YS Sharmila : వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా రెడీ అవుతోంది. ఈక్రమంలోనే వైఎస్ షర్మిల పేరును ఏపీ రాజకీయాల్లో(YS Sharmila) తెరపైకి తెచ్చేందుకు హస్తం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఆమెకు ఏపీ కాంగ్రెస్‌లో కీలక పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతోపాటు కడప లోక్‌సభ స్థానం నుంచి షర్మిలను కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలుపుతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కడప ఎంపీగా వైఎస్సార్ సీపీ నేత అవినాష్ రెడ్డి ఉన్నారు. అంటే అవినాష్‌ను పొలిటికల్‌గా ఢీకొనేందుకు షర్మిల బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినవస్తున్నాయి. అదే జరిగితే పోటీ ఎంత టఫ్‌గా మారిపోతుందో మనం అంచనా వేయొచ్చు. వైఎస్సార్ ఫ్యామిలీకి కడప జిల్లాపై ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ ఫ్యాన్స్ సపోర్ట్ షర్మిలకు ఈజీగా లభిస్తుందని, ఆమె అక్కడ పోటీ చేస్తే గెలవడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమిలో కాంగ్రెస్ కూడా చేరుతుందని అంటున్నారు. అదే జరిగితే కడప ఎంపీ స్థానంలో షర్మిలకు బలమైన టీడీపీ క్యాడర్ మద్దతు కూడా లభిస్తుంది. వెరసి అక్కడ షర్మిల గెలుపునకు మార్గం సుగమం అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల క్రిస్మస్ సందర్భంగా షర్మిల.. టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌కు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపారు. ట్విట్టర్ వేదికగా షర్మిలకు నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఏపీలో క్రైస్తవ మతపెద్దలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో క్రైస్తవులంతా కాంగ్రెస్ వైపు ఉండాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఏపీ రాజకీయ పరిణామాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. వైఎస్ షర్మిల ఒకవేళ ఏపీ పాలిటిక్స్‌లోకి ఎంటరైతే.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పరిస్థితి ఏమిటి ? తెలంగాణలో పొలిటికల్ యాక్టివిటీని షర్మిల ఆపేసినట్టేనా ? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. వచ్చే 4 నెలల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎలా మారుతాయో వేచిచూడాలి.