Amaravathi Farmers : అమ‌రావ‌తి రైతుల `త్యాగం`కు జ‌గ‌న్ గొళ్లెం!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొండిగా నిర్ణ‌యాలు తీసుకుంటారు. అందుకే, ఆయ‌న్ను మొండోడుగా ప్ర‌త్య‌ర్థులు భావిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 11:51 AM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొండిగా నిర్ణ‌యాలు తీసుకుంటారు. అందుకే, ఆయ‌న్ను మొండోడుగా ప్ర‌త్య‌ర్థులు భావిస్తుంటారు. మొండోడు రాజు కంటే బ‌ల‌మైనోడని పెద్దల‌ సామెత‌. ఆ మొండోడే రాజు అయితే ఎలా ఉంటుందో అమ‌రావ‌తి రైతులు రుచిచూస్తున్నారు. భూమి త్యాగం చేశామ‌ని చెబుతోన్న రైతుల‌కు తిరిగి ఆ భూమిని ఇచ్చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ రంగం సిద్ధం చేస్తుంద‌ని తెలుస్తోంది.

అమ‌రావ‌తి రాజధాని కోసం చంద్ర‌బాబు ఆనాడు సుమారు 33వేల ఎక‌రాల భూమిని రైతుల నుంచి స‌మీక‌రించారు. భూముల్ని ఇచ్చినందుకు ఐదేళ్ల పాటు ఎక‌రానికి రూ. 50వేల కౌలు, క‌మ‌ర్షిల్ ప్లాట్, రెసిడెన్షియ‌ల్ ప్లాట్ ఇచ్చేలా రైతుల‌తో ఒప్పందం చేసుకున్నారు. ఆ మేర‌కు సీఆర్డీయేను ఏర్పాటు చేసి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించారు. దీంతో రాజ‌ధాని ప్ర‌క‌టించ‌డానికి ముందు ఎక‌రం రూ. 10 నుంచి 15ల‌క్ష‌లు ఉన్న భూమి అమాంతం రూ. 8కోట్ల నుంచి రూ. 10కోట్లు ప‌లికింది. రియ‌ల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా అమ‌రావ‌తి కేంద్రంగా వెలిగిపోయింది. అయిన‌ప్ప‌టికీ వ్య‌వ‌సాయాన్ని మాత్ర‌మే న‌మ్ముకున్న కొంద‌రు రైతులు భూములు ఇవ్వ‌డానికి నిరాకరించారు. వాళ్ల‌ను ఆనాడున్న మంత్రులు నారాయ‌ణ‌, ప్ర‌త్తిపాటి పుల్లారావు త‌దిత‌రులు న‌యాన‌భ‌యాన లొంగ‌తీసుకున్నారు. నిరాకరించిన వాళ్ల పంట‌ల‌ను త‌గుల‌బెట్టించార‌ని ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. జీవ‌నోపాధిని ఇచ్చే భూముల‌ను వ‌దులుకోమ‌ని కొంద‌రు రైతులు ఆనాడు న్యాయ‌పోరాటానికి దిగారు.

సీన్ క‌ట్ చేస్తే 2019 ఎన్నిక‌ల్లో అమ‌రావతి చుట్టు ప‌క్క‌ల ఉండే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లా ప్ర‌జ‌లు కూడా మిగిలిన రాష్ట్ర ప్ర‌జ‌లు మాదిరిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి జై కొట్టారు. ల‌క్ష‌ల‌ కోట్ల రూపాయాల సంప‌ద‌ను క్రియేట్ చేసిన చంద్ర‌బాబును అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌లే తిర‌స్క‌రించారు. కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేల‌కు ఆయ‌న్ను ప‌రిమితం చేశారు. సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తితో పాటు మ‌రో రెండు రాజ‌ధానుల ఫార్ములాను తీసుకున్నారు. అంతే, ఒక్క‌సారిగా అమ‌రావ‌తి ప్రాంత భూముల ధ‌ర‌లు అమాంతం ప‌డిపోయాయి. దీంతో క‌డుపుమండిన రైతులు రోడ్డెక్కారు. రెండున్న‌రేళ్లుగా పోరాడుతోన్న అమ‌రావ‌తి రైతులు న్యాయ‌పోరాటం చేస్తూ క్షేత్ర‌స్థాయిలో ఉద్య‌మిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హాపాద‌యాత్ర‌ను చేస్తూ ఏపీలోని ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల మ‌ద్ధ‌తును కూడ‌గ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

భూములు ఇచ్చిన రైతుల‌కు ఇప్ప‌టికీ రూ. 50వేలు చొప్పున కౌలును రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తోంది. సుమారు రూ. 600 కోట్ల‌కు పైగా ఏడాదికి కౌలును చెల్లిస్తోంది. ఆనాడు చంద్ర‌బాబు ఐదేళ్ల పాటు కౌలు ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత మ‌రో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కౌలు చెల్లించ‌డానికి సిద్ధం అయ్యారు. అయితే, మూడు రాజ‌ధానులు పెట్ట‌డానికి దూకుడుగా ముందుకెళుతున్నారు. ఆ క్ర‌మంలో భూములు ఇచ్చిన రైతుల త్యాగాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాద‌ని మూడు రాజ‌ధానులంటున్నార‌ని న్యాయ‌స్థానంలో రైతులు పోరాడారు. రైతుల‌కు అనుకూలంగా తీర్పులు రావ‌డంతో భూముల‌ను తిరిగి రైతుల‌కు ఇవ్వ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అయింది.

ఆనాడు చంద్ర‌బాబు తాత్కాలిక రాజ‌ధాని నిర్మించిన భూములు మిన‌హా మిగిలిన వాటిలో ఇప్ప‌టికీ కొంద‌రు రైతులు వ్య‌వ‌సాయం చేసుకుంటున్నారు. ఇంకో వైపు ప్ర‌భుత్వం నుంచి కౌలు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి ప్రాక్టీస్ కు చెక్ పెట్ట‌డంతో పాటు `త్యాగం` అనే మాట‌కు ఆస్కారం లేకుండా భూముల‌ను తిరిగి ఇవ్వ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ రీ స‌ర్వే చేసింది. హ‌ద్దుల‌ను నిర్ణ‌యించి ఎవ‌రి భూముల‌ను వాళ్ల‌కు ఇచ్చేలా ప్లాన్ చేసింది. భూములు తిరిగి తీసుకోవ‌డానికి నిరాక‌రించే రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం కింద ప్ర‌స్తుతం ఉన్న‌ చ‌ట్ట ప్ర‌కారం ఇవ్వ‌డానికి సిద్ధం అవుతుంద‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో భూములు తిరిగి తీసుకుంటారా? లేక జ‌గ‌న్ స‌ర్కార్ ఇచ్చే ప‌రిహారానికి అంగీక‌రిస్తారా? అనేది రైతుల ముందున్న స‌వాల్. మొత్తం మీద `త్యాగం` అనే మాట ఎత్త‌కుండా అమ‌రావ‌తి రైతుల నోళ్లు మూయించ‌డానికి జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌న్న‌మాట‌.