Sharmila – Jagan : వైఎస్ షర్మిల కుటుంబ సమేతంగా బుధవారం (జనవరి 3న) తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్‌ను కలవనున్నారు. ఇందుకోసం వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులు కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్తారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ మోహన్ రెడ్డికి షర్మిల అందించనున్నారు. వైఎస్ షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె, కాబోయే కోడలు ప్రియ అట్లూరి, కోడలి తరఫు కుటుంబ సభ్యులు కూడా జగన్(Sharmila – Jagan) వద్దకు వెళ్లనున్నారు. ఇటీవల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ మొదటి పత్రికను ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల ఉంచారు. కుటుంబ సమేతంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందించిన తర్వాత షర్మిల బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపడతారనే ప్రచారం నేపథ్యంలో ఆమె ఢిల్లీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏపీ కాంగ్రెస్‌లో చేరుతున్న విషయంపై ఇప్పటికే షర్మిల క్లారిటీ ఇచ్చారు. జనవరి 4న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా? ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. రాహుల్ గాంధీ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ అలా జరగకుంటే.. ఏఐసీసీ, సీడబ్ల్యుసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.