TDP Pegasus Case : జ‌గ‌న్ ‘నిఘా’లో ఏబీ

బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య చాలా సాన్నిహిత్యం ఉంది.

  • Written By:
  • Updated On - March 21, 2022 / 10:43 PM IST

బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. ప‌లు సందర్భాల్లో ఢిల్లీ వేదిక‌గా ఇద్ద‌రూ రాజ‌కీయ ఏకాభిప్రాయంతో న‌డిచారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా యూపీఏ కూట‌మిలోకి మ‌మ‌త‌ను తీసుకొచ్చేందుకు బాబు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అంతేకాదు, సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణంలో చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా ఉండే నాయ‌కుల్లో మ‌మ‌త ఒక‌రు. చాలా అంశంలో బాబుకు అండ‌గా మ‌మ‌త ఉంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు ఢిల్లీలో చేసిన ధ‌ర్మ‌పోరాట దీక్ష కు ఆనాడు దీదీ మ‌ద్ధ‌తుగా నిలిచింది. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్, జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్ట‌డానికి బీజేపీయేతర పార్టీల‌ను ఏకం చేసిన సంద‌ర్భంలోనూ చంద్ర‌బాబుతో మ‌మ‌త న‌డిచింది. 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ధ‌తుగా జాతీయ నేత‌ల‌ను ప్ర‌చారానికి బాబు తీసుకొచ్చాడు. ఆ సంద‌ర్భంగా మ‌మ‌త బెన‌ర్జీ సానుకూల ప్ర‌చారం చేసింది. ఇలా..మూడు ద‌శాబ్దాలుగా ఇద్ద‌రి మ‌ధ్యా రాజ‌కీయ‌ప‌ర‌మైన అవగాహ‌న ఉంది. ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకునే సాన్నిహిత్యం మ‌మ‌త‌, బాబు మ‌ధ్య ఉంద‌నే విష‌యం జాతీయ స్థాయిలోని లీడ‌ర్ల‌కు బాగా తెలుసు.పెగాసిస్ స్పై వేర్ సాఫ్ట్ వేర్ కొనుగోలు విష‌యంలో బెంగాల్ సీఎం చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు బాబు మెడ‌కు చుట్టుకున్నాయి. అంతేకాదు, ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు నిఘాధిప‌తిగా ఉన్న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు రోల్ ను కూడా ఇప్పుడు వైసీపీ బ‌య‌ట‌కు లాగింది. అసెంబ్లీ వేదిక‌గా పెగాసిస్ కొనుగోలుపై చ‌ర్చ‌కు సిద్ధం అయింది. కానీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చ‌ర్చ‌కు నిరాక‌రిస్తున్నారు. ఆధారాలు లేని ఆరోప‌ణ‌ల‌పై అసెంబ్లీలో చ‌ర్చ‌లు ఎందుకంటూ టీడీపీ స‌భ్యులు నినాదించారు. దీంతో మూకుమ్మ‌డిగా అంద‌ర్నీ స్పీక‌ర్ త‌మ్మినేని సస్సెండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ టార్గెట్ చేసిన ఆఫీస‌ర్ల‌లో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మొద‌టి వ‌రుస‌లో ఉన్నాడు. దానికి ప్ర‌ధాన కార‌ణం ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఉన్న‌ప్పుడు ర‌హ‌స్యాల‌ను ప్ర‌భుత్వానికి చేర‌వేశాడ‌ని అనుమానం. అంతేకాదు, బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులోనూ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఏదో స‌మాచారం ఆనాడున్న స‌ర్కార్ కు ఇచ్చాడ‌ని జ‌గ‌న్ కు ఉన్న సందేహ‌మట‌. ఆ విష‌యాన్ని వైసీపీ వ‌ర్గాలు త‌ర‌చూ చ‌ర్చించుకుంటారు.ఇంటెలిజ‌న్స్ చీఫ్ గా ఉన్న‌ప్పుడు ఆయ‌న చేసిన కొన్ని కొనుగోళ్ల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఆ మేర‌కు ఆయ‌న్ను స‌స్సెండ్  చేసింది. ఆయ‌న పై చేసిన ఆరోప‌ణ‌ల్లో పెగాసిస్ స్పై వేర్ సాఫ్ట్ వేర్ కూడా ఉంది. ఇంటలిజెన్స్‌ విభాగం చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఉన్న‌ప్పుడు ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో కంపెనీ ప్రతినిధులు పశ్చిమ బెంగాల్‌ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడార‌ని వైసీపీ చెబుతోంది. ఫోన్ల ట్యాపింగ్ కోసం ఉప‌యోగిస్తోన్న ఆ ప‌రిక‌రం గురించి ఏపీ ఇంటలిజెన్స్‌ విభాగం అధికారులు పశ్చిమ బెంగాల్‌ పోలీసు ఉన్నతాధికారులకు, మ‌మ‌త‌కు ప్రజెంటేషన్ ఇచ్చార‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఆధారాల‌ను సేక‌రించింది. ఆనాడు 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభాలకు గురి చేయ‌డంలోనూ ఆ సాఫ్ట్ వేర్ కీల‌క‌మ‌ని వాళ్ల అభిప్రాయం. ఫోన్ల ట్యాపింగ్, డాటా చోరీ ద్వారా చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఆనాడు ఏబీ స‌హ‌కారం అందించాడ‌ని జ‌గ‌న్ అనుమానం.

