మాజీ మంత్రుల వాలకంపై జగన్ కు కోపం వచ్చింది. ఎవరికి వాళ్లే బల నిరూపణకు దిగుతోన్న వైనంపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను తెలుసుకున్న ఆయన కలవరం చెందాడట. అందుకే, గీతదాటుతోన్న మాజీ మంత్రులను జగన్ ఎదుట ప్రవేశపెట్టాలని తాడేపల్లి ప్యాలెస్ కోటరీ ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత మంత్రులు, మాజీల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. గత కొన్ని రోజులుగా వాళ్ల మధ్య విభేదాలు వీదిన పడిన విషయం విదితమే. అన్ని జిల్లాల కంటే నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయం బజారునపడింది. అందుకే, ఆ జిల్లాలకు చెందిన నాయకులకు తొలుత తాడేపల్లి క్లాస్ పడనుంది.నెల్లూరు జిల్లాలో కొత్త మంత్రి కాకాణి గోవర్ధర్ రెడ్డికి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల పోటాపోటీగా సభలు పెట్టారు. బల నిరూపణకు దిగారు. అందరం జగన్ విధేయులమే అంటూనే ఇరువురూ నెల్లూరు కేంద్రంగా బహిరంగ సభలను పెట్టుకున్నారు. అంతేకాదు, ఫ్లెక్సీలకు సంబంధించిన రచ్చ కొనసాగుతోంది. అభిమానులు కాకాణి గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అనిల్ అనుచరులు చించేశారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నెల్లూరు సిటీలో ఎంట్రీ ఇవ్వడానికి కూడా అనిల్ అనుచరులు ఛాన్స్ ఇవ్వడంలేదు. ఒక వేళ ఎంట్రీకి ప్రయత్నం చేస్తే నానా హంగామా చేస్తున్నారు. దీంతో అంటు కాకాని ఇటు అనిల్ కు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వచ్చింది. ఇద్దరూ జగన్ ఎదుట హాజరు కావాలని ఫోన్ ద్వారా పిలుపు అందుకున్న మాజీ, ప్రస్తుత మంత్రుల పంచాయతీ జగన్ తీర్చనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇరువురు నేతలకు క్యాంపు కార్యాలయం కేంద్రంగా జగన్ క్లాస్ పీకనున్నారు. ఇద్దరికీ సీరియస్ వార్నింగ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
ప్రకాశం జిల్లాలోనూ ఇంచుమించు నెల్లూరు జిల్లా పరిస్థితి ఉంది. కాకపోతే, మాజీ మంత్రి బాలినేని వన్ సైడ్ వార్ లాగా గ్రౌండ్ మారింది. ఎలాంటి సందర్భంగా లేకుండా బాలినేని కొన్ని వందల వాహనాలతో బలనిరూణకు దిగారు. హైదరాబాద్ నుంచి మంత్రి పదవి పోగొట్టుకుని ఒంగోలుకు చేరుకుంటోన్న ఆయనకు కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. అంతేకాదు, కరణం బలరాం, బాచిన చెంచుగరయ్య వర్గాలు పోటాపోటీగా ఆయన స్వాగతం పలికేందుకు ఉత్సాహం చూపడం హైలెట్. జిల్లా వ్యాప్తంగా బలం ఉందని పరోక్షంగా జగన్ కు బాలినేని సంకేతం ఇచ్చినట్టు అయింది. వేలాది మంది కార్యకర్తలతో పెద్ద ర్యాలీ బాలినేని నిర్వహించారు. మంత్రి సురేష్ మినహా ప్రకాశం జిల్లాలోని మిగిలిన లీడర్లు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో మంత్రి సురేష్ ను ఒంటరిగా ఆ జిల్లాలో చేయాలని బాలినేని చేసిన ప్రయత్నం తాడేపల్లి ప్యాలెస్ గమనించింది.చిత్తూరు జిల్లా నగరికి ఎంట్రీ ఇచ్చినప్పుడు మంత్రి రోజాకు ఎదురైన సవాల్ మరిచిపోలేనిది. ఆమె ర్యాలీకి సగం మంది స్థానిక లీడర్లు దూరంగా ఉన్నారు. సినీ గ్లామర్, ఆమెకు స్థానికంగా ఉన్న క్యాడర్ తో బలనిరూపణకు దిగే ప్రయత్నం ఆమె చేశారు. అంతేకాదు, శత్రువులపై విజయం సాధించానని బహిరంగంగా రోజా ప్రకటించడం వ్యతిరేక గ్రూప్‌కు మండేలా చేసింది. