YS Sunitha : టీడీపీ రూట్ లో వివేక కుమార్తె సునీత‌.!

ఏపీ సీఎం జ‌గ‌న్ బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై ఆయ‌న కుమార్తె డాక్ట‌ర్ సునీత‌, టీడీపీ వాద‌న ఒకేలా ఉంది.

  • Written By:
  • Publish Date - March 1, 2022 / 05:17 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై ఆయ‌న కుమార్తె డాక్ట‌ర్ సునీత‌, టీడీపీ వాద‌న ఒకేలా ఉంది. హ‌త్య వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నాడ‌ని ముక్త‌కంఠంతో ఆరోపిస్తున్నారు. సీబీఐ ఏపీ సీఎం జ‌గ‌న్ ను విచారించాల‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ లోకేశ్ డిమాండ్ చేస్తున్నాడు. వివేకా హ‌త్య‌కు స్వ‌యంగా జ‌గ‌నే స్కెచ్ వేశార‌ని లోకేశ్ నిర్థారిస్తున్నాడు. వివేకా హ‌త్య కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు జ‌గ‌న్‌ను అదుపులోకి తీసుకోవాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో డాక్ట‌ర్ సునీత వాగ్మూలంకు హైలెట్ అవుతోంది.వైఎస్ కుటుంబంలో నెల‌కొన్ని విభేదాల కార‌ణంగా ష‌ర్మిల్ తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏపీలోనూ విస్త‌రింప చేయాల‌ని ప్లాన్ చేస్తోంద‌ని తెలుస్తోంది. సోద‌రుడు జ‌గ‌న్ తో విభేదాల కార‌ణంగా ఆమె పార్టీని పెట్టార‌ని స‌మాచారం. అందుకు వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ కూడా మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డం హైలెట్ పాయింట్‌. పైగా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విష‌యంలో డాక్ట‌ర్ సునీత్ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌కు ష‌ర్మిల్ మ‌ద్ధ‌తు కూడా ఉంది. ప‌లుమార్లు డాక్ట‌ర్ సునీత ఆవేద‌న‌పైన ష‌ర్మిల కూడా స్పందించింది. ప‌రోక్షంగా జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ష‌ర్మిల రాజ‌కీయ పావులు క‌దుపుతున్నారని వినికిడి. అదే విధంగా డాక్ట‌ర్ సునీత కూడా జ‌గ‌న్ మీద ప‌లు అనుమానాల‌కు వ్య‌క్తం చేస్తూ, ఆయ‌న్ను ఎదుర్కోవ‌డానికి టీడీపీ మ‌ద్ధ‌తు కూడగ‌ట్టుకుంటుంద‌ని వైసీపీ అనుమానం. తెలుగుదేశం పార్టీ వాళ్లే డాక్ట‌ర్ సునీతను ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నార‌ని వివేక హ‌త్య‌కు రాజ‌కీయ రంగును అంటించారు. రాబోయే రోజుల్లో డాక్ట‌ర్ సునీత టీడీపీలో చేర‌బోతున్నార‌ని మ‌రికొంద‌రు ఒక అడుగు ముందుకేసి ప్ర‌చారం చేస్తున్నారు. అందుకు బ‌లం చేకూరేలా డాక్ట‌ర్ సునీత, లోకేశ్ ఆరోప‌ణ‌లు ఒకేలా ఉన్నాయి.

