YS Viveka Daughter : సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చకచకా పావులు కదుపుతున్నారు. వైఎస్ కుటుంబం నుంచి సీఎం జగన్‌పైకి మరో బాణాన్ని రెడీ చేస్తున్నారు. ఆ బాణం ఎవరో తెలుసా ? దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత. ఇవాళ సునీతతో షర్మిల భేటీ కానున్నారు. పీసీసీ చీఫ్ పదవిని షర్మిల చేపట్టాక.. సునీతకు కలవడం ఇదే తొలిసారి. రాజకీయాల్లోకి రావాలని ఈసందర్భంగా సునీతను షర్మిల ఆహ్వానిస్తారని సమాచారం. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సునీత మొదటి నుంచే గట్టి పోరాటమే చేస్తున్నారు. ఆమె డిమాండ్‌తోనే సీబీఐ విచారణ మొదలైంది. అందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కరరెడ్డితో పాటు ఇతరులు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. అవినాష్‌రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ వ్యవహారంపై సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు.
రాజకీయ పోరుకు రెడీ
మరోవైపు రాజకీయ పోరాటానికి కూడా సునీత రెడీ కాబోతున్నారట. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ జరపాలని సునీత డిమాండ్ చేసినప్పటి నుంచే సీఎం జగన్, సునీత మధ్య కుటుంబపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో రాజకీయంగా తాను వేయాల్సిన అడుగులపై షర్మిలతో సునీత చర్చించే ఛాన్స్ ఉంది. తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు షర్మిల అండగా నిలిచారు. సీబీఐకి తన వాంగ్మూలాన్ని కూడా షర్మిల ఇచ్చారు. ఈరోజు జరిగే సమావేశంలో సునీత(YS Viveka Daughter) కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
పకడ్బందీ వ్యూహంతోనే వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలను కాంగ్రెస్ పెద్దలు కట్టబెట్టారని తెలుస్తోంది. ప్రత్యేకించి ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానంలోనూ తొలిసారిగా వైఎస్ కుటుంబం నుంచే కీలకమైన అభ్యర్థి బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు. వైఎస్ జగన్‌పై వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించనుందని చెబుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి అనుమానాస్పద హత్య తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఏర్పడిన విభేదాలు.. వాటిపై మీడియాలో జరిగిన చర్చను మనమంతా చూశాం. ఈనేపథ్యంలో వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ పులివెందుల నుంచి పోటీ చేయనుండటం వైఎస్ జగన్‌కు షాకిచ్చే విషయమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.