AP Politics : చంద్ర‌బాబు ఎఫెక్ట్‌, వైసీపీ ప్ర‌క్షాళ‌న‌!

భ‌యం అనేది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డిక్ష‌న‌రీలో ఉండ‌దంటారు వైసీపీ లీడ‌ర్లు.

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 05:15 PM IST

భ‌యం అనేది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డిక్ష‌న‌రీలో ఉండ‌దంటారు వైసీపీ లీడ‌ర్లు. కానీ, ఆయ‌న ఓట‌మి భ‌యంతో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాడ‌ని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు చెబుతున్నారు. అందుకే ఏకంగా ఎనిమిది జిల్లాల‌ అధ్య‌క్షుల‌ను మార్చేశార‌ని అంటున్నారు. మినీ మ‌హానాడు, బాదుడేబాదుడు, క‌ర్నూలు స‌భ‌కు వ‌చ్చిన స్పంద‌న గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జంకుతున్నార‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులతో స‌మావేశం అయిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు వైసీపీ ప‌రిస్థితిని అంచ‌నా వేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో ఆక్వా రంగం అంశాలను చేర్చుతామ‌ని హామీ ఇచ్చిన ఆయ‌న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భ‌యం గురించి ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. క‌ర్నూలు స‌భ‌కు వ‌చ్చిన ప్ర‌జాద‌ర‌ణ చూసిన త‌రువాత 175 స్థానాల్లోనూ టీడీపీ గెలుస్తుంద‌ని అంచ‌నా వేయ‌డం గ‌మ‌నార్హం.

తెలుగుదేశం పార్టీకి రాబిన్ సింగ్ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉండ‌గా, వైసీపీకి వ్యూహ‌క‌ర్త‌గా రుషిరాజ్ సింగ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇరు పార్టీలు వ్యూహ‌క‌ర్త‌లు ఇచ్చే స‌ల‌హాలు, సూచ‌ల‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. టిక్కెట్ల విష‌యంలో కూడా వాళ్లిద్ద‌రి స‌ర్వేలను ఆధారంగా చేసుకోబోతున్నారు. ఆ క్ర‌మంలోనే పలు జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులను మార్చుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నార‌ని వైసీపీ చెబుతోంది. తొలగించిన వాళ్లా జాబితాలో సుచరిత (గుంటూరు జిల్లా), ముత్తంశెట్టి శ్రీనివాస్ (విశాఖ), పుష్ప శ్రీవాణి (పార్వతీపురం మన్యం జిల్లా), బుర్రా మధుసూదన్ యాదవ్ (ప్రకాశం జిల్లా), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (తిరుపతి జిల్లా), బాల నాగిరెడ్డి (కర్నూలు జిల్లా) తదితరులను జిల్లా వైసీపీ అధ్యక్ష ప‌ద‌వుల నుంచి తప్పించారు. వాళ్ల గ్రాఫ్ దారుణంగా ఉంద‌ని స‌ర్వేలు తేల్చిన తరువాత మాత్ర‌మే తొలగించార‌ని తెలుస్తోంది. అలాంటి సాహ‌సం చంద్ర‌బాబు చేయ‌గ‌ల‌రా? అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది.