YS Jagan : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. నేటి ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకోనున్న జగన్, అక్కడి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ దర్బార్ ద్వారా స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణమే పరిష్కార మార్గాలను పరిశీలించనున్నట్టు సమాచారం.
రేపు ఉదయం 10 గంటలకు పులివెందుల పట్టణంలోని గుంత బజార్ ప్రాంతంలో వైఎస్సార్ పౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్‌ను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పేద ప్రజలకు అధునాతన కంటి చికిత్స అందించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళ్లనున్నారు. మార్చి 3వ తేదీన బెంగళూరు నుంచి తాడేపల్లికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
Fact Check : ‘‘30 కోట్లిచ్చి టికెట్ తెచ్చుకున్నా’’.. ఇవి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి వ్యాఖ్యలేనా ?
ఇదిలా ఉంటే, ఇటీవల ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. సభలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలనే డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ, పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహించిన వైఎస్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమై, శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే, మండలికి మాత్రం హాజరై, ప్రజా సమస్యలను ప్రభుత్వానికి గుర్తు చేయాలని ఎమ్మెల్సీలకు సూచించారు.
ఈ పరిస్థితులు చూస్తే, వైఎస్ జగన్ తన నియోజకవర్గంలో ప్రజలతో నేరుగా మమేకం అవుతూ, ఒకవైపు ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రతిపక్ష హోదా కోసం ధీటుగా పోరాటం చేస్తూ రాజకీయంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు ఏపీలో రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.
Aegis Graham Bell Awards : ఫైనలిస్ట్‌గా కెమిన్ ఆక్వాసైన్స్ గుర్తింపు