Site icon HashtagU Telugu

CBN-YS Sharmila : చంద్రబాబుతో భేటీ.. షర్మిల ఏమన్నారంటే ..?

Ys Sharmila Gamyam

Ys Sharmila Gamyam

CBN – YS Sharmila : తన కుమారుడు రాజారెడ్డి  వివాహానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును వైఎస్ షర్మిల ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనకు పెళ్లి పత్రికను అందజేశారు. కుటుంబంతో సహా పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తామని షర్మిలకు చంద్రబాబు మాట ఇచ్చారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో భేటీలో ప్రస్తావనకు వచ్చిన విషయాలను వివరించారు. తమ మధ్య చర్చలో ఎక్కువగా వైఎస్ రాజశేఖరరెడ్డి గురించే ప్రస్తావన వచ్చిందని వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్‌లో ఉండగా ఇద్దరి (చంద్రబాబు, రాజశేఖర రెడ్డి)  ప్రయాణం.. జీపులో కలిసి తిరగడం.. పొద్దున్నుంచి రాత్రి వరకు కలిసి ఉండటం.. ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్లడం.. సీఎం పదవి కోసం ఇద్దరూ చేసిన ప్రయత్నాలను చంద్రబాబు(CBN-YS Sharmila) వివరించారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘చంద్రబాబును కలవడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. గతంలో స్వయంగా రాజశేఖరరెడ్డి కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబును పిలిచారు. చంద్రబాబు కూడా వచ్చారు. మమ్మల్ని ఆశీర్వదించారు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయాలే మా జీవితం కాదు. రాజకీయం ఒక ప్రొఫెషన్. రాజకీయ ప్రత్యర్థులుగా ఒక మాట అనుకోవడం జరుగుతుంది’’ అని తేల్చి చెప్పారు. ‘‘అందరం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం. అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రజల కోసం అందరం నమ్మకంగా పని చేద్దాం’’ అని ఆమె పేర్కొన్నారు. తనకు ఏ పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ అధి నాయకత్వం చూసుకుంటుందని వెల్లడించారు. రాహుల్ ప్రధాని కావాలని రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించే వారని తెలిపారు.

Also Read: January 22 Holiday : జనవరి 22న యూపీతో సహా ఆ దేశాల్లోనూ హాలిడే

ఈవారంలోనే షర్మిలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెకు ఏపీ రాజకీయాల్లో కీలక పదవిని కేటాయిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో షర్మిల కాంగ్రెస్‌లో ఉంటే ఓకే.. కానీ కీలకమైన ఆ పదవి మాత్రం ఇవ్వొద్దంటూ స్పీడ్ బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేత హర్షకుమార్. మరి ఈ మాజీ ఎంపీ విన్నపాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందా? వైఎస్‌ఆర్టీపీని విలీనం చేసి కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏపీసీసీ చీఫ్‌గా షర్మిలను నియమిస్తారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ షర్మిలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని అధిష్టానానికి సూచించారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీకే డ్యామేజ్ జరుగుతుందనేది ఆయన వాదన. జగన్, షర్మిల ఒక్కటేనని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము సేఫ్ గా ఉండేందుకే చెరో పార్టీ ఎంచుకున్నట్లు హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు పీసీసీ ఛీఫ్ బదులుగా జాతీయ స్ధాయి పదవి ఇవ్వాలన్నారు. ఏఐసీసీ పదవి ఇచ్చి, స్టార్ క్యాంపెనర్ గా ఆమె సేవలు దేశవ్యాప్తంగా వాడుకోవాలని సూచించారు.

Exit mobile version