవరు ఏవిధంగా దాడులు చేసినా, సవాళ్లు విసిరినా జగన్‌మోహన్ రెడ్డి ఆలోచనలో మార్పులేదు. ఈ అంశంపై సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

2024 ఎన్నికలు మూడు రాజధానులు వర్సెస్ అమరావతిపైనే వైసీపీ, టీడీపీల మధ్య పోరు జరుగుతుందని స్పష్టత వచ్చింది. ఏపీని ఏకైక రాజధాని అమరావతి అని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు ఇతర ప్రతిపక్షాలన్నీ గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగాలని 33వేల ఎకరాలకు పైగా భూములిచ్చిన రైతులు వెయ్యి రోజులకుపైగా చేస్తున్న ఉద్యమానికి కూడా ప్రతిపక్షాలు అన్నీ మద్దతు ఇస్తున్నాయి. రైతులు తొలుత నిర్వహించిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు విశేష స్పందన లభించింది. ఇప్పుడు మెుదలు పెట్టిన అమరావతి-అరసవల్లి మహాపాదయాత్రకు కూడా ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. ఈ యాత్ర కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు పెద్దగా నిరసనలు ఎదురుకాలేదు. ఒకటి రెండు చోట్ల చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రస్తుతానికి సాఫీగానే సాగుతోంది. అయితే, పాదయాత్ర ద్వారా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే ఉత్తరాంధ్రవాసులు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ హెచ్చరించారు.

2019 ఎన్నికల్లో వైసీపీకి నవరత్నాలే ప్రధాన అజెండాగా ఉంది. ఎన్నికల హామీల్లో 98 శాతం నెరవేర్చినట్లు ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన అజెండా, అందరూ చర్చించే అంశం అమరావతి. 2024 శాసనసభ ఎన్నికల అజెండాగా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి కొత్త హాట్ టాపిక్ కావాలి. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రధాన అజెండాగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఇది ఉత్తర ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రజలందరినీ ఆకర్షిస్తుందన్నది ఆయన నమ్మకం.ఆయన వాదనను బలపరచుకునే విధంగా రాజధాని అమరావతిని మార్చడంలేదని, అది శాసనసభ రాజధానిగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల ప్రజలను తనవైపు తిప్పుకోవడానికి ఈ వాదన వైసీపీకి కొంతవరకు పనికి వస్తుంది.అంతేకాకుండా, అమరావతి విషయంలో టీడీపీ నేతలపై ఎదురు దాడికి కూడా వైసీపీ నేతలు దిగారు.విశాఖపట్నం రాజధాని వద్దంటున్న ఉత్తరాంధ్ర ద్రోహులని టీడీపీ ఉత్తరాంధ్ర నేతల ఫొటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా సమయం ఉంది. ఈ సమయాన్ని వైసీపీ ఉపయోగించుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.
మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, గుడివాడ అమ‌ర్నాథ్ తదితరులతోపాటు ఇతర నేతలు కూడా మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని, దానిని అమలు చేస్తామని ప్రకటించారు.మూడు రాజధానులతోనే సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని వారు స్పష్టం చేశారు. గుడివాడ అమర్నాథ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పాలన కొనసాగుతుందని తెగేసి చెప్పారు. ఈ మేరకు మూడు రాజ‌ధానుల బిల్లు, సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లుల్లో లోపాలను స‌రిదిద్ది వైసీపీ ప్రభుత్వం మ‌ళ్లీ శాసనసభలో ప్రవేశపెట్టనుంది.
అయితే ఈ అంశం ఇప్పుడు సుప్రీం కోర్టు ముందుంది.వైసీపీ ఎత్తుగడలను టీడీపీ ముందు ముందు ఎలా ఎదుర్కొంటుందో వేచిచూడాలి.