Site icon HashtagU Telugu

Y S Jagan : మూడేళ్ల‌ జ‌గ‌న్ పాల‌న‌!

Jagan Ysrcp

Jagan Ysrcp

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మూడేళ్ల క్రితం బాధ్య‌త‌లు చేపట్ట‌ని రోజు ఇది. ఆ సంద‌ర్భంగా ఆయ‌న ట్వీట్ చేస్తూ సేవ చేసే అవ‌కాశం ఇచ్చిన ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మూడేళ్ల పాల‌న, భ‌విష్య‌త్ పై ఆయ‌న సంచ‌ట‌న ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో మ‌రింత సేవ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. విప‌క్షాలు మాత్రం ఆయ‌న పాల‌న విధ్వంసం అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్లు వ‌ర్షం కురిపిస్తున్నాయి. సీఎం జ‌గ‌న్ మాత్రం అద్భుత‌మైన పాల‌న అందించిన‌ట్టు భావిస్తున్నారు. టూకీగా మూడేళ్ల పాల‌న‌పై రివ్యూ చేస్తే..

పరిపాల‌న అనుభ‌వం లేక‌పోయిన‌ప్ప‌టికీ మూడేళ్ల క్రితం సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాబినెట్ కూర్పుతోనే సంచ‌ల‌నం సృష్టించారు. కాపు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల‌కు ప్రాధాన్యం ఇస్తూ ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను తొలి క్యాబినెట్ లోనే చేశారు. ఆనాటి నుంచి సామాజిక న్యాయం దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్న‌ట్టు ఫోక‌స్ అయింది. ఫింఛ‌న్లతో పాటు 2019 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌పై తొలి సంత‌కం చేసిన ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు నిర్మించిన ప్ర‌జావేదిక కూల్చి వేశారు. ఆ రోజున జ‌గ‌న్ అభిమానులు శ‌భాష్ అంటూ తొడ‌లు చ‌రిచారు. కృష్ణా క‌ర‌క‌ట్ట మీద ఉన్న అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేస్తామంటూ ముందుకు అడుగులు వేశారు జ‌గ‌న్. కానీ, ఆ నిర్మాణాల‌ను కూల్చ‌డంలో వైఫ‌ల్యం చెందారు. ప్ర‌జా ధ‌నం రూ. 9కోట్ల‌తో నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను మాత్రం కూల్చివేసి చంద్ర‌బాబునాయుడుపై ఉన్న క‌సిని నిరూపించారు.

తొలి ఏడాదిలోనే వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా విద్యా రంగంపై దృష్టి పెట్టారు. అదే స‌మ‌యంలో ఇసుక , మ‌ద్యం సిండికేట్లు విచ్చ‌ల‌విడిగా రెచ్చ‌పోవ‌డంతో నిర్మాణ రంగం కుప్ప‌కూలింది. రాజ‌ధాని అమ‌రావ‌తి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ అంటూ అసెంబ్లీ వేదిక‌గా ర‌చ్చ చేసిన జ‌గ‌న్ హైకోర్టు, సుప్రీం కోర్టుల నుంచి చివాట్లు తిన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో ఆయ‌న సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఏడాది కూడా ప‌రిపాల‌న చేయ‌లేక‌పోయారు. ఏడాది త‌రువాత మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటాన‌ని తొలి రోజుల్లో చెప్పిన జ‌గ‌న్ అందుకు విరుద్ధంగా ప‌రిపాల‌న సాగించాడ‌ని ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌.

మూడేళ్లు సీఎంగా జ‌గ‌న్ ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా ఏడాది కూడా స‌క్ర‌మంగా ప్ర‌భుత్వం న‌డ‌వ‌లేదు. ఆ స‌మ‌యంలో టీడీపీ మాజీ మంత్రుల‌ను అరెస్ట్ చేయ‌డానికి మాత్ర‌మే జ‌గ‌న్ ప‌రిమితం అయ్యార‌న్న అప‌వాదును మూట‌క‌ట్టుకున్నారు. మ‌ద్యం, ఇళ్ల స్థ‌లాలు, ఇసుక , విద్యుత్ కుంభ‌కోణాలు భారీగా జ‌రిగాయ‌ని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ మాజీ మంత్రుల అవినీతి భాగోతాల‌ను త‌వ్వితీసిన ప్ర‌తిప‌క్షం క‌ర‌ప‌త్రాల రూపంలో పంచిపెట్టింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో క్యాబినెట్ ను మార్చేశారు. బీసీల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు ఈక్వేష‌న్ తో సామాజిక న్యాయం అంటూ మ‌రోసారి ఫోక‌స్ చేస్తున్నారు.