వైఎస్ వివేకా హ‌త్య కేసులో గొడ్డ‌లి పోటు నుంచి గుండెపోటు డ్రామా వ‌ర‌కూ ఉన్న మిస్ట‌రీ వీడిపోయింద‌ని లోకేశ్ వ్యాఖ్యానించారు. వ‌రస‌కు సోద‌రుడి కుమారుడు, క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి.. మ‌రో వ్య‌క్తి శివ‌శంక‌ర్ రెడ్డితో క‌లిసి అత్యంత కిరాత‌కంగా వివేకానంద‌రెడ్డిని చంపేశార‌ని లోకేశ్ తీవ్రంగా ఆరోప‌ణ‌లు గుప్పించాడు. వివేకాను చంపేసిన అవినాశ్ రెడ్డి, శివ‌శంక‌ర్‌రెడ్డిలు త‌న‌కు రెండు క‌ళ్లు అంటూ జ‌గ‌న్ వ్యాఖ్యానించ‌డం, కేసును సీబీఐకి అప్పగిస్తే అది 12వ కేసు అవుతుంద‌ని వివేకా కూతురు సునీత‌తో జ‌గ‌న్‌ చెప్ప‌డం చూస్తుంటే.. వివేకా హ‌త్య‌కు స్కెచ్ జ‌గ‌న్ వేశాడ‌ని అర్థమవుతోందని లోకేశ్ నిర్థారిస్తున్నాడు.వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వాంగ్మూలాలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రజల్లోకి వస్తున్నాయి. కేసుపై చర్చించడానికి కుటుంబ సమావేశానికి అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారని వివేకా కుమార్తె సునీత ఆరోపించారు. ప్రధాన నిందితులు అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు జగన్‌కు రెండు కళ్లలాంటి వారని, విచారణ ఆపివేసిన తర్వాతే సాంకేతిక విశ్లేషణ చేస్తామని ఆమెను అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ వద్దకు పంపారు. ఎన్నికలకు ముందు తాను పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నించగా.. జగన్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని భారతి, విజయమ్మ తనను అడ్డుకున్నారని సునీత పేర్కొంది. మరో ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే – “శివశంకర్ రెడ్డిపై నేను సందేహం వ్యక్తం చేసినప్పుడల్లా జగన్ వెంటనే మీ భర్తను కూడా అనుమానించమని చెబుతారు” అంటూ చెప్ప‌డం జ‌గ‌న్ పై అనుమానం క‌లుగుతోంద‌ని సునీత్ అంటోంది.

హైకోర్టును ఆశ్రయించిన సంద‌ర్భంలో భారతి మాట్లాడటం మానేసి, విజయమ్మ మౌనంగా ఉండిపోయింద‌ని సునీత సీబీఐకి తెలిపింది. కోడికత్తి ఘటన మాదిరిగానే సానుభూతి కోసం వివేకా హత్యకు జగన్ ప్లాన్ చేసి ఉంటారని సునీత భర్త రాజశేఖరరెడ్డి సీబీఐకి వాగ్మూలం ఇచ్చాడు. “వివేకా తన మరణానికి ముందు రాసినట్లుగా ఒక కల్పిత లేఖ ఉంది. ఆ లేఖ గురించి నాకు, పోలీసులకు మాత్రమే తెలుసు. ఈ లేఖను జగన్ మీడియాకు వివరించారు. అదే మొదటిసారి నాకు అతని మీద అనుమానం వచ్చింది. నేను ఇవ్వనప్పటికీ నా వాంగ్మూలాలను పోలీసులు కల్పించారు’’ అని రాజశేఖరరెడ్డి సీబీఐకి వివ‌రించాడు. “ఒకరోజు కడప మాజీ మేయర్ సురేష్, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన లేఖలో టిడిపి నాయకులు సతీష్ రెడ్డి, బిటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలను అనుమానితులుగా పేర్కొన్నారు. ఫిర్యాదుపై సంతకం చేయాలని వారు సునీతను కోరుకున్నారు. అయితే ఎటువంటి ఆధారాలు లేవని నమ్మి ఆమె నిరాకరించింది. రాజకీయ లబ్ధి కోసం సమస్యను ఉపయోగించుకోవడం ఈ కేసులోని ఆంత‌ర్యం”అని రాజశేఖర రెడ్డి వెల్లడించారు. డాక్ట‌ర్ సునీత ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాగ్మూలం ప‌రిశీలిస్తే, జ‌గ‌న్ మీద పూర్తి స్థాయిలో తిర‌గ‌బ‌డ్డార‌ని అర్థం అవుతోంది. కోడికత్తి కేసుకు, వివేక హ‌త్య‌కు లింకు పెడుతూ సీబీఐకి ఇచ్చిన వాగ్మూలం రాజ‌కీయ కోణాన్ని తెలియ‌చేస్తోంది. వివేక కుమార్తె, అల్లుడు ఇచ్చిన వాగ్మూలం, టీడీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది. డాక్ట‌ర్ సునీత టీడీపీలో చేరుతుంద‌ని వైసీపీలోని కొంద‌రు చేస్తోన్న ప్ర‌చారానికి ఆమె ఇచ్చిన వాగ్మూలం, లోకేశ్ చేసిన ఆరోప‌ణ‌లు బ‌లం చేకూర్చుతున్నాయి. సో..వివేక హ‌త్య కేసు విచార‌ణ ముగిసేలోగా రాజ‌కీయంగా ఏదైనా జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు. వెయిట్ అండ్ సీ. !