గాలిలో ఎగురవేసే ఈ ఏరోస్టర్‌ బెలూన్లలో ఉండే ప్రత్యేకమైన పరికరాలు ఫోన్ల ట్యాపింగ్‌తోపాటు అవసరమైన ఫొటోలు తీస్తూ నిఘా వ్యవస్థగా పని చేస్తాయి. ఆ విష‌యాన్ని తెలుసుకున్న వైసీపీ నేతలు ఫోన్ల ట్యాపింగ్‌ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు, టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లను కూడా బాధ్యులను చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేయాలని అప్పటి నిఘా విభాగం అధికారులు లేఖ ద్వారా ఆదేశించారని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు వెల్లడించడం గమనార్హం.ఫోన్ల ట్యాపింగ్ కోసం కేంద్ర‌ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇజ్రాయెల్‌ కంపెనీలతో సంప్రదింపులు ఏబీ జ‌రిపాడ‌ని వైసీపీ చెబుతోంది. ఆకాశ్‌ అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీకి ఆ స్పైవేర్‌ పరికరాలను సరఫరా చేయాలని కోరాడ‌ని చెబుతున్నారు. ఆ కంపెనీకి ఏబీ కుమారుడు చేతన్‌ సాయి కృష్ణ సీఈవోగా ఉన్నాడ‌ని వైసీపీ చేస్తోన్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఆ కంపెనీనే ఇజ్రాయెల్‌ నుంచి నిఘా పరికరాల కొనుగోలుకు ప్రధాన బిడ్డర్‌గా వ్యవహరించింది. ఆ కార‌ణంగానే ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసి, కేసు నమోదు చేసింది. ఐపీఎస్‌ అధికారిగా ఉంటూ కూడా దేశ భద్రతా చట్టాలను ఉల్లంఘించిన ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని కేంద్ర డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(డీవోపీటీ)కు నివేదించింది.

ఇజ్రాయెల్‌కు చెందిన వెర్టిన్‌ అనే కంపెనీ ద్వారా ఏపీ ప్రభుత్వం పెగాసస్‌ కంపెనీతో వ్యవహారం నెరిపింద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ చెబుతోన్న ఆధారం. వెబ్‌ ఇంటలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు పేరుతో ‘ఐఎంఎస్‌ఐ క్యాచర్స్‌’ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను తెప్పించింది. ఫోన్ల ట్యాపింగ్‌ కోసమే ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ఆ సాఫ్ట్‌వేర్‌ కోసం రూ.12.50 కోట్లు ఆ కంపెనీకి చెల్లించేందుకు ఫైల్‌ నడిపింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆనాడున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లి చెల్లింపులు చేయొద్దని కోరారు. వెర్టిన్‌ కంపెనీకి ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ పరికరాల ఉత్పత్తిదారు ఎన్‌ఎస్‌వో కంపెనీతో సాన్నిహిత్యం ఉంది. ఒకే రకమైన స్పైవేర్‌ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న ఆ రెండు కంపెనీలు విలీనం కావాలని ఒకానొక దశలో భావించాయ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ చెబుతోంది. పెగాసిస్ కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అసెంబ్లీ వేదిక‌గా బ‌య‌ట పెట్ట‌డానికి జ‌గ‌న్ సర్కార్ సిద్ధం అయింది. ఆనాడున్న ఇంటిలిజెన్స చీఫ్ ఏబీ వెంకటేశ్వ‌ర‌రావు, సీఎం చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట పెట్టాల‌ని యోచించింది. పైగా బెంగాల్ సీఎం మ‌మ‌త కూడా బాబు ప్ర‌భుత్వం పెగాసిస్ ను కొనుగోలు చేసింద‌ని చెబుతోంది. బాబు, మ‌మ‌త మ‌ధ్య ఉన్న పూర్వ‌పు సాన్నిహిత్యాన్ని అవ‌లోక‌నం చేసుకుంటే, ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఇలాంటి డీల్ చ‌ర్చ‌కు వ‌చ్చే ఉంటుంద‌ని న‌మ్మే వాళ్లు ఎక్కువే. వాస్త‌వాలను అసెంబ్లీ వేదికగా బ‌య‌ట పెట్ట‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అవుతుంటే..టీడీపీ చ‌ర్చ వ‌ద్దంటూ ప‌ట్టుబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు అసెంబ్లీకి స‌మాంతరంగా మీడియా ముందుకు రావ‌డానికి సిద్ధం అయ్యాడు. దీంతో మ‌రోసారి మాజీ నిఘాధిప‌తి వెంక‌టేశ్వ‌ర‌రావు వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది.