Site icon HashtagU Telugu

Capital Amaravati : అమ‌రావ‌తిపై జ‌గ‌న‌న్న మాస్ట‌ర్ ప్లాన్

అమ‌రావ‌తి రైతుల‌కు హైకోర్టు తీర్పు సానుకూల‌మా? ప్ర‌తికూల‌మా? అనేది ఒక మాత్ర‌న అర్థం కావ‌డంలేదు. ఆ తీర్పును బేస్ చేసుకుని జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం ప్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేయ‌డానికి సిద్ధం అయింది. మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌డంతో ప్లాట్ల‌ను కేటాయించాల‌ని తీర్పు చెప్పింది. ఆ మేర‌కు ప్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సీఆర్డీయే అధికారులు రైతుల‌కు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలా? వ‌ద్దా? అనే సందిగ్ధంలో రైతులు ప‌డిపోయారు. ఆ రిజిస్ట్రేష‌న్లు పూర్తయితే, ఏడాది ఇస్తోన్న రూ. 50వేల కౌలుకు నామం పెట్టే ఛాన్స్ ఉంది.రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం 29 గ్రామాల‌కు చెందిన‌ 28,587 మంది రైతుల నుంచి 34,385 ఎకరాలను సేకరించింది. ఆనాడు సీఆర్డీయేతో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి. ఆ మేర‌కు 64,735 ప్లాట్లను రైతుల‌కు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నివాస ప్లాట్లు 38,282 కాగా, వాణిజ్య ప్లాట్లు 26,453 ఉన్నాయి. చంద్ర‌బాబు హయాంలో 40,378 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది.

సీఆర్డీయే ఒప్పందం ప్ర‌కారం రిజిస్ట్రేష‌న్ పూర్తియితే, రైతుల భూముల‌పై ప్ర‌భుత్వానికి సంపూర్ణ హ‌క్కులు వ‌స్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ నిలిచిపోవ‌డంతో సంపూర్ణంగా ఆ భూముల‌పై సీఆర్డీయే సొంతం చేసుకోలేక‌పోయింది. సీఆర్డీయే ఒప్పందం ప్ర‌కారం అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉండాలి. అక్క‌డ సింగ‌పూర్ కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం నిర్మాణాలు జ‌ర‌గాలి. సింగ‌పూర్ క‌న్సార్టియం ఎప్పుడో ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంది. ఆ దేశ కంపెనీలు ఇటువైపు చూడ‌డంలేదు. ఈ క్ర‌మంలో రైతుల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తూ ప్లాట్ల‌ను కేటాయించిన‌ప్ప‌టికీ వాళ్ల‌కు ఒరిగేదీ ఏమీ లేదు. పైగా కౌలు డ‌బ్బు ఇవ్వ‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.
హైకోర్టు చెప్పిన మౌలిక స‌దుపాయాల కింద విద్యుత్‌, మంచినీళ్లు, రోడ్ల వ‌ర‌కు ప్ర‌భుత్వం క‌ల్పించాలి. ఆ త‌రువాత రైతుల‌కు ప్లాట్ల‌ను భౌతికంగా అప్ప‌గిస్తుంది. వాస్త‌వంగా ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది రైతులు వాళ్ల భూమిలో వ్య‌వ‌సాయం చేసుకుంటున్నారు. సుమారు 1000 ఎక‌రాల్లో మాత్ర‌మే ప్ర‌భుత్వ భ‌వ‌నాలు ఉన్నాయి. మిగిలిన భూముల్లో పంట‌లు వేసుకుంటున్నారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వ్య‌వ‌సాయం చేసుకుంటోన్న భూముల‌ను ప్ర‌భుత్వానికి స్వాధీనం చేయాలి. అమ‌రావ‌తి ప్రాంతంలోని చాలా మంది రైతులు జ‌గ‌న్ స‌ర్కార్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న త‌రువాత ఎవ‌రికి వాళ్లే భూముల్లో సాగు చేసుకుంటున్నారు. అంతేకాదు, ఏడాదికి రూ 50వేల కౌలును ప్ర‌భుత్వం నుంచి పొందుతున్నారు. ఇలా రెండు వైపులా ఎక్కువ మంది రైతులకు ల‌బ్ది చేకూరుతోంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సంపూర్ణంగా భూముల‌ను సీఆర్డీయేకి స్వాధీనం ప‌ర‌చాలి. విధించిన గ‌డువులోగా మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వం కూడా సిద్ధంగా ఉంది. కేంద్ర విడుద‌ల చేసిన నిధుల‌తో విద్యుత్‌, మంచినీళ్లు, రోడ్ల‌ను ఏర్పాటు చేస్తోంది. రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ మాదిరిగా ప్లాట్ల‌ను రైతుల‌కు అప్ప‌గిస్తుంది. కానీ, రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉంటుంద‌ని మాత్రం జ‌గ‌న్ స‌ర్కార్ హామీ ఇవ్వ‌దు. పైగా మూడు రాజ‌ధానులకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రైతుల‌కు ప్లాట్ల‌ను కేటాయించ‌డం వ‌ల‌న రైతుల‌కు వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు. కానీ, ప్ర‌భుత్వం మాత్రం ఆ భూముల‌ను తాక‌ట్టుపెట్టుకుని రుణాలు తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. సో..హైకోర్టు తీర్పును సానుకూలంగా జ‌గ‌న్ స‌ర్కార్ మ‌లుచుకుంటుంద‌న్న‌మాట‌.