Site icon HashtagU Telugu

YS Jagan : జ‌గ‌న్ పాల‌న‌కు అరుదైన అవార్డు

Jagan mohan reddy

Jagan mohan reddy

గ్రామీణాభివృద్ధి కోసం జ‌గ‌న్ అనుస‌రిస్తోన్న విధానాల‌కు జాతీయ స్థాయి గుర్తింపు ల‌భించింది. గ్రామీణ ప్రాంతాల్లో ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయ‌ని స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2021 నిర్థారించింది. పారదర్శక పాలన, ప్రజల వ‌ద్ద‌కు ప్ర‌జల‌కు సేవలను తీసుకువెళ్ళడం త‌దిత‌ర‌ అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సానుకూల ఫలితాలను సాధించింద‌ని గుర్తించింది. అందులో భాగంగా తాజాగా స్టార్ ఆఫ్ గవర్నెన్స్ స్కోచ్ అవార్డుకు ఏపీ ఎంపిక అయింది.

గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక ”స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2021”లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీనిలో భాగంగా ”స్టార్ ఆఫ్ గవర్నెన్స్-స్కోచ్ అవార్డు”కు ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు స్కోచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ ప్రకటించారు. జూన్ 18వ తేదీన ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ఏపీ ప్ర‌భుత్వం అందుకోనుంది. ఆ మేర‌కు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో దీప‌క్ వెల్లడించారు. అవార్డును అందుకున్న సంద‌ర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, ఉద్యోగులను జ‌గ‌న్ అభినందించారు.