Letter To Modi : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా ఫిబ్రవరి 2న ధర్నా చేసేందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెడీ అవుతున్నారు. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కూడా ఈ ధర్నాలో పాల్గొంటారని సమాచారం. మరోవైపు ప్రధాని మోడీకి షర్మిల లేఖ రాశారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చేసినప్పుడు తెలంగాణతో పోలిస్తే ఏపీ వెనుకబడిపోకూడదన్న ఉద్దేశంతో విభజన చట్టంలో కేంద్ర సర్కారు పలు హామీలు ఇచ్చిందని ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల గుర్తుచేశారు. ఏపీ వేగంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆనాడు కేంద్ర సర్కారు ఇచ్చిన హామీలు పదేళ్లయినా ఇంకా నెరవేరలేదని ఆమె పేర్కొన్నారు. దీంతో నేటికీ రాజధానికి కూడా ఏపీ నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి మరికొన్ని కొత్త హామీలు కూడా ఇచ్చిందని, పదేళ్లయినా వాటిని కూడా నెరవేర్చలేదని షర్మిల(Letter To Modi) ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘ఏపీ దీనావస్ధకు చేరుకుంది. ప్రజలు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఏపీపై ప్రధాని మోడీ దయ చూపాలి. ఈ పరిస్ధితికి కేంద్రం వైఫల్యమే కారణం. ఈ తరహా వైఖరి కేంద్రం విశ్వసనీయతను ప్రశ్నార్దకంగా మారుస్తోంది. ప్రత్యేక హోదాను స్వయంగా అప్పటి ప్రధాని హామీ ఇచ్చినా తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. పోలవరం ప్రాజెక్టు కూడా ఈ కోవలోకే వస్తుంది. పోలవరం జాతీయ హోదాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పక్కనపెట్టేశాయి’’ అని షర్మిల పేర్కొన్నారు.
Also Read : Atomic Clock : అణు గడియారాన్ని తయారుచేసిన చైనా.. స్పెషాలిటీ ఇదీ
గతంలో కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇచ్చి ఇంకా నెరవేరకుంండా మిగిలిపోయిన హామీల జాబితాను కూడా షర్మిల మోడీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. వీటిని సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా ఆపాలని డిమాండ్ చేశారు. వీటిపై పార్లమెంట్ బడ్డెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగంలో నిర్దిష్టంగా ప్రస్తావించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కీలకమైన విభజన హామీలపై ఇప్పటికే అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పాతికమంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న హామీ ఏమైందని, మిగతా హామీలపై కేంద్రం సైలెంట్ గా ఉంటున్నా ఎందుకు అడగటం లేదని సూటిగా నిలదీస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ప్రధాని మోడీకి షర్మిల రాసిన లేఖ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.