జ‌గ‌న్ గుజ‌రాత్ ఫార్ములా..100శాతం “ముంద‌స్తు” మంత్రివ‌ర్గం.ఎంపీల‌కు క్యాబినెట్ లో ఛాన్స్?

గుజ‌రాత్ త‌ర‌హా ఫార్ములాను ఏపీ సీఎం జ‌గ‌న్ ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ముఖ్య‌మంత్రితో స‌హా గుజ‌రాత్ క్యాబినెట్ ను పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానం మార్చేసింది. ఏపీలో సీఎం మిన‌హా మంత్రివ‌ర్గంలో అంద‌రూ మారే అవ‌కాశం ఉంది. ఆ మేర‌కు జ‌గ‌న్ సంకేతాలు ఇచ్చారు.

  • Written By:
  • Updated On - September 29, 2021 / 01:08 PM IST

గుజ‌రాత్ త‌ర‌హా ఫార్ములాను ఏపీ సీఎం జ‌గ‌న్ ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ముఖ్య‌మంత్రితో స‌హా గుజ‌రాత్ క్యాబినెట్ ను పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానం మార్చేసింది. ఏపీలో సీఎం మిన‌హా మంత్రివ‌ర్గంలో అంద‌రూ మారే అవ‌కాశం ఉంది. ఆ మేర‌కు జ‌గ‌న్ సంకేతాలు ఇచ్చారు. ఆ విష‌యాన్ని మంత్రి బాలినేని ఇటీవ‌ల వెల్ల‌డించారు. నూటికి నూరు శాతం మంత్రివ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌ని కుడ్డ‌బ‌ద్ధ‌లు కొట్టారు. త‌న‌తో పాటు అంద‌రూ మంత్రివ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు రావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. సీనియ‌ర్ల‌ను రాబోయే 2024 ఎన్నిక‌ల దిశ‌గా ఉప‌యోగించుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నట్టు బాలినేని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.
తొలుత క్యాబినెట్ లో 50శాతం మార్పులు ఉంటాయ‌ని కొన్ని రోజుల పాటు చ‌ర్చ న‌డిచింది. తాజాగా వ‌చ్చిన స‌ర్వే నివేదిక‌ల ఆధారంగా 80శాతానికి పైగా మంత్రుల‌ను జ‌గ‌న్ మార్చుతాడ‌ని టాక్. ఆ క్ర‌మంలో జ‌గ‌న్ బంధువులు, స్నేహితులు, రెడ్డి సామాజిక‌వ‌ర్గంలోని కొంద‌రు 20శాతం కోటాలో కొన‌సాగుతార‌ని పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ జ‌రిగింది. కానీ, స‌మీప బంధువు మంత్రి బాలినేని మంత్రివ‌ర్గంపై ఇచ్చిన క్లారిటీతో 100శాతం క్యాబినెట్లో మార్పులు ఉంటాయ‌ని స్ప‌ష్టం అవుతోంది.
ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌రువాత సామాజిక‌, ప్రాంతీయ‌, జిల్లా స‌మీక‌ర‌ణాల‌తో మంత్రివ‌ర్గానికి రూప‌క‌ల్ప‌న చేశాడు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సామాజిక‌వ‌ర్గాల వారీగా ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను నియ‌మించారు. మంత్రివ‌ర్గంలో స‌మీక‌ర‌ణాల‌ను ప‌క్కాగా త‌యారు చేసుకున్నారు. ఈసారి కూడా అలాంటి ఈక్వేష‌న్ ఉంటుందా? లేక మ‌రో ర‌క‌మైన ఈక్వేష‌న్ జ‌గ‌న్ మ‌దిలో ఉందా? అనేది ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతోన్న చ‌ర్చ
ఈ వారంలోనే లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీల‌తో జ‌గ‌న్ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ల‌తో పాటు జిల్లా ఇంచార్జిలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్య‌క్షుల‌తో స‌మావేశాల‌ను జ‌గ‌న్ ఏర్పాటు చేసుకున్నారు. అంద‌రి అభిప్రాయాల‌ను తీసుకున్న త‌రువాత వాటికి ఆయ‌న వ‌ద్ద ఉన్న స‌ర్వేల‌ను జోడిస్తార‌ని వినికిడి.
కొంద‌రు ఎమ్మెల్సీలు, ఎంపీల‌ను క్యాబినెట్లోకి తీసుకొనే ఛాన్స్ ఉంద‌ని పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అదే జ‌రిగితే, సాధార‌ణ ఎన్నిక‌ల కంటే ముందుగా కొన్ని ఎంపీ స్థానాల్లో ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. ఆ దిశ‌గా ప‌క్కా వ్యూహంతో జ‌గ‌న్ వెళుతున్నాడ‌ని తెలుస్తోంది. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌, మ‌ధ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిధిలోని ముగ్గురు ఎంపీల‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకుని వాళ్ల చేత ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయించే ఛాన్స్ ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల టాక్. అదే జ‌రిగితే, వ‌చ్చే ఏడాది చివ‌రి నాటికి ముగ్గురు ఎంపీల ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆ ఫ‌లితాలు అనుకూలంగా ఉంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్లాన్ చేస్తున్నార‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాల్లో వినికిడి. సో…జ‌గ‌న్ ముంద‌స్తు వ్యూహంతో గుజ‌రాత్ త‌ర‌హా క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు వెళుతున్నార‌ని తెలుస్తోంది.