Site icon HashtagU Telugu

U Turn Jagan : మాట మార్చాడు.. మ‌డ‌మ తిప్పాడు..!

Ys Jaga U Turn

Ys Jaga U Turn

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లకు ముందు వైసీపీ శ్రేణులు క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో ముఖ్యంగా అప్ప‌టి ముఖ్యమంత్రి చంద్ర‌బాబును యూట‌ర్న్ బాబు అని ర‌క రకాల మీమ్స్‌తో జోరుగా ప్ర‌చారం చేసిన వైసీపీ సోష‌ల్ మీడియా చంద్ర‌బాబు ఇమేజ్‌ను ఫుల్లుగా డ్యామేజ్ చేసింది.

ఇక మ‌రోవైపు జ‌గ‌న్ మాట మార్చ‌డు, మ‌డ‌మ తిప్ప‌డు జ‌గన్ ఇమేజ్ పెరిగేలా సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్ర‌చారం చేశారు.
అయితే ఇప్పుడు రోజులు మారాయి.. నాడు జ‌గ‌న్‌కు ప్ల‌స్ అయిన సోష‌ల్ మీడియా, ఇప్పుడు మైన‌స్ అవుతోంది. ఈ క్ర‌మంలో ఏపీలో గ‌డ‌చిన మూడేళ్ళ‌లో జ‌గ‌న్ తీసుకున్న యూటర్న్‌లు ఇవే అంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి.

అమ‌రావ‌తి:

జ‌గ‌న్ తీసుకున్న యూట‌ర్న్ లిస్ట్‌లో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మొద‌టి స్థానంలో ఉంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు తాము అధికారంలోకి వ‌స్తే, అమరావతిని అభివృద్ధి చేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్, తీరా అధికారంలోకి వచ్చాక, మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి, అమరావతి అభివృద్ధిని అటకెక్కించేశారు. అంతేకాకుండా మూడు రాజధానుల చట్టం తెచ్చి, దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ యూట‌ర్న్ తీస‌కున్నార‌ని సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతుంది.

మ‌ధ్య‌పాన నిషేధం:

ఇక మద్యం విధానం విషయానికొస్తే, ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే, ఆంధ్రప్ర‌దేశ్‌లో లిక్కర్ ధరలు విప‌రీతంగా పెంచారు. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త రావ‌డంతో లిక్క‌ర్ ధ‌ర‌లు తగ్గించేశారు. ఈ క్ర‌మంలో ధరలు పెంచడం ద్వారా మద్యపానాన్ని నియంత్రించగలుతామని చెప్పి, ధరలు తగ్గించడానికి సహేతుకమైన కారణాలు చెప్పలేకపోయారు. ఇది జ‌గ‌న్ స‌ర్కార్ ఫెయిల్యూర్ అని, మ‌ధ్య‌పాన నిషేధం పై కూడా జ‌గ‌న్ తీసుకున్నార‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

శాస‌న రాజ‌ధాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాసన రాజధాని విషయానికొస్తే, ఇది మరీ అత్యంత దారుణమైన యూటర్న్. తమ చేతిలో శాసన మండలి రద్దు వ్యవహారం వుండదని తెలిసీ, నాటకీయ పరిణామాల మధ్య శాసన మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించేశారు. ఆ తర్వాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది జ‌గ‌న్ స‌ర్కార్. జ‌గ‌న్ తీసుకున్న అత్యంత దారుణ‌మైన యూట‌ర్న్ ఇదే అని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.

సినిమా టికెట్ల రేట్లు:

జ‌గ‌న్ తీసుకున్న యూట‌ర్స్‌ల మరో ముఖ్యమైన అంశం సినిమా టిక్కెట్ల వ్యవహారం. సామాన్యుడికి సినిమాని దూరం చెయ్యకూడదన్న ఉద్దేశ్యంతో టిక్కెట్ ధరల్ని తగ్గించామని చెప్పిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు పరిశ్రమ బాగు కోసం టికెట్ రేట్లు పెంచుతున్నామ‌ని మాట మార్చారు. మరి రాత్రికి రాత్రే పేద సినీ ప్రేక్షకులు ధనవంతులైపోయారని వైసీపీ భావిస్తుంద‌ని అనుకోవాలా, ప్ర‌తి అంశం పై యూట‌ర్న్ తీసుకోవ‌డం జ‌గ‌న్‌కు అల‌వాటే అని సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ పై ఓరేంజ్‌లో కామెట్స్ చేస్తున్నారు.

అన‌ర్హ‌త వేటు:

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున పోటీ చేసి గెలిచిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఆత‌ర్వాత చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో భాగంగా అధికార టీడీపీలోకి జంప్ అయిన సంగ‌తి తెలిసిందే. వారిలో కొంద‌రు చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో చోటు కూడా ద‌క్కించుకున్నారు. దీంతో తాము అధికారంలోకి వ‌స్తే, పార్టీ మారే ప్ర‌జా ప్ర‌తినిథుల‌పై వెంట‌నే అన‌ర్హ‌త వేటు వేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అయితే వల్లభనేని వంశీ సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పై జ‌గ‌న్ స‌ర్కార్ అనర్హత వేటు వేయ‌లేదు. దీంతో ఇది జ‌గ‌న్ మ‌రో యూట‌ర్న్‌గా భావించాల‌ని సోష‌ల్ మీడియ‌లో చ‌ర్చించుకుంటున్నారు.