సంక్షేమం, పాల‌నా సంస్క‌ర‌ణ‌లు అంటూ చెబుతున్న జ‌గ‌న్ ల‌బ్దిదారుల‌ను వీలున్నంత వ‌ర‌కు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశార‌న్న ఆరోప‌ణ ఉంది. వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి షెడ్యూల్ ప్ర‌కారం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కిన‌ప్పిటీకీ ల‌బ్దిదారుల ఖాతాలో న‌గ‌దు జ‌మ కాలేద‌న్న ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ప్ర‌ధాన హామీలు ప్ర‌త్యేక‌హోదా, మ‌ద్య నిషేధం , సీపీఎస్ ర‌ద్దు, నిరుద్యోగ‌భృతి తదిత‌రాల‌ను అమ‌లు చేయ‌లేక జ‌గ‌న్ చేతలు ఎత్తేశారు. పారిశ్రామిక ప్ర‌గ‌తి , ఉగ్యోగ‌, ఉపాథి క‌ల్పన విష‌యంలో ఘోరంగా జ‌గ‌న్ వైఫ‌ల్యం చెందారు. రైతు భ‌రోసా, గ్రామీణావృద్ధికి సంబంధించిన జాతీయ అవార్డుల‌ను గెలుచుకున్న ఏపీ స‌ర్కార్ వాటిని ప‌రిపాల‌న‌కు గీటురాయిగా చెప్పుకుంటోంది. మొత్తంగా మూడేళ్ల ప‌రిపాల‌న అద్భుతం అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేయ‌డాన్ని విప‌క్షాలు త‌ప్పుబుతున్నారు.

నేను విన్నాను- నేను ఉన్నానంటూ ప్రజల్లోకి వెళ్లిన జ‌గ‌న్ కు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
151 అసెంబ్లీ, 22 లోక్‌సభ సీట్లను కట్టబెట్టి, చరిత్రలో నిలిచిపోయే సువర్ణ విజయాన్ని జగన్‌ ఖాతాలో వేశారు. ఇదే సమయంలో సీఎం జగన్ తన మూడేళ్ల పాలన..భవిష్యత్ పైన ట్వీట్ చేసారు. అందులో “ మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆకాక్షించారు. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా“ అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. సామాజిక న్యాయ భేరీ యాత్ర పూర్తి చేసిన మంత్రులు జిల్లాల్లో జరుగుతున్న మూడేళ్ల పాలన వేడుకల్లో పాల్గొన్నారు. 2024దిశ‌గా సామాజిక న్యాయం దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేస్తూ ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేశారు. ఇంకోవైపు మ‌హానాడు సూప‌ర్ హిట్ కావ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై వ్య‌తిరేక‌త ఉంద‌ని టీడీపీ విశ్వ‌సిస్తోంది. అందుకే, మినీ మ‌హానాడుల‌ను నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నిర్వ‌హించ‌డం ద్వారా జ‌గ‌న్ మూడేళ్ల పాల‌నా వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని చంద్ర‌బాబు స్కెచ్ వేశారు. మొత్తం మీద అధికార‌ప‌క్షం మూడేళ్ల పాల‌న శ‌భాష్ అంటూ భావిస్తుంటే, విప‌క్షాలు మాత్రం జ‌గ‌న్ ప‌రిపాల‌న ఛండాలం అంటూ ప్ర‌జ‌ల మ‌ధ్య వెళుతున్నారు. ఫ‌లితంగా ముందుస్తు ఎన్నిక‌ల వేడి ఏపీలో క‌నిపిస్తోంది.