Viveka Murder Case: వివేకా హ‌త్య కేసులో బిగ్ ట్విస్ట్.. ప‌ట్టు బిగిస్తున్న సీబీఐ..!

  • Written By:
  • Publish Date - February 25, 2022 / 03:52 PM IST

ఏపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు ఇప్ప‌టికే రోజుకో మ‌లుపు తిప్పుతున్న క్ర‌మంలో, తాజాగా కొత్త ట్విస్ట్ తెర‌పైకి వ‌చ్చింది. వివేకా హ‌త్య కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత కొత్త రంగులు పుల‌ముకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సీబీఐ విచార‌ణ‌లో ప‌లు కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్‌ ఇనయతుల్లా తాజాగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించార‌ని స‌మాచారం.

వివేకా మృతి త‌ర్వాత‌, ఆయన ఇంట్లోకి ఫస్ట్ వెళ్ళింది అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంక‌ర్ రెడ్డిలే అని, వివేకానంద‌రెడ్డి బెడ్‌రూమ్ అండ్ బాత్‌రూమ్‌లోకి తొలుత వారిద్ద‌రే వెళ్లార‌ని, ఆ త‌ర్వాతే మిగిలిన‌వారు ఇంట్లోకి వెళ్ళార‌ని ఇనయతుల్లా చెప్పారు. వివేకా మృతదేహం ఫొటోల్ని తాను తీశానని, అయితే తాను ఫొటోలు తీస్తున్నట్లు గుర్తించిన ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి తన పైన ఆగ్రహం వ్యక్తం చేసారని ఆయ‌న తెలిపారు. ఇక ఆ సమయంలో వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి కూడా గదిలో ఉన్నారని, వివేకానంద‌రెడ్డికి ఏదో జరిగిందని, గంగిరెడ్డి కంగారు చూస్తుంటే, త‌న‌కు అనుమానంగా ఉంద‌ని కృష్ణారెడ్డితో చెప్పానని ఇనయతుల్లా సీబీఐకి చెప్పారు.

అయితే ఘ‌ట‌న జ‌రిగిన కొంత సేప‌టి త‌ర్వాత‌ వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో చనిపోయారని, గాయాలకు బ్యాండేజీ, కాటన్‌ చుట్టాలని, అక్క‌డ ఉన్న‌ రక్తపుమడుగు శుభ్రం చేయాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని, తాను స్పందిచ‌క‌పోవ‌డంతో త‌న‌పై కేసులు వేశార‌ని తెలిపాడు. ఆ తరువాత భాస్కర రెడ్డి, మనోహర్ రెడ్డిలు వ‌చ్చి వివేకా మృతదేహాన్ని ఉంచేందుకు ఫ్రీజర్‌ బాక్సు తెప్పించారన్నారు. ఘటన జరిగిన వెంటనే పులివెందుల సీఐ శంకరయ్య అక్కడకు వచ్చి బాత్ రూమ్‌ను పరిశీలించారని, అక్కడ ఉన్న అల్మారా హ్యాండిల్‌ విరిగి ఉండటాన్ని తాను చూసానని, అయితే అంతకుముందు అది విరిగి లేదనే విషయాన్ని శంకరయ్యకు చెప్పినట్లుగా ఇనయతుల్లా పేర్కొన్నారు.

ఇక ఇంట్లోని గోడల పైన రక్తపు మరకలను ఉన్న‌ట్టు గమనించానని, దీంతో వివేకానంద‌రెడ్డిని ఎవ‌రో హత్య చేశార‌నే అనుమానం ఉంద‌ని తాను సీఐ శంక‌ర‌య్య‌తో చెప్పాన‌ని, అయితే దానికి మీ బాస్‌ను చంపాల్సిన అవ‌స‌రం ఎవరికి ఉంటుంది, ఆయన కబోడ్ పై పడిపోయుంటారని సీఐ శంక‌ర‌య్య‌ చెప్పిన‌ట్టుగా సీబీఐకి వివ‌రించారు.ఇక వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకా ఇంట్లోని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి చూసేసరికి, అప్పటికే అక్క‌డ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇనయతుల్లా అక్కడ ఉన్నారని ప్ర‌తాప్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

ఆ స‌మ‌యంలో బెడ్‌పైన‌, నేలపైన రక్తపు మరకలు ఉన్నాయ‌ని, బాత్‌రూమ్‌లో ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ వివేకా మృతదేహం కనిపించిందని, వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి చెప్పారని, అయితే అక్కడి పరిస్థితులను చూస్తే వివేక మ‌ర‌ణించింది గుండెపోటుతో కాదని, ఏదో జరిగిందని నాకు అర్థమైందన్నారు. ఇక అవినాశ్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి దగ్గరుండి పని మనిషితో రక్తపు మరకలను శుభ్రం చేయించార‌ని, దీంతో సాక్ష్యాధారాలను ఎందుకు చెరిపేస్తున్నారని సీఐ శంక‌రయ్య‌ ప్రశ్నించినా వాళ్లు పట్టించుకోలేద‌ని ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. కడప ఎంపీ టికెట్‌ తనకు ఇవ్వకున్నా పర్లేదని, త‌న‌కు ఇవ్వ‌కుంటే ష‌ర్మిల, విజయమ్మకు ఇవ్వాలని వివేకానంద‌రెడ్డి కోరారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ప్ర‌తాప్ రెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం వివేకా కేసు రోజుకో మ‌లుపు తిరుగుతున్న నేప‌ధ్యంలో, ముందు ముందు ఇంకెన్నిసంచ‌ల‌నాలు తెర‌పైకి వ‌స్తాయో చూడాలి.