AP RTC : జ‌గ‌న్ “ఎల్లో” ప‌రేషాన్! ఆర్టీసీ బ‌స్సుల‌పై ప‌సుపు రంగు తొల‌గింపు?

ప‌సుపు రంగు శుభానికి, ఆహ్లాదానికి చిహ్నం. కానీ, ఇప్పుడు ఆ రంగు అంట‌రానిద‌న్న‌ట్టు జ‌గ‌న్ స‌ర్కార్ భావిస్తోంది.

  • Written By:
  • Publish Date - December 6, 2021 / 01:55 PM IST

ప‌సుపు రంగు శుభానికి, ఆహ్లాదానికి చిహ్నం. కానీ, ఇప్పుడు ఆ రంగు అంట‌రానిద‌న్న‌ట్టు జ‌గ‌న్ స‌ర్కార్ భావిస్తోంది. ఎక్క‌డ ఆ క‌ల‌ర్ క‌నిపించిన‌ప్ప‌టికీ తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా ఆర్టీసీ బ‌స్సుల‌కు ఉన్న ప‌సుపు రంగును మార్చేందుకు ఏపీ స‌ర్కార్ సిద్ధం అయింది.ప్రస్తుతం ఏపీలోని పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు క‌నిపిస్తాయి. ఆ రంగుల్లో పసుపు రంగును మాత్ర‌మే తొల‌గించ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. పసుపు రంగు బదులుగా గచ్చకాయ రంగు వేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. అదే సమయంలో డిజైన్ ను మార్చేయాల‌ని స‌ర్కార్ ఆదేశించింద‌ట‌. ఆ మేర‌కు ఏపీ ఎస్ ఆర్టీసీ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయ‌ని తెలుస్తోంది.

ఏపీ ఎస్ ఆర్టీసీ ఎప్ప‌టి నుంచే అప్పుల్లో ఉంది. ఇప్పుడు రంగులు, డిజైన్ మార్పు చేయ‌డానికి కొన్ని కోట్ల‌ను ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది. గోరుచుట్టు మీద రోక‌టి పోటులా ..ఇప్ప‌టికే ఉన్న అప్పుల మీద ఈ రంగుల భారం పడ‌నుంది. ఇటీవ‌ల ఆర్టీసీ ప్ర‌భుత్వంలో విలీనం అయిన త‌రువాత కొత్త స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటోంది. వాటికి తోడు ఇప్పుడు రంగుల గోల ప్రారంభం అయింది.జ‌గ‌న్ స‌ర్కార్ రంగుల విష‌యంలో తొలి నుంచి చాలా సీరియ‌స్ గా ఉంది. ప‌సుపు రంగు ఏపీలో ఎక్క‌డ క‌నిపించ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంది. సీఎంగా జ‌గ‌న్ అయిన తొలి రోజుల్లోనే గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యాలు, మండ‌ల కార్యాల‌యాలు, ఇత‌ర ప్ర‌భుత్వ ఆఫీసుల‌కు ఉండే ప‌సుపు రంగును తొల‌గించేశాడు. వాటి స్థానంలో వైసీపీ రంగుల‌ను వేయ‌డం పెద్ద చ‌ర్చుకు దారితీసింది.సుమారు 3వేల కోట్ల రూపాయ‌ల దుర్వినియోగం జ‌రిగింద‌ని అప్ప‌ట్లో ప్ర‌త్య‌ర్థుల నుంచి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోంది. కోర్టులు కూడా ప్ర‌భుత్వాన్ని చివాట్లు పెట్టింది. అయిప్ప‌టికీ అదేపంథాను జ‌గ‌న్ స‌ర్కార్ కొన‌సాగిస్తోంది. ఇప్పుడు ఆర్టీసీ బ‌స్సుల మీద ప‌సుపు రంగును తొల‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో మ‌రోసారి రంగుల రాజ‌కీయ గోల ప్రారంభం అయింది.