AP Tollywood : సినీపెద్ద‌ల‌కు జ‌గ‌న్ కండిష‌న్ ఇదే!

సినిమా ప‌రిశ్ర‌మ‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ పైచేయి సాధించాడు.

  • Written By:
  • Publish Date - February 10, 2022 / 02:41 PM IST

సినిమా ప‌రిశ్ర‌మ‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ పైచేయి సాధించాడు. హైద‌రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నంకు టాలీవుడ్ ను త‌ర‌లించ‌డానికి మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. జీవో నెంబ‌ర్ 35 సవ‌ర‌ణ‌కు, సినిమా ఇండ‌స్ట్రీని త‌ర‌లించ‌డానికి లింకేశాడని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ల‌ను ఏపీలోనూ జ‌ర‌పాల‌ని కండిష‌న్ పెట్టాడు. విశాఖ న‌గ‌రానికి స్టూడియోల‌ను త‌ర‌లించ‌డానికి అనువుగా ఉండే అంశాల‌ను చిరంజీవి అండ్ టీం ముందు ఉంచాడు. అందుకు అగ్ర హీరోలు అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో జ‌రిగిన చ‌ర్చ ఎక్కువ‌గా విశాఖ రాజ‌ధాని చుట్టూ తిరిగింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌.సినిమా క‌లెక్ష‌న్ల విష‌యంలో ఎక్కువ భాగం ఏపీ నుంచి వ‌స్తోంది. ఆంధ్రా, సీడెడ్ ఏరియాల నుంచి వ‌చ్చే షేర్ 80శాతం ఉంటుంది. కేవ‌లం 20శాతం మాత్ర‌మే నైజాం నుంచి రాబ‌డి వ‌స్తుంద‌ని లెక్క‌. హైద‌రాబాద్ మిన‌హా తెలంగాణ‌లోని ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే షేర్ చాల స్వ‌ల్పం. అత్యంత లాభాల‌ను పండించే ఏపీ రాష్ట్రానికి సినిమా ఇండ‌స్ట్రీ వ‌ల‌న వ‌చ్చే లాభం ఏమీ లేదు. ఏపీ ప్ర‌జ‌ల సొమ్మును సినిమా వాళ్లు హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల పెట్టుబడులుగా పెడుతున్నారు. స్టూడియోలు, షూటింగ్ లు అన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటున్నాయి. ఫ‌లితంగా సినిమా ఆదాయం రూపంలో వ‌చ్చే ప‌న్నులు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ జ‌మ అవుతున్నాయి. డ‌బ్బు ఏపీ ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేస్తూ, ఆదాయాన్ని మాత్రం తెలంగాణ‌కు అప్ప‌గిస్తోన్న రంగాల్లో ప్ర‌ముఖంగా సినిమా ఇండ‌స్ట్రీ ఉంది. ఇదే అక్క‌డ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి న‌చ్చ‌డంలేదు.

2014లో రాష్ట్రం విడిపోయిన త‌రువాత నంది అవార్డుల‌ను ఇవ్వ‌డానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీక‌రించ‌లేదు. ఇప్ప‌టికీ ఆ అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డానికి సిద్ధంగా లేడు. అదే, చంద్ర‌బాబునాయుడు సీఎంగా ఉండ‌గా ఏపీలో నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించాడు. సినిమా ఇండ‌స్ట్రీ మొత్తం త‌న పంచ‌న చేరే వ‌ర‌కు కేసీఆర్ దూరంగా పెట్టాడ‌ని సినీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. ఆ త‌రువాత కొంద‌రు టాలీవుడ్ పెద్ద‌లు కేసీఆర్ ప‌క్షాన చేర‌డంతో ప్రాముఖ్య‌త ఇవ్వ‌న‌ప్ప‌టికీ చూసిచూడ‌న‌ట్టు వ‌దిలేశాడు. నాలుగేళ్ల క్రితం జ‌రిగిన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా తెలుగు హీరోలు, న‌టులు అంద‌రూ కేసీఆర్ కోసం క్యూ క‌ట్టిన విష‌యం విదిత‌మే. కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్క‌డే సినిమా ఇండ‌స్ట్రీ ఉండ‌డంతో అగ్ర‌హీరోలు, న‌టులు, నిర్మాతలు, డైరెక్ట‌ర్లు, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఆస్తిపాస్తులు హైద‌రాబాద్ లో ఉన్నాయి. వాటిని కాపాడుకోవ‌డానికి కేసీఆర్ పంచ‌న అనివార్యంగా కొంద‌రు సీనీ పెద్ద‌లు చేరారు. ఏపీ వైపు చూడ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితికి వాళ్లు వ‌చ్చారు.ఒకానొక స‌మ‌యంలో సినిమా ఇండస్ట్రీని ఏపీకి త‌ర‌లించ‌క‌పోతే, సినిమాల‌ను బాయ్ కాట్ చేస్తామ‌ని అక్క‌డి ప్ర‌జా సంఘాలు కొన్ని ఆందోళ‌న చేశాయి. ఏపీలోని క‌ళాకారులు కూడా సినిమా పరిశ్ర‌మ‌ను త‌ర‌లించాల‌ని కోరుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై దాడి జ‌రుగుతోంద‌ని చాలా కాలంగా ఆంధ్రా హీరోలు, న‌టుల‌పై తెలంగాణ‌లో వివ‌క్ష న‌డుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఏపీకి త‌ర‌లి వెళ్ల‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టాలీవుడ్ అగ్ర‌జుల‌కు కొన్ని కండిష‌న్లు పెట్టాడ‌ని తెలుస్తోంది. రాష్ట్రానికి ఏ మాత్రం లాభం లేకుండా ప్ర‌జల సొమ్మును తెలంగాణ రాష్ట్రానికి వినోదం రూపంలో తీసుకెళ్ల‌డానికి కుద‌ర‌ద‌నే విష‌యాన్ని జ‌గ‌న్ క‌రాఖండిగా చెప్పిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల స‌మాచారం.

విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా త్వ‌ర‌లోనే ప‌రిపాల‌న రాజ‌ధాని ఏర్పాటు చేయ‌బోతున్న అంశాన్ని కూడా గురువారం జ‌రిగిన స‌మావేశంలో జ‌గ‌న్ ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. పైగా టాలీవుడ్ టీం కు నాయ‌క‌త్వం వ‌హించిన చిరంజీవి మూడు రాజ‌ధానుల‌కు చాలా కాలంగా మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాడు. ఈ ఉగాది త‌రువాత ఏపీ పాల‌న విశాఖ నుంచి ఉండ‌బోతుంద‌ని జ‌గ‌న్ సంకేతాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, సినిమా ప‌రిశ్ర‌మ‌ను కూడా విశాఖ‌కు త‌ర‌లించాల‌ని ఆయ‌న కోరాడ‌ట‌. షూటింగ్ లు జ‌రిగిన ప్రాంతాల షెడ్యూల్స్ ఆధారంగా ఇక నుంచి ఏపీలో సినిమా విడుద‌ల‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా పెట్ట‌బోతున్న‌ట్టు అర్థం అవుతోంది. మొత్తం మీద టిక్కెట్ల ధ‌ర‌ల పెంపు, ఆన్ లైన్ విక్ర‌య విధానంకు సంబంధించిన జీవోలను స‌వ‌రించాలంటే టాలీవుడ్ విశాఖ‌కు త‌ర‌లిరావాల‌ని జ‌గ‌న్ కండిష‌న్ పెట్టిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌.
స్డూడియోల‌కు భూములు ఇవ్వ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. మౌలిక వ‌స‌తులు, ఇత‌ర‌త్రా రాయితీలు ఇవ్వ‌డానికి జ‌గ‌న్ రెడీగా ఉన్నాడు. వీలున్నంత త్వ‌ర‌గా స్టూడియోల‌ను విశాఖ‌లో ఏర్పాటు చేయాల‌ని ఏపీ సీఎం సూచించిన‌ట్టు తెలుస్తోంది. నంది అవార్డులు, చిన్న చిత్రాల‌కు అవ‌కాశం, పాన్ ఇండియా సినిమాల‌కు టిక్కెట్ల ధ‌ర‌ల పెంపు త‌దిత‌ర అంశాల‌న్నింటిపైన సానుకూలంగా జ‌గ‌న్ స్పందించాడు. ఆ విష‌యాన్ని చెప్పిన చిరంజీవి, ప్ర‌భాస్, మ‌హేష్‌, నారాయ‌ణ‌మూర్తి, మంత్రి పేర్ని నాని నోట విశాఖ కు టాలీవుడ్ త‌ర‌లింపును కూడా జోడించారు. దీంతో విశాఖ‌ప‌ట్నంకు త్వ‌ర‌లోనే టాలీవుడ్ వెళ్ల‌క‌పోతే..ప్ర‌భుత్వం, సినీ ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య ఏర్ప‌డిన అగాంధంకు శుభ‌కార్డు ప్ర‌స్తుతానికి ప‌డిన‌ట్టే క‌నిపించిన‌ప్ప‌టికీ భ‌విష్య‌త్ లో జ‌గ‌న్ సినిమా చూపిస్తాడ‌ని అర్థం అవుతోంది.