Amaravathi : 2024 వైసీపీ అస్త్రం 3 రాజ‌ధానులు!

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మూడు రాజ‌ధానుల అంశాన్ని మ‌రింత ఫోక‌స్ చేయాల‌ని వైసీపీ భావిస్తోంది.

  • Written By:
  • Publish Date - July 25, 2022 / 02:00 PM IST

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మూడు రాజ‌ధానుల అంశాన్ని మ‌రింత ఫోక‌స్ చేయాల‌ని వైసీపీ భావిస్తోంది. అదే ఎజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స్కెచ్ వేస్తోంది. ప్రాంతాల మ‌ధ్య ఈ అంశం ప్ర‌ధాన‌మైన‌ది. ప్ర‌త్యేకించి రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర మీద మూడు రాజ‌ధానుల అంశం ప్ర‌భావం చూపుతుంద‌ని ఆ పార్టీ అంచ‌నా వేస్తోంది. అందుకే, ఎన్నిక‌ల అమ్ముల పొదిలో మూడు రాజ‌ధానుల అస్త్రాన్ని దాచుకున్న‌ట్టు వైవీ సుబ్బారెడ్డి మాట‌ల ద్వారా స్ప‌ష్టం అవుతోంది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌రువాత ప‌వ‌ర్ పాయింట్స్ గా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, టీటీడీ చైర్మ‌న్ వై.వీ సుబ్బారెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి, మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి ఉన్నారు. వాళ్లు ఏదైనా చెబితే దాదాపుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి డైరెక్ష‌న్లోనే చెప్పి ఉంటార‌ని భావించాలి. ఆ విష‌యాన్ని ఆ పార్టీ క్యాడ‌ర్ చెప్పుకుంటోంది. తాజాగా అమ‌రావ‌తి రాజ‌ధానిపై వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించ‌డం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయింది.

మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో భేష‌ర‌తుగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉన్న పిటిష‌న్ల‌కు స‌రైన స‌మాధానం చెప్ప‌లేక ఆ నిర్ణ‌యం తీసుకుంది. కానీ, మూడు రాజ‌ధానుల బిల్లు మ‌ళ్లీ స‌మ‌యం చూసుకుని స‌మ‌గ్రంగా పెడ‌తామ‌ని ఆనాడు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. న్యాయ స్థానాల్లో ఆయ‌న బిల్లు మ‌ళ్లీ పెట్టిన‌ప్ప‌టికీ నిలువ‌ద‌ని భావిస్తోన్న అమ‌రావ‌తి రైతులు ప్ర‌స్తుతం మౌనంగా చూస్తున్నారు. హైకోర్టు డైరెక్ష‌న్ మేర‌కు ప్లాట్ల‌ను ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది. భూములు ఇచ్చిన రైతులు సీఆర్డేయే ప‌త్రాల‌పై సంత‌కాలు చేయాల‌ని ఇటీవ‌ల నోటీసులు కూడా ఇచ్చింది. కానీ, కొంద‌రు ఇప్ప‌టికీ సంత‌కాలు చేయ‌డానికి ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న నిర్మాణాల‌ను పూర్తి చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకు సంబంధించిన నిధుల‌ను కూడా విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ప‌నులు నిదానంగా జ‌రుగుతున్నాయి. హ‌ఠాత్తుగా విశాఖ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి మూడు రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌స్తావించారు. ప‌రిపాల‌న రాజ‌ధాని విశాఖ ఉంటుంద‌ని రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ హోదాలో కార్పొరేట‌ర్ల స‌మావేశంలో వెల్ల‌డించారు.
విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాక పరిపాలనా రాజధాని వస్తుందని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలు అమలు ప్ర‌ణాళిక‌లు త‌యారు అవుతున్నాయ‌ని చెప్ప‌డం మ‌రోసారి మూడు రాజ‌ధానుల అంశం చ‌ర్చ‌నీయాంశం అయింది.