ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహనిర్బంధం (YS Sharmila House Arrest) చేశారు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఉన్న ఆమె నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఉద్దండరాయుని పాలెంలో షర్మిల పర్యటనకు ముందు పోలీసులు ముందస్తుగా ఆంక్షలు విధించారు. 2015లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించాలన్న షర్మిల యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు, ఆమెను ఇంటికే పరిమితం చేశారు. పోలీసులు భారీగా మోహరించడంతో షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. షర్మిలను బయటకు రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఆమె తన అసహనం వ్యక్తం చేశారు.
Pahalgam Terror Attack : అసలు సూత్రధారి ఇతడే !
ఈ ఘటనపై వైఎస్ షర్మిల ఎక్స్ (మాజీగా ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? రాజ్యాంగ హక్కులను కాలరాయడం నేరం కాదా?” అని ప్రశ్నించారు. విజయవాడలోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారో సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ పీసీసీ కార్యాలయానికి వెళ్లే తన హక్కును కూడా అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా ఉద్దండరాయుని పాలెం వెళ్లి తీరుతానని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు ఈ క్రమంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇదిలా ఉండగా మే 2న ప్రధాని మోడీ సభ కోసం అమరావతిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు 5 లక్షల మందిని సమీకరించేలా ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. రహదారుల పునరుద్ధరణతో పాటు ప్రజలు వేదిక వద్దకు చేరేందుకు మార్గాలను సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో షర్మిలపై మోదీ అభిమాని పూల ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేయడం మరో మలుపుగా మారింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనను ప్రస్తావిస్తూ, షర్మిల ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.