Site icon HashtagU Telugu

Jagan 2.0 : రాబోయే 30 ఏళ్లు మేమే – జగన్

Jagan2.0

Jagan2.0

ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఎన్నికల్లో పరాజయం అనంతరం వైసీపీ (YCP) వరుసగా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి (Jagan) కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడ నగరానికి చెందిన కార్పొరేటర్లు, పార్టీ నేతలతో భేటీ అయిన జగన్, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఇకపై జగన్ 2.0ను చూడబోతారని, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తన నాయకత్వంలో పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇబ్బందులు పెడుతోందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతుంటే, తాము కూడా చట్టపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు. గత పాలనలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని, అయితే పార్టీ కార్యకర్తల కోసం తగినంతగా పని చేయలేకపోయానని అంగీకరించారు. కానీ ఈసారి అలాంటి పొరపాట్లు జరగవని, కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టనున్నానని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసిన పార్టీ వైసీపీ మాత్రమేనని గుర్తుచేశారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలను నిలిపేయకుండా, నిరంతరాయంగా ప్రజలకు అందించామని చెప్పారు.

Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు..

వైసీపీ ఓడిపోయినప్పటికీ, ఇప్పటికీ ప్రజల్లో విశ్వాసాన్ని నిలుపుకుని ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ముగిసి తొమ్మిది నెలలైనా, ప్రజల మధ్య మమేకమై సమస్యలు విన్నటువంటిదే తమ పరిస్థితి అని, కానీ అధికారంలో ఉన్న కూటమికి మాత్రం ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేదని విమర్శించారు. అధికార కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.

జగన్ 2.0 అనే కొత్త విధానంతో పార్టీని బలోపేతం చేయడమే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. పార్టీని మరింత శక్తివంతంగా మార్చి వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలవడమే లక్ష్యమని ప్రకటించారు. కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల మద్దతును సంపాదించుకునే విధంగా కొత్త కార్యచరణ చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.