Site icon HashtagU Telugu

YS Jagan : అమిత్ షా స‌మావేశానికి జ‌గ‌న్ దూరం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌త‌న జ‌రిగే స‌మావేశానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డుమ్మా కొట్ట‌బోతున్నారు. సెప్టెంబ‌ర్ 3వ తేదీన తిరువ‌నంత‌పురం కేంద్రంగా ద‌క్షిణాది రాష్ట్రాల మండ‌లి స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఆ స‌మావేశానికి అమిత్ షా అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. ఇలాంటి స‌భ గ‌తంలో తిరుపతి కేంద్రంగా జ‌రిగింది. ఈసారి కేరళ రాష్ట్రంలో పెట్టారు. అప్ప‌ట్లో తిరుపతిలో ఏపీ ప్రభుత్వం ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన విష‌యం విదిత‌మే.

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కానీ, సీఎం జగన్ మూడు రోజుల కడప పర్యటన కార‌ణంగా అమిత్ షా నిర్వ‌హించే స‌ద‌స్సుకు గైర్హాజ‌రు కానున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి సంద‌ర్భంగా ఇడుపులపాయలో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వ‌ర్గీయ వైఎస్ ఆర్ కు నివాళి అర్పించనున్నారు. తండ్రి వైయస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఈ సమావేశాలకు హాజరుకావడం లేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆయ‌న బ‌దులుగా మంత్రి బుగ్గన, సీనియ‌ర్ అధికారులు హాజ‌రుకానున్నారు. సీఎం సూచించిన 19 అంశాల‌పై ఆ స‌దస్సులో వినిపించ‌డానికి బుగ్గ‌న ప్రిపేర్ అవుతున్నారు.

జ‌గ‌న్ మూడు రోజుల క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌
సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం వేముల మండలం వేల్పులకు చేరుకుంటారు. అక్కడ 3.50 నుంచి 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. 4.10 గంటల నుంచి 5.10 గంటల మధ్య వేల్పుల గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు వేల్పుల నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు. సెప్టెంబర్‌ 2న ఉదయం 8.50 గంటలకు సీఎం జగన్‌ ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 9 గంటల నుంచి 9.40 గంటల వరకు ఎస్టేట్‌లోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎస్టేట్‌లోని ప్రేయర్‌ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సాయంత్రం 5 గంటల వరకు సమీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 5.10 గంటలకు వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 3వ తేదీ ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు.