YS Rajasekhara Reddy Death Anniversary 2023 : వైయస్ఆర్ కు మరణం అనేది లేదు

తెలుగు ప్రజల గుండె చప్పుడు.. అపర భగీరథుడు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy ) వర్ధంతి నేడు.

  • Written By:
  • Publish Date - September 2, 2023 / 06:06 AM IST

YS Rajasekhara Reddy Death Anniversary 2023 : తెలుగు ప్రజల గుండె చప్పుడు.. అపర భగీరథుడు, మహానేత డాక్టర్ వై. యస్. రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy ) వర్ధంతి నేడు. సంక్షేమానికి కొత్త భాష్యం చెబుతూ.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ రామరాజ్యాన్ని తలపించింది ఆయన పాలన. ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందించిన గొప్ప నేత. తన పాలనా కాలంలో వ్యవసాయం, ఇరిగేషన్, ప్రజారోగ్యం, విద్యా రంగాలకు పెద్దపీట వేసి ప్రజల హృదయాల్లో చిరంజీవి అయ్యారు వైఎస్సార్. ఆయన మరణించి 14 ఏళ్లు కావొస్తున్నా.. తెలుగు ప్రజల స్మృతిపథంలో మాత్రం ఇంకా నిలిచేవున్నారు. అచ్చ తెలుగు పంచెకట్టు, చెరగని చిరునవ్వు, ప్రతి ఒక్కరిని పేరు పేరునా ‘‘నమస్తే నమస్తే ’’ అంటూ పలకరించే ఆ పిలుపు ఇంకా ప్రతి ధ్వనిస్తూనే వుంది.

వై. యస్. రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy ) ..జయమ్మ, రాజారెడ్డి దంపతులకు 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. రాజశేఖర్ రెడ్డి పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ లో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల (యెస్.వి.ఆర్.ఆర్), తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy ) ఎన్నికయ్యాడు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేత గా, రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపాడు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్ధన్‌రెడ్డిని పదవినుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాదు నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు.

2004-09 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారు. 2003లో మండువేసవిలో దాదాపు 1467 కి.మీ. దూరం పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన అనేక రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, 18 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో 2009లో మరోసారి ఆయన సీఎంగా ఎన్నికయ్యారు. వైఎస్ సీఎంగా ఎన్నికైన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమం కోసం బయల్దేరిన ఆయన ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలను కలచివేసింది.

మండుటెండలో (YS Rajasekhara Reddy) 1472 కిలోమీటర్ల పాదయాత్ర :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వరుస ఓటములతో ఉంటె.. టీడీపీ పార్టీ దూకుడు తో ఉంది. సీఎంగా, ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు జాతీయ రాజకీయాలను శాసిస్తున్న పరిస్ధితి. కానీ రాష్ట్రంలో మాత్రం పేదల పరిస్థితి దిగజారుతూ పోయింది. వర్షాలు లేక కరువు తాండవం ఆడుతోంది. విద్యుత్ ఛార్జీలను తగ్గించమంటే ప్రభుత్వం పేదలను గుర్రాలతో తొక్కించి, కాల్చి చంపించింది. బతుకు దుర్భరమై, జీవితం అస్తవ్యస్తమైన దశలో వైఎస్సార్ నేనున్నానంటూ బయల్దేరారు. మండుటెండలో చేవేళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా ప్రస్థానం పేరుతో 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అప్పటి నుంచే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయాలనే దానిపై గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు వైఎస్సార్.

సంక్షేమానికి (YS Rajasekhara Reddy) పెద్దపీట :

దేశం కనివినీ ఎరుగని స్థాయిలో సంక్షేమ పాలనను అందించారు YS Rajasekhara Reddy. ముఖ్యంగా జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కార్యక్రమాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలకు దగ్గర చేశాయి. ఈ పథకాల అమలులో ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదురైనా , నిధుల సమస్య వచ్చినా వైఎస్ వెనకడుగు వేయలేదు. ఎందుకంటే మడమ తిప్పడం ఆయన డిక్షనరీలోనే లేదు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు సాగునీరు అందించేలా జలయజ్ఞం పేరుతో 84 ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టి అపర భగీరథుడిగా ఖ్యాతి గడించారు వైఎస్సార్.

పేదలకు భరోసానిచ్చిన (Aarogyasri) ఆరోగ్యశ్రీ:

2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన ‘‘ఆరోగ్యశ్రీ’’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఓ కార్డ్ తీసుకుని రాష్ట్రంలో నచ్చిన ఆసుపత్రిలో ఉచితంగా కార్పోరేట్ వైద్యాన్ని అందుకునేలా పేదవాడికి భరోసా కల్పించారు YS Rajasekhara Reddy. అలా ఎన్నో వేల గుండెలకు రాజశేఖర్ రెడ్డి ప్రాణం పోశారు. ఆ గుండెలు లబ్..డబ్..లబ్ డబ్ అని కాకుండా వైఎస్ఆర్‌.. వైఎస్ఆర్‌ అని ఇప్పటికి కొట్టుకుంటూనే ఉన్నాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) :

పేదరికం కారణంగా కారణంగా పిల్లలు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారు. ఆయన చూపిన బాటలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతులకు చెందిన విద్యార్ధులు డాక్టర్, ఇంజినీర్ లాంటి ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాదు.. జిల్లాకు ఒక యూనివర్సిటీ కాన్సెప్ట్ వైఎస్‌దే. తాడేపల్లి గూడెంలో ఉద్యానవర్సిటీ, తిరుపతిలో పశువైద్య కళాశాలను నెలకొల్పారు. ఐఐటీ హైదరాబాద్, మూడు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు.

ఉచిత విద్యుత్ (Free Electricity) :

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించలేదంటూ టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేశారు. రూ.1100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. రూ.6 వేల కోట్ల విద్యుత్ సబ్సిడీలను అమలు చేశారు. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర కల్పించేందుకు వైఎస్సార్ శ్రమించారు.

రచ్చబండ కార్యక్రమానికి (Rachabanda Program) వెళుతూ.. అనంత లోకాలకు వెళ్లిన రాజన్న :

2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన నేలకొరిగారు. ప్రమాద ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వైస్సార్ తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర మంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం రాజన్న మన మధ్య లేకపోయినా ఆయన సంక్షేమ పధకాలు..ఆరోగ్య శ్రీ..ఉచిత విద్యుత్..ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో పధకాలు రాజన్న ను గుర్తు చేస్తూనే ఉంటాయి.

Also Read:  Modi Strategy? : ఒకేసారి ఎన్నికలు వెనక మోదీ వ్యూహం అదేనా?