ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. మంత్రులుగా పనిచేసిన సీనియర్ రాజకీయ నేతలు కూడా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఇంచార్జ్ లేని పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షులతో కలిసి, అవసరమైన చోట్ల నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తున్నారు.
తాజాగా, వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమారుడు ముద్రగడ గిరికి ప్రమోషన్ ఇచ్చారు. గిరికి ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. ఆయన్ను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం గిరికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Mudragada Giri
ముద్రగడ పద్మనాభం గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలక నేతగా ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014-2019 మధ్య కాపు ఉద్యమ నేతగా ఆయన కీలక బాధ్యతలను నిర్వహించారు, కానీ ఆ తర్వాత ఆ పదవి నుంచి తప్పుకున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు వరుసగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖలు రాశారు. ఆ తరువాత కొంతకాలం రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్నారు. అయితే, 2024 ఎన్నికల నేపథ్యంలో ముద్రగడ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావించారు. ఈ క్రమంలో ఆయన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగింది. కానీ, ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు.
జనసేన నుంచి ఆహ్వానం రాకపోవడంతో కొద్ది రోజుల తరువాత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ వైఎస్సార్‌సీపీ అధిష్టానం ముద్రగడకు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతలు అప్పగించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును “ముద్రగడ పద్మనాభ రెడ్డి”గా మార్చుకుంటానని ఆయన సవాల్ చేశారు. కానీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో, ముద్రగడ తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న విషయం తెలిసిందే.
ప్రత్తిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే, ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసిన వరుపుల సుబ్బారావు విజయం సాధించారు. కానీ కొంతకాలం తర్వాత, ఆయన వైఎస్సార్‌సీపిని వీడి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో, టీడీపీ వరుపుల సుబ్బారావుకు టికెట్ ఇవ్వకుండా, వరుపుల రాజాకు ఛాన్స్ ఇచ్చింది. అయితే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతిలో వరుపుల రాజా ఓడిపోయారు.
2019 ఎన్నికల ఫలితాల తర్వాత వరుపుల సుబ్బారావు మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో, వైఎస్సార్‌సీపీ తన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ను పక్కన పెట్టి వరుపుల సుబ్బారావును పోటీకి నిలిపింది. కానీ, టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ చేతిలో ఆయన ఓడిపోయారు. ఇక, వరుపుల సుబ్బారావు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న సమయంలో, ఆయన స్థానంలో ఇప్పుడు ముద్రగడ గిరికి బాధ్యతలు అప్పగించారు.