AP Employees : ఏపీ ఉద్యోగుల‌కు `జ‌గ‌న్ మార్క్` క్ర‌మ‌శిక్ష‌ణ‌

విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సాహ‌సోపేత‌మైన‌, సంచ‌లన నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - August 17, 2022 / 02:00 PM IST

విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సాహ‌సోపేత‌మైన‌, సంచ‌లన నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్నారు. ఆ క్ర‌మంలో టీచ‌ర్ల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టడానికి `ఫేస్ రిగ‌గ్నైజేష‌న్‌` టెక్నాల‌జీని న‌మ్ముకున్నారు. ఉద్యోగుల‌ను టైమ్ కు ఆఫీస్ ల‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం జ‌గన్ చేస్తున్నారు. దాన్ని రాజ‌కీయ కోణం నుంచి టీచ‌ర్లు తీసుకెళుతున్నారు. గ‌త సీఎంలు ఎవ‌రూ చేయ‌లేని సాహ‌సాన్ని ఉద్యోగుల విష‌యంలో ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం చేస్తోంది. అందుకు స‌హ‌క‌రించాల్సిన ఉద్యోగులు కుంటిసాకులు చెబుతూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు. అంతేకాదు, టైమ్ కు ఆఫీస్ కు ర‌మ్మ‌న‌డాన్ని క‌క్ష్య‌సాధింపు కింద ప్ర‌చారం చేస్తున్నారు.

వాస్త‌వంగా సీపీఎస్ ర‌ద్దు, పీఆర్సీ అంశాల‌పై సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీన మిలియన్ మార్చ్ చేయాల‌ని ఉపాధ్యాయ‌, ఉద్యోగ సంఘాలు నిర్ణ‌యించాయి. ఆ మేర‌కు జిల్లాల వారీగా ఉద్యోగులు పెద్ద ఎత్తున వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే జిల్లాల వారీగా మిలియ‌న్ మార్చ్ ల‌ను కొన్ని చోట్ల చేశారు. అవి విజ‌య‌వంతం అయ్యాయ‌ని ఉద్యోగుల భావ‌న‌. కానీ, రాష్ట్ర స్థాయి టీచ‌ర్లు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా లేవ‌ని తెలుస్తోంది. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక వ‌ర్గం సానుకూలంగా ఉండేలా మ‌రో వ‌ర్గంగా సంఘాలు చీలిపోయాయి. గ‌తంలో మాదిరిగా సంఘాల‌ను ఐక్యంగా ముందుకు న‌డిపించ‌డం ద్వారా జ‌గ‌న్ స‌ర్కార్ ను మ‌రోసారి మిలియ‌న్ మార్చ్ ద్వారా సంఘ‌ట స్థితికి తీసుకెళ్లాల‌ని ప‌రోక్షంగా విప‌క్షాలు పావులు కదుపుతున్నాయి. ఆ లోపుగా బ‌యో మెట్రిక్ బ‌దులుగా ఫేస్ రిగ‌గ్నైజేష‌న్ ప‌ద్ద‌తిని టీచ‌ర్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం పెట్టింది. దీన్ని క‌క్ష్య‌సాధింపు చ‌ర్య‌గా ఉద్యోగుల భావించ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ల‌ను అంద‌రూ వాడుతున్నారు. యాడ్రాయిడ్ ఫోన్ల ద్వారా నిమిషం కూడా లేట్ కాకుండా టీచ‌ర్లు స్కూల్ కు వ‌చ్చిన‌ట్టు నిరూపించుకోవాలి. ఐ ఫోన్ ద్వారా లాగిన్ కావ‌డానికి అవ‌కాశం లేదు. కొన్ని చోట్ల ఇంట‌ర్ నెట్‌ స్పీడ్ సౌక‌ర్యం లేదు. ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌తో లేటైనా ఒక పూట సెల‌వు కింద ప‌రిగ‌ణిస్తారు. సింగిల్ టీచ‌ర్ ఉన్న చోట ఆ టీచ‌ర్ నిమిషం లేట్ గా వ‌చ్చిన‌ప్ప‌టికీ స్కూల్ ఉండ‌దు. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను టీచ‌ర్ల సంఘాల నేతలు లేవ‌నెత్తుతున్నారు. కానీ, ఆ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ప‌రిష్కారం వాళ్ల చేతుల్లోనే ఉంది. అయిన‌ప్ప‌టికీ ఏదో ఒక ర‌కంగా తిర‌కాసు పెట్ట‌డం ద్వారా బ‌యోమెట్రిక్ ను కొన‌సాగించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఫేస్ రిగ‌గ్నైజేష‌న్ ప‌ద్ధ‌తి టీచ‌ర్ల‌కు
మింగుడుప‌డ‌డంలేదు.

రాబోవు రోజుల్లో టీచ‌ర్లకు మ‌రిన్ని ల‌క్ష్యాల‌ను ఏపీ ప్ర‌భుత్వం నిర్దేశించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే స్కూల్స్ ను విలీనం చేసిన ప్ర‌భుత్వం జాతీయ సిల‌బ‌స్ ను అమ‌లు చేస్తోంది. అంతేకాదు, టైంటేబుల్ ప్ర‌కారం సిల‌బ‌స్ ను పూర్తి చేయ‌క‌పోతే టీచ‌ర్లకు గ్రేడ్ లు ఇవ్వ‌డం ద్వారా లూప్ లైన్ లో వేయ‌డానికి కూడా సిద్ధ‌ప‌డుతోంది. ఇప్ప‌టికే బ‌డ్జెట్ లోని 70శాతం నిధుల‌ను జీతాలుగా తీసుకుంటోన్న ఉద్యోగులు, టీచ‌ర్లలో ప‌నిచేసే సంస్కృతిని నేర్ప‌డానికి ఏపీ ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. ఇలాంటి ప్ర‌య‌త్నాలు గ‌తంలో సీఎంలుగా ప‌నిచేసిన వైఎస్ ఆర్‌, చంద్ర‌బాబు, జ‌నార్థ‌న్ రెడ్డి, కోట్ల త‌దిత‌రులు చేశారు. కానీ, ఉద్యోగుల ఒత్తిడికి తలొగ్గి వాళ్లు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటూ వెళ్లారు. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ మాత్రం ఉద్యోగులు, టీచ‌ర్ల గొంతెమ్మె కోర్కెలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వ‌డంలేదు. పైగా ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు తీసుకునే ఉద్యోగుల చేత స‌రిప‌డా ప‌నిచేయించాల‌ని అనుకుంటున్నారు. ఆయ‌న చేస్తోన్న ప్ర‌య‌త్నం స‌క్సెస్ అవుతుందా? గ‌త సీఎంల మాదిరిగా జ‌గ‌న్ కూడా వెనక్కు త‌గ్గుతారా? అనేది చూడాలి.