YS Jayanthi 2022 : జ‌గ‌న్ కుటుంబ స‌మేత‌.! వైఎస్ ఎస్టేట్‌ లో డిన్న‌ర్!!

వైఎస్ కుటుంబ అభిమానులు, వైసీపీ క్యాడ‌ర్ సంబ‌ర‌ప‌డే దృశ్యం ఇడుపుల‌పాయలో క‌నిపించింది.

  • Written By:
  • Updated On - July 8, 2022 / 12:18 PM IST

వైఎస్ కుటుంబ అభిమానులు, వైసీపీ క్యాడ‌ర్ సంబ‌ర‌ప‌డే దృశ్యం ఇడుపుల‌పాయలో క‌నిపించింది. ఎడ‌మొఖం పెడ‌మొఖంగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ష‌ర్మిల ఒకే చోట క‌నిపించారు. గ‌తంలో మాదిరిగా వైఎస్ కుటుంబం అంతా ఇడుపుల‌పాయలోని వైఎస్ స‌మాధి వ‌ద్ద క‌నిపించారు. అంద‌రూ మునుప‌టిలాగా కలిసిపోయిన‌ట్టు క‌నిపించిన దృశ్యాన్ని చూసి వైఎస్ అభిమానులు పొంగిపోయారు. ఆత్మ‌బంధువుగా చెప్పుకునే కేవీపీ పంజాగుట్టు స‌ర్కిల్ లోని వైఎస్ విగ్ర‌హం వ‌ద్ద నివాళ‌ల‌ర్పించేందుకు వెళ్లడం జ‌యంతి వేడుక‌ల్లోని విశేషం.

గ‌త ఏడాది జ‌రిగిన వైఎస్ జ‌యంతి వేడుక‌ల‌కు భిన్నంగా ఈసారి కుటుంబంలో ఐక్య‌తాభావం క‌నిపించింది. గ‌త కొంత కాలంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ష‌ర్మిల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంద‌ని సర్వ‌త్రా వినిపించింది. అందుకే, ఆమె తెలంగాణ‌లో వైఎస్ఆర్ టీపీని స్థాపించార‌ని తొలి రోజుల్లో ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌స్తుతం ష‌ర్మిల తెలంగాణ పాలిటిక్స్ మీద ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. రెండో విడ‌త పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. వైఎస్ జ‌యంతి సంద‌ర్భంగా పాద‌యాత్ర‌కు తాత్కాలిక బ్రేక్ వేసి గురువారం ఇడుపుల‌పాయ వెళ్లారు. ఈనెల 10వ తేదీ త‌రువాత మ‌ళ్లీ ఆమె పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తారు. గ‌త ఏడాది దూరంగా ఉన్న క‌డ‌ప జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్లు ష‌ర్మిల‌కు విమానాశ్ర‌యం వ‌ద్ద స్వాగ‌తం ప‌లిక‌డం గ‌మ‌నార్హం.

రెండు రోజుల క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైఎస్ ఎస్టేట్ లో బ‌స చేశారు. అక్క‌డికి ష‌ర్మిల కూడా వెళ్లారు. ఆమె కూడా అక్క‌డే బ‌స చేయ‌డం ఒక ఎత్తైతే, కుటుంబ స‌మేతంగా గురువారం రాత్రి డిన్న‌ర్ చేశార‌ని తెలుస్తోంది. ఆ విషయాన్ని క‌డ‌ప జిల్లాకు చెందిన వైసీపీ క్యాడ‌ర్ చెబుతోంది. శుక్ర‌వారం ఉద‌యం కుటుంబ స‌మేతంగా ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ సమాధి వ‌ద్ద‌కు వెళ్లి నివాళుల‌ర్పించారు. ఆ సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొంత భావోద్వేగానికి గురైన‌ట్టు వీడియోల్లో కనిపించింది. వైఎస్ విజ‌య‌మ్మ‌, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, భార‌తి, ష‌ర్మిల, ఆమె కుమారుడు, కుమార్తెతో ఇత‌ర కుటుంబ స‌భ్యులు నివాల‌ర్పించే వీడియోలో క‌నిపించిన దృశ్యం. దీంతో కుటుంబంలోని వివాదాలు ప‌రిష్కారం దిశ‌గా ఉన్నాయ‌ని అర్థం అవుతోంది.

ఇడుపుల‌పాయ నుంచి గుంటూరు స‌మీపంలోని నాగార్జున‌సాగ‌ర్ యూనివ‌ర్సిటీ ప్రాంగణం జ‌రిగే ప్లీన‌రీకి గౌర‌వాధ్య‌క్షురాలి హోదాలో వైఎస్ విజ‌య‌మ్మ హాజ‌ర‌య్యారు. ఆమె గైర్హాజ‌ర‌వుతార‌ని గ‌త రెండు రోజులుగా జ‌రిగిన ప్ర‌చారానికి చెక్ ప‌డింది. ప్లీన‌రీ ఏర్పాట్ల‌ను వైసీపీ భారీగా చేసింది. రెండు రోజుల పాటు జ‌రిగే ఈ ప్లీన‌రీ 2024 ఎన్నిక‌ల దిశ‌గా బ్లూ ప్రింట్ ను ప్ర‌క‌టించ‌డానికి సిద్ధం అయింది. బ్ర‌ద‌ర్ అనిల్ ఏపీ రాష్ట్రంలోనూ వైఎస్ ష‌ర్మిల పార్టీని దింప‌డానికి ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌య‌త్నం చేశారు. అందుకు సంబంధించి మంత‌నాల‌ను మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తో సాగించారు. రాష్ట్రంలోని పాస్ట‌ర్ల‌తోనూ భేటీ అయ్యారు. అందుకే, వివాదాల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక మెట్టు దిగార‌ని తెలుస్తోంది. అందుకే, ఒకే వేదిక‌పై కుటుంబ స‌భ్యులంద‌రూ ఈసారి క‌నిపించార‌ని పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌. ఇదంతా గ‌మనిస్తే వైఎస్ కుటుంబంలోని వివాదాలు మీడియా మైకుల్లో తుఫాన్ లా బోధ‌ప‌డుతోంది.