YS Jagan : ఒక జ‌గ‌న్ రెండు అధిష్టానాలు!

రాజ‌కీయ పార్టీల‌కు అధిష్టానం ఒక‌టే ఉంటుంది. కానీ, ఏపీలోని వైసీపీకి మాత్రం రెండు అధిష్టానాలు ఉన్న‌ట్టు ప్ర‌త్య‌ర్థులు చెప్పుకుంటారు.

  • Written By:
  • Publish Date - April 13, 2022 / 05:51 PM IST

రాజ‌కీయ పార్టీల‌కు అధిష్టానం ఒక‌టే ఉంటుంది. కానీ, ఏపీలోని వైసీపీకి మాత్రం రెండు అధిష్టానాలు ఉన్న‌ట్టు ప్ర‌త్య‌ర్థులు చెప్పుకుంటారు. ఆ దిశ‌గా ఆ పార్టీ చీఫ్ అడుగులు కూడా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి జ‌గ‌న్ కు అన్ని ర‌కాలుగా కేసీఆర్ స‌హ‌కారం అందించారు. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహ‌భావం పెరిగింది. అంతేకాదు, 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్ అంతా హైద‌రాబాద్ కేంద్రంగా జ‌రిగింది. ప‌రోక్షంగా కేసీఆర్ ప‌లువుర్ని తెలుగుదేశం నుంచి వైసీపీలోకి పంప‌డంలో స‌హ‌కారం అందించార‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌కు తెలియ‌ని అంశం కాదు. తెలంగాణ‌లో ఆస్తులున్న సినీ, రాజ‌కీయ, పారిశ్రామిక‌ ప్ర‌ముఖుల‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలోకి పంప‌డానికి ఆప‌రేష‌న్ చేశార‌ని స‌ర్వ‌త్రా ఆనాడు వినిపించిన మాట‌.జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తెలంగాణ సీఎం కేసీఆర్ తో స‌ఖ్య‌త ఉంటున్నారు. వాళ్లిద్ద‌రి తొలి క‌లయిక‌లోనే హైద‌రాబాద్ లో ఉండే ఏపీ స‌చివాల‌యాన్ని జ‌గ‌న్ ఇచ్చేశారు. గోదావ‌రి, కృష్ణా నీటి వాటాల విష‌యంలోనూ కేసీఆర్ అడుగులో అడుగు వేశారు. రెండు రాష్ట్రాలు ఉమ్మ‌డిగా గోదావ‌రిపై ప్రాజెక్టు నిర్మించ‌డానికి కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నానికి అనుగుణంగా జ‌గ‌న్ న‌డిచారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం 6వేల కోట్ల విద్యుత్ బ‌కాయిలు తెలంగాణ ప్ర‌భుత్వం ఇవ్వాలి. 9.10 షెడ్యూల్ కింద సుమారు 6ల‌క్ష‌ల కోట్లు ఏపీకి రావాలి. కానీ, ఆ నిధుల‌ను అడిగేందుకు జ‌గన్ సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. ప‌లు అంశాల‌పై కేసీఆర్ మార్క్ జ‌గ‌న్ మీద క‌నిపిస్తోంది. తాజాగా మంత్రివ‌ర్గ కూర్పులోనూ తెలంగాణ ఆడ‌ప‌డుచు విడ‌ద‌ల ర‌జినీకి స్థానం ల‌భించ‌డం వెనుక కేసీఆర్ ఆప‌రేష‌న్ ఉంద‌ని ప్ర‌త్య‌ర్థుల భావ‌న‌. అంతేకాదు, 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా కూడా ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ల ఇప్పించ‌డంలోనూ టీఆర్ఎస్ ప్ర‌భావం వైసీపీపై ఉంద‌ని టాక్‌.

