Viveka murder case: జ‌గ‌న్‌తో పాటు ఆ ఇద్ద‌రే టార్గెట్.. సునీత సెన్షేష‌న్ స్టేట్ మెంట్..!

  • Written By:
  • Updated On - February 28, 2022 / 01:07 PM IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మ‌లుపులు తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల సీబీఐ లీకుల పేరుతో రోజుకొక‌రి వాంగ్మూలం లీక్ అంటూ ప‌లు వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వివేకానంద‌రెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాగ్మూలం అంటూ ప్ర‌ముఖ తెలుగు ప‌త్రిక తాజాగా ప్ర‌చురించిన‌ ఓ సంచ‌ల‌న క‌థ‌నం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. ఆ ప‌త్రిక ప్ర‌చురించిన‌ స్టేట్‌మెంట్‌లో, త‌న అన్న‌ ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సునీత తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌న తండ్రి వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి హస్తం ఉందని, తాను అప్ప‌ట్లోనే జ‌గ‌న్‌కు చెప్ప‌గా, ఆయ‌న దానిని తేలిగ్గా తీసుకుని కొట్టిపారేశారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత తెలిపారు. అంతేకాకుండా బాబాయ్ వివేకా హత్య కేసులో వారిని అనవసరంగా అనుమానించవద్దని తనకు జగన్ సూచించారని సునీత చెప్పారట‌. ఇక త‌న తండ్రి హ‌త్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని తాను కోరగా, దానివల్ల ఏమవుతుంది.. అవినాష్ బీజేపీలో చేరిపోతాడని జగన్ అన్నట్లు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొందని ఆ కథనంలో రాశారు.

అంతే కాకుండా త‌న తండ్రిని, తన భర్తే హత్య చేయించాడని, జ‌గ‌న్ అన‌డంతో తన గుండె పగిలినట్లయిందని సునీత ఆరోపించారు. అనుమానితుల జాబితాలో ఈసీ గంగిరెడ్డి పేరు, అలాగే ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్ పేరు చేర్చ‌డంతో, జ‌గ‌న్ త‌న‌పై కోప్పడ్డారన్నారని సునీత తెలిపారు. జ‌గ‌న్‌కు త‌న చిన్నాన్న ప్రాణం కంటే కాంపౌండర్ ఎక్కువ‌య్యార‌ని, అస‌లు వివేకా చనిపోయిన విషయం తెలుసుకుని బాణసంచా కాల్చేందుకు కొనుగోలు చేసిన వ్యక్తిని ఎందుకు వదిలిపెట్టారో తనకు అర్థం కావడం లేదని సునీత ఆ వాగ్మూలంలో ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీంతో అక్క‌డి పరిస్థితులు చూసిన తర్వాత తనకు న్యాయం జ‌ర‌గ‌ద‌ని భావించి తాను సీబీఐ చేత విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సునీత తెలిపారట‌. ఇక తన తండ్రి వివేకానంద‌రెడ్డిపై, అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిలు రాజకీయ కక్ష పెంచుకున్నారని సునీత ఆరోపించార‌ట‌. వివేక‌ హత్య జరిగిన విషయాన్ని తాను తొలుత భారతి అండ్ జగన్ అన్న‌కు ఫోన్ చేసి చెబితే వారు ఎందుకు తేలిగ్గా తీసుకున్నారో త‌న‌కు అర్ధం కాలేద‌ని సునీత ఆరోపించారు.

అంతే కాకుండా హ‌త్య జ‌రిగిన త‌ర్వాత తాను వచ్చే వరకు త‌న‌ తండ్రి మృతదేహానికి పోస్టుమార్టం చేయవద్దని చెప్పినా వినకుండా, పోస్టుమార్టం చేశార‌ని, అలాగే హ‌త్య జరిగిన చోట ఆధారాలన్నింటిని చెరిపేశారని సునీత ఆరోపించారు. ఎప్పుడైతే తన తండ్రికి అత్యంత సన్నిహితుల్లో ఒక‌రైన‌ ఎంవీ కృష్ణారెడ్డితో కేసు పెట్టించ వద్దని ఎర్రగంగిరెడ్డి చెప్పాడని, తెలిసిందో అప్పుడే త‌న తండ్రిని ఎవ‌రో హ‌త్య చేశార‌ని నిరించుకున్నానని సునీత తెలిపారు. తన తండ్రి వివేకా హత్యను, 2019 ఎన్నికల్లో జగన్ అన్న‌ రాజకీయంగా వాడుకున్నారని సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సునీత పేర్కొన్నారు.

