Site icon HashtagU Telugu

YS Sunitha: వైఎస్ భారతి పీఏపై పోలీసులకు వైఎస్ సునీత రెడ్డి ఫిర్యాదు!

Sunitha Reddy Files Complaint On Varra Ravindra Reddy

Sunitha Reddy Files Complaint On Varra Ravindra Reddy

గత ప్రభుత్వ హయాంలో తమను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత నిర్ణయించారు. ఈ క్రమంలో, బుధవారం ఆమె ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వైఎస్ సునీత, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డితో పాటు పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.

వర్రా రవీందర్‌పై సునీతరెడ్డి గతంలోనే ఫిర్యాదు:

సోషల్ మీడియా వేదికపై వర్రా రవీందర్ రెడ్డి తనపై పోస్టులు పెట్టినట్లు వైఎస్ సునీతరెడ్డి గతంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది అందరికీ తెలిసిందే. జగన్ ప్రభుత్వ సూచనల మేరకు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఒక వాదన ప్రచారంలో ఉంది.

వర్రా రవీందర్ అరెస్ట్:

ఇటీవల పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో, పోలీసులు అతడిని విచారించినప్పుడు అతడు కీలక సమాచారాన్ని బహిర్గతం చేశాడు. తనపై వేసిన పోస్టుల గురించి విచారణలో, వైఎస్ సునీత, వైఎస్ షర్మిల, వైఎస్ విజయలక్ష్మిలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ద్వారా అందిన కంటెంట్‌ను పోస్ట్ చేసినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. ఈ వివరాలను తెలపడంతో, వైఎస్ సునీత పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు:

వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన వాంగ్మూలంలో, వైసీపీ సోషల్ మీడియా కార్యకలాపాలకు సంబంధించిన కీలక వ్యక్తులుగా సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి పేర్లను వెలిబుచ్చాడు.

వైసీపీ సోషల్ మీడియా హెడ్ గా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత, సోషల్ మీడియాలో తమ కార్యకలాపాలు మరింత పెరిగాయని, ఈ సమయంలో వారు మరింత విజృంభించారని తెలిపాడు. అలాగే, టీవీ చానళ్ల చర్చల్లో పాల్గొని అధికార వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని వారిపై పోస్ట్‌లు పెట్టడం మొదలుపెట్టామని వర్రా రవీందర్ రెడ్డి పేర్కొన్నాడు.

వర్రా రవీందర్ రెడ్డి, తన రిమాండ్ రిపోర్ట్ లో, ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇందులో భాగంగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు అతని పిల్లలపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు అతడు చెప్పాడు.

ఇక, ఆ పోస్టులను తొలగించేందుకు ఒక వ్యక్తి తమను సంప్రదించినప్పుడు, రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడించాడు. అలాగే, జడ్జిలకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టాలని సజ్జల భార్గవరెడ్డి తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని వర్రా రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

ఇంకా ఎం చెప్పాడంటే, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాలని వారిని సూచించాడని వర్రా తెలిపాడు.

ఈ కంటెంట్‌ను అతడే తనకు అందిస్తాడని వర్రా రవీందర్ రెడ్డి వివరించాడు. అయితే, ఈ పోస్టులు ఏ విధంగా ఉండాలో అన్నది, అవినాశ్ రెడ్డి మరియు రాఘవరెడ్డి తమ మధ్య చర్చించుకునే విషయమని కూడా అతడు వెల్లడించాడు.

లుక్ అవుట్ నోటీసులు జారీ:

గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ సోషల్ మీడియాలో సైకోలు రెచ్చిపోయి వివిధ అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీంతో, వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, వైసీపీ సోషల్ మీడియా వేదికపై అభ్యంతర పోస్టులు కొనసాగినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, ఇటీవల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసారు, వారిలో వర్రా రవీందర్ రెడ్డి మరియు ఇంటూరి రవికిరణ్ ఇలా కొంత మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. అంతేకాక, సజ్జల భార్గవ రెడ్డి మరియు ఇతరులకు సంబంధించి లూక్ అవుట్ నోటీసులు ఇప్పటికే ఏపీ పోలీసులు జారీ చేశారు.