తెలంగాణ హైకోర్టు, సీబీఐ, ఈడీకి సంబంధించిన‌ జ‌గ‌న్ కేసుల విచార‌ణ హైద‌రాబాద్ కేంద్రంగా జ‌రుగుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలోని విచార‌ణ సంస్థ‌లు అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర ప‌రిధిలోని ఆఫీస్ ల్లోనే విచార‌ణ ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఆ కేసుల విచార‌ణ కోసం జ‌గ‌న్ హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు. బెయిల్ ర‌ద్దుపై సీబీఐ కోర్టు ఇచ్చిన స్టే కార‌ణంగా కోర్టుకు జ‌గ‌న్ గైర్హాజ‌రు అవుతున్నారు. ఈ కేసుల విచార‌ణ ఆల‌స్యం వెనుక ఢిల్లీ, తెలంగాణ పెద్ద‌లు స‌హ‌కారం ఉంద‌ని ప‌లు సంద‌ర్భాల్లో విప‌క్ష నేత‌లు ఆరోపించిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. అందుకే, జ‌గ‌న్ ఢిల్లీ, తెలంగాణ కీల‌క లీడ‌ర్లు చెప్పిన‌ట్టు ప‌లు సంద‌ర్భాల్లో చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా ఒక అడుగు కూడా ముందుకు వేయ‌మ‌ని ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి రోజుల్లోనే మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. ప్ర‌మాణ‌స్వీకారం సంద‌ర్భంగా జ‌గ‌న్ కూడా మోడీ, అమిత్ షా చెప్పిన‌ట్టు చేయాల‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఆ విధంగానే వాళ్లిద్ద‌ర్నీ ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌సన్నం చేసుకోవ‌డానికి ఢిల్లీ వెళుతున్నారు. ఎన్డీయే ప్ర‌వేశ పెట్టిన బిల్లులు, రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు వైసీపీ భేష‌ర‌తుగా మ‌ద్ధ‌తు ఇచ్చింది. అంతేకాదు, ప‌రిమ‌ళ నత్వానికి రాజ్య‌స‌భ ఇవ్వ‌డం వెనుక మోడీ, షా ఆదేశాలు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా తెలిసిన విష‌యమే. ఇక ఈసారి కూడా రాజ్య‌స‌భ ఆదానీ గ్రూప్ కు ఇవ్వాల‌ని చెప్ప‌డానికి మాత్ర‌మే జ‌గ‌న్ ను ఢిల్లీ పిలిపించిన‌ట్టు తాజాగా వినిపించింది. అంటే, బీజేపీ ఢిల్లీ కేంద్రంగా ఒక అధిష్టానంగా జ‌గ‌న్ కు ఉంద‌న్న‌మాట‌. తెలంగాణ‌కు చెందిన అమ‌ర్ లాంటి వాళ్లు అడ్వ‌యిజ‌ర్లు, పీఆర్వోలు చాలా మంది జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఉన్నారు. తాజాగా తెలంగాణ ఆడ‌ప‌డుచు విడ‌ద‌ల ర‌జినీకి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం వెనుక టీఆర్ఎస్ పార్టీ కీల‌క లీడ‌ర్ ఉన్నాడ‌ని టాక్‌. అంతే కాదు, రోజాకి చివ‌రి నిమిషంలో మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం వెనుక కూడా గులాబీ లీడ‌ర్ ఒక‌రు చ‌క్రం తిప్పార‌ని తెలుస్తోంది. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే, టీఆర్ఎస్ పార్టీ మ‌రో అధిష్టానంగా జ‌గ‌న్ కు ఉంద‌ని ప‌లు అంశాల ఆధారంగా బోధ‌ప‌డుతుంద‌ని ప్ర‌త్య‌ర్థుల టాక్‌.

అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ కు తెలియ‌కుండా జ‌గ‌న్ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని ప్ర‌త్య‌ర్థులు ఎప్ప‌టి నుంచో ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాటికి బ‌లం చేకూరేలా ప‌లు అంశాలు ఉన్నాయి. ఒక వైపు జ‌గ‌న్ చేత‌గాని త‌నాన్ని విమ‌ర్శిస్తూ తెలంగాణ ప్ర‌జ‌ల అండ‌ను టీఆర్ఎస్ పొందుతుంది. అమ‌రావ‌తి ప్రాజెక్టు ఫెయిల్ కార‌ణంగా తెలంగాణ భూముల‌కు ధ‌ర‌లు వ‌చ్చాయ‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. అంతేకాదు, విద్యుత్ కోత‌లు గురించి తాజాగా మంత్రి హ‌రీష్ స్పందించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీక‌టి అవుతుంద‌న్న మాట‌ను గుర్తు చేస్తూ ఇప్పుడు ఏపీ చీకటిలోకి వెళ్లింద‌ని చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీ లీడ‌ర్లు మౌనంగా ఉండ‌డం అనేక సంద‌ర్భాల్లో చూశాం. ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే, మిగిలిన పార్టీల‌కు భిన్నంగా జ‌గ‌న్ కు రెండు అధిష్టానాలు ఉన్నాయ‌ని ఫిక్స్ అవుతున్న వాళ్ల ను ఖండించ‌లేం.!