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఉషశ్రీ చరణ్ పరిస్థితి కూడా స్థానికంగా ఇబ్బందే. ఆమెతో కలిసి నడవడానికి అనంతపురం జిల్లా వైసీపీ సీనియర్లు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మంత్రి పదవులను ఆశించి అక్కడ నుంచి భంగపడ్డ వాళ్లు అసంతృప్తిగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో జోగి రమేష్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని సీనియర్ మాజీ మంత్రి పార్థసారథి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన స్థానంలో నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇవ్వడంపై ఆ సామాజికవర్గం పెద్దగా ఇంట్రస్ట్ చూపడంలేదు. పైగా స్థానికంగా ఉండే లీడర్లు నాగేశ్వరరావు మీద అసంతృప్తిగా ఉన్నారు. ఆయినప్పటికీ బయటపడకుండా సరైన సమయం కోసం చూస్తున్నారు. ఏ రోజైనా నాగేశ్వరరావుపై స్థానిక లీడర్లు తిరగబడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఇసుక వ్యవహారంలో అక్కడ వైసీపీ వర్గాల్లో విభేదాలు ఉన్న విషయం విదితమే.విశాఖ జిల్లాలోనూ మాజీ మంత్రి అవంతి వర్సెస్ ఇతర లీడర్ల మధ్య వార్ జరుగుతోంది. పలుమార్లు తాడేపల్లి కేంద్రంగా పంచాయతీ కూడా చేశారు. ప్రస్తుతం అక్కడ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ కు పదవి వరించింది. కానీ, అనేక మంది ఆశావహులు ఢీలా పడ్డారు. అమర్నాథ్ వర్సెస్ విశాఖ వైసీపీ లీడర్లు అనేలా విభేదాలు పొడచూపనున్నాయని భావిస్తున్నారు.
ఉద్ధండులున్న కృష్ణా, గుంటూరు జిల్లాలకు హ్యాండిచ్చిన జగన్ ఆ జిల్లా నుంచి జోగిరమేష్, విడదల రజిని మంత్రి అయ్యారు. ఆమెతో కలిసి నడవడానికి సీనియర్లు సిద్ధంగా లేరని స్థానిక నేతల వాదన. అదే జిల్లా నుంచి మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ పిన్నెల్లి లక్ష్మారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్, అబ్బయ్య చౌదరి తదితర కమ్మ సామాజికవర్గం లీడర్లు మంత్రి పదవులను ఆశించారు. కానీ, ఆ సామాజికవర్గానికి స్థానం లేకుండా జగన్ పెద్ద డేర్ చేసి క్యాబినెట్ ను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆ సామాజికవర్గంకు చెందిన వైసీపీ లీడర్లు గుర్రుగా ఉన్నారు. మంత్రిగా ఉన్న జోగి రమేష్ కలిసి నడిచేందుకు కృష్ణా జిల్లాకు చెందిన లీడర్లు వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి వైసీపీలో క్రమంగా బయటపడుతోంది.
మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కొందర్ని వివాదాలు అప్పుడు చుట్టుముట్టాయి. స్త్రీశిశు సంక్షేమ శాఖా మంత్రి ఉషశ్రీ చరణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సొంత నియోజకవర్గం కల్యాణదుర్గానికి భారీ కాన్వాయ్ తో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆమె ర్యాలీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదే ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు కూడా చేదు అనుభవం తప్పలేదు. ఆయన దర్శనానికి వస్తున్నారంటూ శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొన్ని గంటలపాటు భక్తులను క్యూలైన్లలోనే ఉంచేశారు. కంచుగడప వద్ద క్యూలైన్లను ఆపేయడంతో భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సరిగ్గా అదే సమయానికి మంత్రి కొట్టు అటువైపు వచ్చారు. అప్పటికే వేసవి ఉక్కతో అల్లాడిపోతున్న భక్తులు మంత్రి కొట్టును నిలదీశారు. దీంతో మంత్రి అక్కడున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఇలా కొత్త మంత్రివర్గం ఏదో ఒక రూపంలో చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. అందుకే, జగన్ రంగంలోకి దిగారు. తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని క్లాస్ తీసుకునే పనిలో ఉన్నారు.
.