AP BAC Meeting : టీడీపీతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `రాజీ`బాట‌

త‌న‌దాకా వ‌స్తేగానీ నొప్పి తెలియ‌దంటారు పెద్ద‌లు. స‌తీమ‌ణి భార‌తిని టీడీపీ టార్గెట్ చేయ‌డంతో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి జ్ఞానోద‌యం అయింది.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 02:21 PM IST

త‌న‌దాకా వ‌స్తేగానీ నొప్పి తెలియ‌దంటారు పెద్ద‌లు. స‌తీమ‌ణి భార‌తిని టీడీపీ టార్గెట్ చేయ‌డంతో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి జ్ఞానోద‌యం అయింది. ఒక మెట్టు దిగిన‌ట్టు బీఏసీ స‌మావేశంలో జ‌రిగిన సంభాష‌ణ క‌నిపిస్తోంది. టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెంనాయుడుతో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బీఏసీ వేదిక‌గా మాట క‌లిపార‌ట‌. `మనం రాజకీయ నాయకులమని , మనలో మనం వంద అనుకుంటాం. మేము కుటుంబాల జోలికి రావాలనుకోం. మీరు కుటుంబాల జోలికి వస్తే మా సీఎం కుటుంబాన్ని అంటారా అని మా వాళ్లు అంటారు. అందుకే మీరు కుటుంబాల గురించి మాట్లాడటం మానేస్తే, మా వాళ్లు కూడా ఆటోమేటిక్ గా మానేస్తారు` అని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పరోక్షంగా రాజీకి సిద్ధం అయ్యారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఏపీ, తెలంగాణ సీఎంల కుటుంబీకుల పాత్ర వెలుగుచూసింది. కేసీఆర్ కుమార్తె క‌విత స్కామ్ లో ఉన్నార‌ని బీజేపీ చెబుతోంది. లిక్క‌ర్ స్కామ్ పాత్ర‌ధారిగా ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తి ఉన్నార‌ని టీడీపీ కూపీ లాగింది. అంతేకాదు, విజ‌య‌సాయిరెడ్డి, భార‌తి తాడేపల్లి కేంద్రంగా చేసిన లిక్కర్ స్కామ్ `క్లూ` ల‌ను బ‌య‌ట‌కు తీసింది. వారం రోజుల పాటు అదే అంశంపై టీడీపీ ప‌లు కోణాల‌ను బ‌య‌ట‌కు తీస్తూ భార‌తిని టార్గెట్ చేసింది. ప్ర‌తిగా వైసీపీ వివ‌ర‌ణ ఇచ్చుకోలేని ప‌రిస్థితుల్లోకి వెళ్లింది. ఇటీవ‌ల మంత్రివ‌ర్గం స‌మావేశం నిర్వ‌హించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హ‌చ‌ర మంత్రుల‌కు అదే అంశంపై చుర‌క‌లేశార‌ట‌. అందుకే, మాజీ మంత్రి కొడాలి లిక్క‌ర్ స్కామ్ వివాదంలోకి ష‌డ‌న్ గా ఎంట్రీ ఇచ్చేశారు. ఇంకేముంది బండ‌బూతులు చంద్ర‌బాబు కుటుంబీకుల‌పై మొద‌లు పెట్టారు.

మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని రెండేళ్లుగా చంద్ర‌బాబు కుటుంబాన్ని బండ బూతులు తిడుతున్నారు. టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట భువ‌నేశ్వ‌రి `శీలం`పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ కార‌ణంగా చంద్ర‌బాబు అసెంబ్లీకి దూరంగా ఉంటూ ఎవ‌రికీ చెప్పుకోలేని మానిసిక బాధ‌ను అనుభ‌వించారు. బ‌హిరంగ క్ష‌మాప‌ణ వంశీ చెప్ప‌డంతో కొంత మేర‌కు ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది. మాజీ మంత్రి కొడాలి మ‌ళ్లీ భువ‌నేశ్వ‌రి `శీలాన్ని` శంకిస్తూ జుగుప్సాక‌రంగా మాట్లాడారు. ప్ర‌తిగా ఆయ‌న కుటుంబీకుల‌ను, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుటుంబీకుల్ని టీడీపీ టార్గెట్ చేసింది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనివార్యంగా స్పందించాల్సి వ‌చ్చింది.

సాధార‌ణంగా బీఏసీ స‌మావేశానికి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూరంగా ఉంటారు. కానీ, ఈసారి బీఏసీ స‌మావేశానికి ఆయ‌న హాజ‌రు అయ్యారు. ప్ర‌తిప‌క్షాన్ని ఏ మాత్రం ప‌ట్టించుకోని నైజం ఉన్న ఆయ‌న ఈసారి అచ్చెంనాయుడుతో మాట‌లు క‌ల‌ప‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, రాజీధోర‌ణిలో మాట్లాడ‌డం చూస్తుంటే, ఆయ‌న స‌తీమ‌ణి వ‌ర‌కు రావ‌డంతో నొప్పి జ‌గ‌న్ కు నొప్పి త‌గిలింది. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆ విధంగా రాజీ ప్ర‌య‌త్నం చేశాడ‌ని టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌. మొత్తం మీద చాలా కాలం త‌రువాత ఆయ‌న మొండిత‌నం వీడి రాజీ మార్గాన్ని ఎంచుకున్నాడ‌ని స‌చివాల‌య వ‌ర్గాల్లో వినిపిస్తోంది. రాబోవు రోజుల్లో ఇంకా చాలా మార్పు ఆయ‌న‌లో ఉంటుంద‌ని సెటైర్లు టీడీపీ వేస్తోంది.