Tirumala Laddu Controversy : దేశంలో తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. కాలి నడకన తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శంచుకోనున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. ఆలయాల శుద్ధి కార్యక్రమాలు చేపట్టి స్వామివారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని పిలుపునిస్తున్నారు.
Read Also: Jammu Kashmir Elections: జమ్మూకు రాష్ట్ర హోదాపై రాహుల్ గాంధీ కీలక ప్రకటన
ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ సెప్టెంబర్ 28న పాప ప్రక్షాళణ పూజలు చేయాలని వైస్‌ఆర్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుమల అంశంలో చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళణగా పూజలు చేస్తామని జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తిరుమల అంశంపై ప్రజల్లో తమపై వ్యతిరేకత వస్తున్నందున, హిందూ సాంప్రదాయాలకు తాము వ్యతిరేకం కాదని నిరూపించేందుకు కాలి నడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని వైస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు తిరుమలలో లడ్డూ పవిత్రతను దెబ్బతీసింది సీఎం చంద్రబాబు అని, రాజకీయ లబ్ది కోసం కల్తీ నెయ్యి పేరుతో చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన తరహాలోనే టెండర్లకు పిలిచి వైసీపీ పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో 18 సార్లు నెయ్యి క్వాలిటీ లేదని వెనక్కి పంపినట్లు తెలిపారు. ప్రతి వాహనాన్ని చెక్ చేసి, లోపాలు ఉంటే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించామన్నారు. జగన్ సీఎంగా ఉన్నా, చంద్రబాబు సీఎంగా ఉన్నా క్వాలిటీ లేకుంటే వెనక్కి పంపాల్సి ఉంటుందన్నారు.
జులై 17 వరకు ఆహార తినుబండారాలు కాంట్రాక్టర్లు నెయ్యిని సప్లై చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే క్వాలిటీ లేదని నెయ్యిని వెనక్కి పంపించారు. ఆ నెయ్యిని ఎక్కడా వాడలేదు. ఇలాంటివి ఎప్పుడూ వాడరని కొడాలి నాని తెలిపారు. కానీ చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం జంతువుల కొవ్వు కలిసింది, వాటితో లడ్డూ ప్రసాదాలు తయారుచేసి భక్తులకు ఇచ్చారని దుష్ప్రచారం చేశారని విమర్శించారు.