AP Politics : చంద్ర‌బాబు మాట‌ల‌పై జ‌గ‌న్ రివ‌ర్స్

ఇవే చివ‌రి ఎన్నిక‌లంటూ టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు క‌ర్నూలు వేదిక‌గా చేసిన కామెంట్ల‌పై సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

  • Written By:
  • Updated On - November 21, 2022 / 05:07 PM IST

ఇవే చివ‌రి ఎన్నిక‌లంటూ టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు క‌ర్నూలు వేదిక‌గా చేసిన కామెంట్ల‌పై సీఎం జగన్ మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆ వ్యాఖ్య‌ల వెనుక బెదిరింపు ఉంద‌ని ఆయ‌న భావించారు. అంతేకాదు టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశంలో చ‌ర్చించిన‌ `ఇదేం ఖ‌ర్మ‌` కార్య‌క్ర‌మాన్ని `ఎన్టీఆర్ కు వెన్నుపోటు` అంశానికి ముడిపెట్టారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వాన్ని చూసి `ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ…` అంటూ ప్ర‌జ‌లు అనుకున్నార‌ని చెబుతూ జ‌న‌సేన పార్టీని రౌడీ సేన‌గా చంద్ర‌బాబే మార్చేశార‌ని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించ‌డం పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమ‌వారం ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ల‌ను టార్గెట్ చేశారు. రాజకీయాల్లో ఉండాలన్నా, మళ్లీ అసెంబ్లీకి వెళ్లాలన్నా ప్రజలు గెలిపిస్తే సరేసరి, లేకపోతే ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారని విమర్శించారు. కుప్పంలో గెలవలేనన్న భయం చంద్రబాబులో కనిపిస్తోందని అన్నారు. చంద్రబాబు చెప్పే ప్రతి మాటలోనూ నిరాశ, నిస్పృహ కనిపిస్తున్నాయని జ‌గ‌న్ పేర్కొన్నారు.

Also Read:  AP Politics : సంక్షేమంపై బాబు, ప‌వ‌న్ ఫిదా!

గతంలో టీడీపీ పాలనను చూసి ఇదే ఖర్మరా బాబూ అనుకున్నారని, 1995లో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇంట్లోనూ, పార్టీలోనూ చంద్రబాబుకు స్థానమిచ్చినందుకు `ఇదేం ఖర్మరా బాబూ` అనుకుని ఉంటాడని వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, దత్తపుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి నాయకులు ఉండడం చూసి ప్రజలు కూడా `ఇదేం ఖర్మరా బాబూ` అనుకుంటున్నారని తెలిపారు.

మొత్తం మీద న‌ర‌సాపురం వేదిక‌గా చంద్ర‌బాబు క‌ర్నూలులో చేసిన వ్యాఖ్య‌లు బెదిరింపుగా జగన్ మోహన్ రెడ్డికి క‌నిపించాయి. అయితే, వైసీపీలోని మంత్రి బొత్సా మాత్రం ఏడాదిన్న‌ర ముందే ఓట‌మిని చంద్ర‌బాబు అంగీకరించార‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు మాట‌ల‌కు దేవ‌త‌లు త‌థాస్తు అంటార‌ని వ్యంగ్యాస్త్రాన్ని జోడించారు. ఇవే చంద్ర‌బాబుకు చివ‌రి ఎన్నిక‌లంటూ వైసీపీ నేత‌లు ప‌లు ర‌కాలుగా ప్ర‌చారం చేస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్ర‌జ‌ల్ని బెదిరించేలా ఆ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్ప‌డం గ‌మనార్హం.

Also Read:  Babu Vs Vijay Saireddy: ట్విట్టర్ వేదికగా బాబు, సాయి రెడ్డి వార్‌