. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ
. ప్రజల నుంచి కోటికి పైగా సంతకాలను సేకరించిన పార్టీ
. పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాలని వినతి
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఉద్యమంలో భాగంగా సేకరించిన కోటికి పైగా సంతకాలను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో జగన్ భేటీ కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరనున్నారు.
దీనికి ముందు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కోటి సంతకాల ప్రతులతో కూడిన వాహనాలను జగన్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరపనున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో “జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ” అనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలకు మంజూరు ఇచ్చామని పార్టీ స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ నిధులతో, పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ విద్యాసంస్థలను అభివృద్ధి చేయాలన్నదే తమ ఉద్దేశమని చెబుతోంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిధుల కొరత, సమర్థ నిర్వహణ అనే పేరుతో ఈ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకెళ్లి ప్రైవేటు రంగానికి అప్పగించే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ విధానం అమలులోకి వస్తే పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందుబాటులో ఉండదని, అలాగే సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు దూరమయ్యే ప్రమాదం ఉందని పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మెడికల్ విద్య పూర్తిగా వాణిజ్యంగా మారితే ఫీజులు పెరిగి, పేద కుటుంబాల పిల్లలు డాక్టర్లు కావాలన్న కలను కోల్పోతారని నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్యమానికి అక్టోబర్ 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీ సందర్శన సందర్భంగా వైఎస్ జగన్ నాంది పలికారు. అక్కడి నుంచే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమ శంఖారావం పూరించారు.
ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు, మండల కేంద్రాల్లో నిరసనలు, యువతతో బైక్ ర్యాలీలు, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రజల అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకు కోటి సంతకాల సేకరణ చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఉద్యమంలో భాగంగానే ఈరోజు గవర్నర్‌ను కలిసి ప్రజల గళాన్ని వినిపించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలని, పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని వైసీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తామని పార్టీ స్పష్టం చేసింది.