జ‌గ‌న్ అన్న సీయం అయ్యాక తాను జ‌గ‌న్‌, స‌జ్జ‌ల రామ‌కృష్ణ‌, అప్పుడు ఏపీ డీజీపీగా ఉన్న గౌత‌మ్ స‌వాంగ్‌ల‌ను అనేక సార్లు క‌లిసి, ఎంత బ‌తిమాలినా, ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని సునీత తెలిపారు. ఇక‌పోతే తన తండ్రి భరత్ యాదవ్, సునీల్ యాదవ్‌ల‌తో కలసి బెంగళూరులో 104 కోట్ల వ్యవహారాన్ని సెటిల్ చేయ‌గా, వాటాల విష‌యంలో, త‌న తండ్రికి వారితో గొడ‌వ జ‌ర‌గింద‌ని, బహుశ ఈ హత్యకు ఇది కూడా ఒక కారణమయి ఉండవచ్చని సునీత అభిప్రాయపడ్డారు. త‌మ కుటుంబానికి 600 ఎకరాలు ఉమ్మ‌డి ఆస్థి ఉండ‌గా, త‌న‌కు, జగన్ అండ్ షర్మిలకు స‌మానంగా రెండు వందల ఎకరాల చొప్పున పంచారని, అయితే తన వాటాను ఎకరాకు లక్ష ఇచ్చి వాళ్లే తీసుకున్నారని సునీత తెలిపారు.

అలాగే అవినాష్ రెడ్డితో తన భర్త కుమ్మక్కయినట్లు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఆ వార్తల్లో నిజం లేదని సునీత స్ప‌ష్టం చేశారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత చెప్పిన సంచ‌ల‌న విష‌యాలంటూ తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన ప్ర‌ముఖ ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నంలో సారాంశం ఇదే. అయితే మ‌రోవైపు వివేకా హత్య కేసులో మరో అనుమానితుడు కల్లూరు గంగాధర్‌రెడ్డి అలియాస్‌ కొవ్వేటు గంగాధర్ తాజాగా ఆదివారం అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ క్ర‌మంలో వైఎస్ వివేకా హ్య‌త్య‌కు సంబంధించి ప‌లు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసుతో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంలో కుట్ర పూరితంగా ఇరికించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని గంగాధర్‌రెడ్డి ఆరోపించారు.

ఇక తనపై వచ్చిన ఆరోపణలు, ఇదే వాంగ్మూలం అంటూ వెలుగులోకి వచ్చిన వార్తలను కూడా ఖండించి గంగాధ‌ర్.. వివేకా హ్య‌త కేసుకు సంబంధించి విచార‌ణ‌లో భాగంగా త‌న‌ను సీబీఐ అధికారులు పిలిస్తే వెళ్లానని, అప్ప‌డు వారు త‌న‌తో తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారని గంగాధర్ రెడ్డి చెప్పిన విషయాలను సాక్షిలో ప్రచురించ‌డం విశేషం. తనతో పాటు అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను కేసులో ఇరికించేందుకు వివేకా కుమార్తె సునీత, జగదీశ్వర్‌రెడ్డిలు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గంగాధ‌ర్ వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో త‌న‌కు 20వేల న‌గ‌దు ఇచ్చార‌ని, సీబీఐ అధికారుల‌తో తాము చెప్పిన విధంగా చెబితే 50ల‌క్ష‌లు న‌గ‌దుతో పాటు కారు కూడా ఇస్తామ‌ని ప్ర‌లోభ‌పెట్టార‌న్నాడు. అంతే కాకుండా త‌న కాలి చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చులు కూడా భ‌రిస్తామ‌ని జగదీశ్వర్‌రెడ్డి, బాబురెడ్డిలు చెప్పి త‌న‌పై ఒత్తిడి తెచ్చార‌న్నారు.

తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన ఆధారాలు కూడా త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని గంగాధ‌ర్ వ్యాఖ్య‌లు చేశారు. కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని గంగాధర్‌రెడ్డి తెలిపారు. దీనికి కారణం వివేకానందరెడ్డి కుమార్తె సునీత, జగదీశ్వర్‌రెడ్డి అని పేర్కొన్నారు. హత్యలో ఆ ముగ్గురి ప్రమేయం ఉందని చెప్పాలంటూ జగదీశ్వర్‌రెడ్డి, బాబురెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. తనకు వారు రూ.20 వేల నగదు సైతం ఇచ్చారన్నారు. తాము చెప్పిన విధంగా సీబీఐ అధికారులతో చెబితే రూ.50 లక్షల డబ్బుతో పాటు కారు, తన కాలి చికిత్స ఖర్చులు భరిస్తామంటూ ప్రలోభపెట్టారని గంగాధర్ రెడ్డి వెల్లడించారు. మొత్తంగా సీబీఐ చార్జిషీటు తర్వాత వివేకా హత్య కేసులో రాజకీయ సంచలనాలెన్నో చోటుచేసుకుంటుండటం గమనార్హం. ఈ వ్యవహారంలో వైసీపీ న్యాయపోరాటానికి దిగబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో వివేకా హ‌త్య కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చి చార్జిషీటు దాఖ‌లు చేసిన‌ తర్వాత, ఈ హత్య కేసు రోజుకో మ‌లుపు తిరుతూ రాజకీయంగా ప‌లు సంచ‌ల‌నాల‌కు తెర‌లేపుతోంది. మ‌రి ఈ వ్యవహారంలో వైసీపీ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.