AP Cabinet : త్వ‌ర‌లో జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి క్యాబినెట్ 3.0?

సంస్థాగ‌త పున‌ర్నిర్మాణం దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాబినెట్ ను మ‌రోసారి మార్పు చేసే అవ‌కాశం ఉంది. సంక్రాంతి త‌రువాత ఏ రోజైనా క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌.

  • Written By:
  • Updated On - November 29, 2022 / 04:33 PM IST

సంస్థాగ‌త పున‌ర్నిర్మాణం దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాబినెట్ ను మ‌రోసారి మార్పు చేసే అవ‌కాశం ఉంది. సంక్రాంతి త‌రువాత ఏ రోజైనా క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న రుషిరాజ్ సింగ్ ఇచ్చిన స‌ర్వేలను అధ్య‌య‌నం చేస్తోన్న వైసీపీ అధిష్టానం ఇప్ప‌టికే స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లతో పాటు కీలక నేత‌ల స్థానాల‌ను మార్చేసిన విష‌యం విదిత‌మే. క‌నీసం న‌లుగురు మంత్రుల‌ను తొలిగించ‌డం ద్వారా క్యాబినెట్ ను ప్ర‌క్షాళ‌న చేసి ఎన్నికల టీమ్ ను రెడీ చేసుకోవ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రంగం సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

మిష‌న్- 175 దిశ‌గా ఆలోచిస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైసీపీని సంస్థాగ‌తంగా బలోపేతం చేసే చ‌ర్య‌లు చేప‌ట్టారు. వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, కోఆర్డినేటర్ల మార్పులు చేశారు. వెనుక‌బడిన వ‌ర్గాలు, వాటికి అనుబంధ వర్గాలకు సముచిత వాటా పార్టీ ప‌దవుల్లో ఇస్తూ కుల సమీకరణల దిశ‌గా క‌స‌ర‌త్తు చేశారు. జిల్లా అధ్యక్ష పదవులు బీసీలకు 10, కాపులకు 5, రెడ్డిలకు 5, ఎస్టీలకు 2, ఎస్సీ, వైశ్య, క్షత్రియులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లు కీల‌క ప‌ద‌వుల్లో సొంత సామాజిక‌వ‌ర్గాన్ని నియ‌మించార‌ని టీడీపీ త‌ర‌చూ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌కు ప్ర‌తిగా సంస్థాగ‌త మార్పుల‌ను వైసీపీ తీసుకుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

సంస్థాగ‌తంగా ఎన్ని మార్పులు చేస్తున్న‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌లుగురు `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం నేత‌ల మీద ఆధార‌ప‌డ్డారు. ప్రాంతీయ స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా విజ‌య‌సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి పార్టీని శాసిస్తున్నారు. ఆ విష‌యం బ‌లంగా ఆ పార్టీలోని వెనుక‌బ‌డిన వ‌ర్గాల్లోకి వెళ్లింది. దానికి ప్ర‌తిగా ప్రస్తుత సంస్థాగ‌త‌ పునర్విభజనలో బీసీ, కమ్మ వర్గాల నేతలను చేర్చుకున్నారు. పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవిని బీసీ వర్గానికి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణకు కేటాయించారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల సమన్వయకర్తగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిని నియమించారు. బీసీ వర్గానికి చెందిన వైఎస్‌ఆర్‌సీ ఎంపీ (రాజ్యసభ) పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో పాటు మరో ఎంపీ మిధున్‌రెడ్డికి కాకినాడ‌, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

2019 నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌కు, సీఎంకు అత్యంత సన్నిహితులుగా భావించే ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలను భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి ఎంపీ బీద మస్తాన్‌రావుకు అప్పగించారు. కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నిర్వహించనున్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాలను ఆకేపాటి అమరనాధ రెడ్డికి అప్పగించారు. అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లో పెట్టారు.

మాజీ మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కొడాలి నానిలకు మంత్రి పదవులు గల్లంతు అయినప్పటి నుంచి యాక్టివ్‌గా లేకపోవడంతో వారిని కూడా పదవుల నుంచి తప్పించారు. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి నుంచి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు అలియాస్ అవంతి శ్రీనివాస్ క్రియాశీలకంగా లేకపోవడంతో ఆయనను తొలగించి కొత్త అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్‌ను నియమించారు. మరో మాజీ మంత్రి మేకతోటి సుచరిత తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ను నియమించారు. తిరుప్పాడి జిల్లా అధ్యక్ష పదవి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని తప్పించి నేదురుమల్లి రామ్‌కుమార్‌కు స్థానం కల్పించారు. కోఆర్డినేటర్ పదవి భాస్కర్ రెడ్డికి దక్కింది. మాజీ మంత్రి పుష్పశ్రీవాణిని తొలగించి ఆమె భర్త పరీక్షిత్తు రాజుకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ వల్ల పార్టీ రూపురేఖలు మారడమే కాకుండా పునరుజ్జీవం కూడా వస్తుందని వైసీపీ అంచ‌నా వేస్తోంది.

ప్ర‌స్తుతం సంస్థాగ‌త మార్పులు పూర్తి చేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌న‌వ‌రి 18వ తేదీ త‌రువాత ఎప్పుడైనా మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం క్యాబినెట్ లో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం లేక‌పోవడాన్ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు, ప్ర‌స్తుతం క్యాబినెట్లోని న‌లుగురు మంత్రుల గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింద‌ని స‌ర్వేల సారాంశ‌మ‌ట‌. రాయ‌ల‌సీమ‌కు చెందిన ఇద్ద‌రు మ‌హిళా మంత్రుల‌కు ఉద్వాస‌న ప‌లికే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అలాగే, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఒక‌రు, ఉత్త‌రాంధ్రకు ప‌రిధిలోని మ‌రో మంత్రి మొత్తంగా న‌లుగురు మంత్రుల‌కు ఉద్వాస‌న‌తో పాటు ఎన్నిక‌ల టీమ్ ను త‌యారు చేసుకునేలా ప‌నిలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిమ‌గ్నం అయ్యార‌ని స‌మాచారం. సో.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 3.0ను త్వ‌ర‌లో చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.