Site icon HashtagU Telugu

YSRCP : ఐదుగురు మంత్రులు, 70పైగా ఎమ్మెల్యేల‌కు `గ్రాఫ్‌` గండం

YCP Special status

Jagan Ycp Flag

`ఏదైనా ఆలోచ‌న వ‌స్తే దాన్ని అమ‌లు చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ మాత్రం పున‌రాలోచ‌న చేయ‌రు. ఒక‌సారి ఫిక్స్ అయితే ఇక అంతే.` అంటూ చెబుతుంటారు ఆయ‌న గురించి బాగా తెలిసిన వాళ్లు. స‌రిగ్గా ఇలాంటి వ్యాఖ్య‌లు ఇప్పుడు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేట‌ర్లు, నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిల‌కు చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. రెండు రోజుల ప‌ర్య‌ట‌న ముగించుకుని తాడేప‌ల్లికి చేరుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించ‌బోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫ్ ను బ‌య‌ట‌పెట్టేందుకు సిద్ధం అయ్యార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం క్యాబినెట్ లోని ముగ్గురు మంత్రుల‌ను మార్చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధం అయ్యార‌ని బ‌లంగా వినిపిస్తోంది. వాళ్ల‌లో మ‌హిళ మంత్రి ఒక‌రు ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. దానికి బ‌లం చేకూరేలా మంత్రిగా ఉన్న రోజా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రెండింగ్ లో ఉంది. వాస్తంగా ఆమె మంత్రి ప‌ద‌విని స్వీక‌రించిన త‌రువాత జీవిత ల‌క్ష్యం పూర్త‌యింద‌ని సంతోషిస్తూ ఇక బుల్లితెర‌కు స్వ‌స్తి అంటూ ప్ర‌క‌టించారు. కానీ, మంత్రి స్వీక‌రించిన అన‌తికాలంలోనే ఆమె ప‌లు అప‌వాదుల‌ను మూట‌గట్టుకున్నారు. మంత్రి వ‌ర్గం 2.0 గ్రూప్ ఫోటోలో ఆమె కూర్చొన్న ప్లేస్, బెంజ్ కారు కుమారుడికి గిఫ్ట్, ప‌ర్యాట‌క‌శాఖ‌లోని కొన్ని మార్పులు త‌దిత‌ర అంశాలు ఆమె మెడ‌కు చుట్టుకున్నాయి. అందుకే, ఆమె ఇటీవ‌ల దూకుడును త‌గ్గించారు. దీంతో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం ప‌రోక్షంగా చుర‌క‌లు వేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక మ‌రో. ఇద్ద‌రు మంత్రుల్లో ఒక‌రు గోదావ‌రి జిల్లాకు చెందిన మంత్రిగా చెబుతున్నారు. ఆయ‌న‌కు రెండోసారి కూడా మంత్రి ప‌ద‌విని పొడిగించారు. సామాజిక ఈక్వేష‌న్లో రెండోసారి పొడిగించాల్సి వ‌చ్చింది. ఆయ‌న గ్రాఫ్ దారుణంగా ఉంద‌ని తాజాగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ద్ద ఉన్న స‌ర్వే సారంశ‌మ‌ట‌. ఉత్రరాంధ్ర‌కు చెందిన మ‌రో మంత్రి ఆ మ‌ధ్య పోలీసుల‌తో వివాదానికి దిగారు. అంతేకాదు, వాళ్ల‌కు పోస్టింగ్ లు ఇప్పిస్తానంటూ ఆయ‌న అనుచ‌రుల‌ను శార‌దాపీఠంలోకి పంపించిన వీడియో అప్ప‌ట్లో వైర‌ల్ అయింది. ఆనాటి నుంచి ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఏ రోజైనా పోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ముగ్గురే కాకుండా మ‌రో ఇద్ద‌రు మ‌హిళా మంత్రుల గ్రాఫ్ కూడా బాగాలేద‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ర్గాల్లోని టాక్‌.

ఏపీలో లా అండ్ ఆర్డ‌ర్ ప్ర‌తి నిత్యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాదు, ప‌లు అంశాలు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా న‌డిచాయి. వాటిలో ప్ర‌ధాన‌మైన‌ది ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న‌గ్న‌వీడియో. దానిపై డీజీపీ, హో మంత్రి, ఎంపీ వేర్వేరుగా స్పందించారు. ఇక వైద్య ఆరోగ్య‌శాఖ ను లండ‌న్ త‌ర‌హాలో తీసుకురావాల‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు చాలా వేగంగా అమెరికా లాంటి దేశాల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ వేగాన్ని త‌ట్టుకునేలా మంత్రి, యంత్రాంగం స‌మ‌న్వ‌యం క‌నిపించ‌డంలేద‌నే భావ‌న తాడేప‌ల్లి ప్యాలెస్ కు చేరింద‌ట‌. ఆమె గ్రాప్ మీద కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే ముగ్గురు మంత్రుల‌ను మార్చేయ‌డానికి సంకేతాలు ఇచ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో ఇద్ద‌ర్ని కూడా మార్చేస్తార‌ని స‌రికొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక 70 నుంచి 80 మంది సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌డానికి అనుకూలంగా గ్రాఫ్ లు లేవ‌ని తెలుస్తోంది. వాళ్ల‌కు కూడా బుధ‌వారం జ‌రిగే మీటింగ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొన్ని బ‌ల‌మైన సంకేతాలు ఇస్తార‌ని స‌మాచారం. మూడు గ్రూప్ లుగా ఏ,బీ,సీ కింద ఎమ్మెల్యేల గ్రాఫ్ ల‌ను త‌యారు చేసిన‌ట్టు తెలుస్తోంది. సీ గ్రూప్ లో ఉండే సుమారు 70 నుంచి 80 మందికి టిక్కెట్లు లేవ‌ని చెప్ప‌డానికి జ‌గ‌న్ సిద్దం అయ్యార‌ని వినికిడి. ఇక బీ గ్రూప్ లోని వాళ్ల‌కు మ‌రో మూడు నెల‌లు టైం ఇస్తార‌ని తెలుస్తోంది. ఏ గ్రూప్ లోని వాళ్ల‌కు టిక్కెట్ల‌ను ఖ‌రారు చేస్తూ సంకేతాలు ఇస్తార‌ని స‌మాచారం. మొత్తం మీద బుధ‌వారం జ‌రిగే మీటింగ్ తో మంత్రులుగా ప‌దవులు కోల్పోయే వాళ్లు, 2024 దిశ‌గా టిక్కెట్లను ద‌క్కించుకోలేని వాళ్ల జాబితా తెలియ‌నుంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.