తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) చేపట్టిన కులగణన (Cast Census) దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని, భారతదేశ భవిష్యత్తుకు ఇది దిక్సూచిగా మారుతుందని ఆమె పేర్కొన్నారు. దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించేందుకు రాహుల్ గాంధీ చూపిన దూరదృష్టికి ఇది నిదర్శనమని షర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 90 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉండటం విశేషమని, ఈ వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
Prayagraj : మహా కుంభమేళాలో పాల్గొన్న భూటాన్ రాజు..
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే విధంగా కులగణన చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. ఐదున్నర కోట్ల జనాభాలో వెనుకబడిన వర్గాల సంఖ్యను తేల్చాల్సిన అవసరం ఉందని, ఈ లెక్కల ఆధారంగా సముచితంగా రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె కోరారు. కుల వివక్షను ఎదుర్కొంటున్న బలహీన వర్గాల సంఖ్యను లెక్కించడంతోపాటు, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు కులగణన ప్రారంభించినప్పటికీ, ఆ నివేదికను ప్రచురించకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ దిశానిర్దేశంతోనే ఆ సర్వే వివరాలు బయటకు రాకుండా అడ్డుకున్నారని షర్మిల అన్నారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తూ, దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నామని షర్మిల తెలిపారు. బీజేపీ మాత్రం రిజర్వేషన్ల రద్దు కోసం కుట్రలు పన్నుతోందని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ మాటలు నమ్మకూడదని, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు.