Site icon HashtagU Telugu

Pingali Venkaiah Tribute: ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ సెల్యూట్‌

Jagan

Jagan

పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్‌ చేశారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య దేశ ప్రజలందరూ గర్వపడేలా చేశారని అన్నారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా దేశభక్తిని నింపుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు.

అంతకుముందు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. జాతీయ జెండా రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. పింగళి వెంకయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో మంత్రి జోగి రమేష్, నగరిలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు.

అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అలాగే పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను తపాలా శాఖ ఆవిష్కరించింది. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2వ తేదీన జన్మించారు.12 సంవత్సరాల వయస్సులో మచిలీపట్నంలో మాధ్యమిక విద్యను పూర్తి చేసి సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఆయన గాంధీని కలిశారు . ఆయన ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. దేశానికి ఏదైనా చేయాలనే తపనతో త్రివర్ణ జాతీయ పతాకాన్ని రూపొందించారు. విజయవాడలో జరిగిన సమావేశాల్లో స్వల్ప మార్పులతో ఆమోదించారు. త్రివర్ణ పతాకం కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తికి గొప్ప చిహ్నంగా ప్రసిద్ధి చెందింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పింగళి వెంకయ్య జయంతి వేడుకలను నిర్వహించి, ఆయన పేరుతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసిన‌ట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పింగళికి నివాళులర్పించారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా హర్ ఘర్ తిరంగా’లో భాగంగా తెలుగువాడు రూపొందించిన జాతీయ జెండాను ఎగురవేయాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడం తెలుగువాడికి గర్వకారణమని అన్నారు. భారత జాతీయ జెండా సృష్టికర్త 146వ జయంతి సందర్భంగా నాయుడు ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ జాతీయోద్యమంలోనే కాకుండా విద్యా, వైజ్ఞానిక రంగాల్లో దేశానికి సేవలందించిన పింగళి బహుముఖ సేవలను, దేశభక్తిని స్మరించుకుందాం అంటూ పిలుపునిచ్చారు.

Exit mobile version