Site icon HashtagU Telugu

PRC Issue : జ‌గ‌న్ ‘రివ‌ర్స్ పీఆర్సీ’ దెబ్బ

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మిగిలిన రాజ‌కీయ వేత్త‌ల‌కు భిన్నం. ఆయ‌న పరిపాల‌నా విధానం కూడా విభిన్నం. ఎవ‌ర్ని ఎక్క‌డ ఉంచాలో..బాగా తెలిసిన సీఎం. అందుకే ఉద్యోగ సంఘాల నేత‌ల తోక‌లు ప‌ది నిమిషాల్లో క‌ట్ చేశాడు. వాళ్ల బ్లాక్ మెయిల్ వాల‌కానికి శాశ్వ‌తంగా చెక్ పెట్టాడు. స్వ‌ర్గీయ వైఎస్ తో స‌హా గ‌తంలోని ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని సాహ‌సం ఉద్యోగుల ప‌ట్ల జ‌గ‌న్ చేశాడు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా జీతాల‌ను పెంచ‌లేమ‌ని ఖ‌రాకండిగా చెప్పిన తొలి సీఎంగా చెప్పుకోవ‌చ్చు.ద‌శాబ్దాల ఏపీ చ‌రిత్ర‌ను అవ‌లోక‌నం చేసుకుంటే దాదాపు సీఎంలు అంద‌ర్నీ ఉద్యోగ సంఘాల నేత‌లు బ్లాక్ మెయిల్ చేశారు. వాళ్ల ఒత్తిడికి తొలొగ్గి పీఆర్సీని అత్య‌ధికంగా పెంచిన సీఎంల జాబితాలో చంద్ర‌బాబునాయుడు మొద‌టి వ‌రుస‌లో ఉంటాడు. ఆ త‌రువాత మాజీ సీఎం రోశ‌య్య అత్య‌ధికంగా పీఆర్సీని పెంచాడు. ముఖ్య‌మంత్రిగా ఉండే వాళ్ల బ‌ల‌హీన‌త‌ల‌ను ప‌ట్టుకుని పీఆర్సీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగులు పెంచుకుంటూ పోయారు. ఫ‌లితంగా రాష్ట్ర మొత్తం ఖర్చులో 60శాతానికి పైగా ఉద్యోగుల జీతాల‌కు వెళుతోంది.

భార‌త‌దేశంలోని ఏ రాష్ట్ర బడ్జెట్ లోనూ ఉద్యోగుల వాటా ఇంత మొత్తంలో లేదు. మిగులు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రాల్లోనూ ఉద్యోగుల కోసం పెట్టే ఖ‌ర్చు త‌క్కువ‌గా ఉంది. కానీ, ఓట్ల రాజ‌కీయాల‌కు అల‌వాటు ప‌డిన కొంద‌రు సీఎంలు ఉద్యోగుల అడుగుల‌కు మ‌డుగులొత్తారు. అత్య‌ధికంగా చంద్ర‌బాబు ఒక‌సారి 23శాతం, రాష్ట్రం విడిపోయిన త‌రువాత 43శాతం పీఆర్సీ ని అడ్డ‌గోలుగా పెంచాడు. దీంతో వేల కోట్ల రూపాయ‌ల భారం ప్ర‌జ‌ల‌పై ప‌డింది.
సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత వివిధ రూపాల్లో దాదాపు 12వేల కోట్ల వ‌ర‌కు ఉద్యోగులు బెనిఫిట్ పొందార‌ని ఆర్థిక శాఖ అంచ‌నా వేస్తోంది. ఆర్టీసీ కార్మికుల‌ను ప్ర‌భుత్వంలోని ఉద్యోగులు మాదిరిగా పోషిస్తున్నారు. కొత్త‌గా దాదాపు 1.50ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలను ప్ర‌భుత్వం క‌ల్పించింది. స‌చివాల‌య ఉద్యోగుల‌కు డ‌బుల్ హెచ్ ఆర్ ఏ, ఉచిత భోజ‌నం, ఉచిత ప్ర‌యాణం, ఉచిత వైద్యం…ఇలా అన్ని ఉచితంగా ఇస్తున్నందున రాష్ట్ర ఖ‌జానాపై భారంగా అనూహ్యంగా ప‌డింది.రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ప్ర‌మాక‌రంగా ఉంది. ఆ విష‌యాన్ని ఆర్బీఐ, కేంద్రం ఆర్థిక‌శాఖ‌, రాష్ట్రంలోని విప‌క్షాలు, కాగ్ త‌దిత‌ర ఆర్థిక సంస్థ‌లు చెబుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో `రివ‌ర్స్ పీఆర్సీ` చేయ‌డానికి అవ‌కాశం ఉంది. రాజ్యాంగం ప్ర‌కారం ఉన్న మార్గద‌ర్శ‌కాల్లోనూ ఆ విధంగా ఉంది. ఆ విష‌యాన్ని ప‌ది నిమిషాల్లో ఉద్యోగ సంఘ నేత‌ల‌కు సీఎం జ‌గ‌న్ వివ‌రించాడ‌ట‌. దీంతో మైండ్ బ్లాంక్ అయిన ఉద్యోగ నేత‌లు నిశ్శ‌బ్దంగా సీఎం ఛాంబ‌ర్ నుంచి వెనుతిరిగార‌ని స‌చివాల‌య వ‌ర్గాల టాక్‌.

పేద‌, ధ‌నిక వ‌ర్గాల మ‌ధ్య వ్య‌త్యాసం పెరిగిన రాష్ట్రాల జాబితాలో బీహార్ త‌రువాత ఏపీ ఉంది. తాజాగా కేంద్రం విడుద‌ల చేసిన ఆర్థిక నివేదిక ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. పే రివిజ‌న్ చేసే స‌మ‌యంలో ఆ నివేదిక‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ఆ విధంగా జ‌రిగితే..ఇప్పుడున్న జీతాలను త‌గ్గించాలి. కానీ, త‌గ్గించ‌కుండా ఉన్న జీతాల‌ను స‌క్ర‌మంగా తీసుకోవాలంటే…71డిమాండ్ల‌ను వెన‌క్కు తీసుకోవాల్సిందే. అందుకే,ఉద్యోగ సంఘం నేత‌లు చాలా తెలివిగా పోరాటాన్ని విర‌మించారు. దీనికితోడుగా 14400 టోల్ ఫ్రీనెంబ‌ర్ కు వ‌చ్చిన అవినీతి కాల్స్ ను ఓపెన్ చేసి చూస్తే ఉద్యోగ సంఘాల నేత‌లకు దిమ్మ‌తిరిగింద‌ట‌. సో..జ‌గ‌న్ తో తేల్చుకుంటామంటూ వెళ్లిన ఉద్యోగులు మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని మౌనం పాటిస్తున్నార‌న్న‌మాట‌.