R Krishniah : జ‌గ‌న్ `సోష‌ల్ యాత్ర` స్పెష‌ల్‌

మ‌రోసారి సీఎం కావ‌డానికి సోష‌ల్ ఇంజనీరింగ్ ను ఏపీ సీఎం జ‌గ‌న్ న‌మ్ముకున్నారు. అందుకే, చంద్ర‌బాబుకు అండ‌గా ఉండే సామాజిక‌వ‌ర్గాన్ని పూర్తిగా దూరం పెట్టారు.

  • Written By:
  • Updated On - May 19, 2022 / 02:45 PM IST

మ‌రోసారి సీఎం కావ‌డానికి సోష‌ల్ ఇంజనీరింగ్ ను ఏపీ సీఎం జ‌గ‌న్ న‌మ్ముకున్నారు. అందుకే, చంద్ర‌బాబుకు అండ‌గా ఉండే సామాజిక‌వ‌ర్గాన్ని పూర్తిగా దూరం పెట్టారు. తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉండే వెనుకబ‌డిన వ‌ర్గాల‌పై క‌న్నేశారు. వాళ్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప‌లు ర‌కాల ప‌ద‌వుల‌ను ఎర‌వేస్తున్నారు. రెండు రాజ్య‌స‌భ టిక్కెట్ల‌ను బీసీల‌కు ఇవ్వ‌డం ద్వారా ఆ సామాజిక‌వ‌ర్గాన్ని సొంతం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. కానీ, ప్రాంతీయ వాదం రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక‌ను వెంటాడుతోంది. ఏపీ రాష్ట్రంలోని బీసీల‌కు ప్రాధాన్యం లేకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వ‌డంపై ఆ రాష్ట్రంలోని వెనుకబ‌డిన వ‌ర్గాలు అసంతృప్తిగా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఉమ్మ‌డి ఏపీ బీసీ లీడ‌ర్ గా ఆర్ కృష్ణ‌య్య సుప‌రిచ‌యం. రాష్ట్రాలు విడిపోయిన త‌రువాత బీసీ సంఘాలు కూడా వేర్వేరుగా క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ మేర‌కు స‌మావేశాల‌ను కూడా ఏపీలో పెట్టుకుంటున్నాయి. ఇటీవ‌ల విశాఖ‌, తిరుప‌తి, విజ‌య‌వాడ కేంద్రంగా బీసీ సంఘాల నేత‌లు స‌మావేశం అయ్యారు. రాబోవు ఎన్నిక‌ల నాటికి కొత్త కార్య‌వ‌ర్గాల‌తో యాక్టివ్ కావడానికి ఏపీలోని వెనుక‌బ‌డిన వ‌ర్గాల నాయ‌కులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఆ టైంలోనే తెలంగాణ‌కు చెందిన ఆర్ కృష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ‌ను వైసీసీ ప్ర‌క‌టించింది. కానీ, ఆ పార్టీ కండువాను వేసుకోవ‌డానికి కూడా ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డంలేదు. గ‌తంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర కృష్ణ‌య్య‌కు ఉంది. ఆ త‌రువాత కండువా, జెండా ప‌ట్టుకోకుండా కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవ‌ల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటోన్న ఆయ‌న 2019 ఎన్నిక‌లకు ముందుగా జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌లో ఒక‌టిరెండు సార్లు క‌నిపించారు. తాజాగా ష‌ర్మిల పాద‌యాత్ర‌లోనూ త‌ళుక్కుమ‌న్నారు. స్వ‌ర్గీయ వైఎస్ ఆర్ ఆత్మీయుల కోసం ఇటీవ‌ల విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల సంయుక్తంగా నిర్వ‌హించిన స‌మ్మేళ‌నంలో వాయిస్ వినిపించారు. సీన్ క‌ట్ చేస్తే, వైసీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఆయ‌న్ను జ‌గ‌న్ ఎంపిక చేయ‌డం సర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది.

తెలంగాణ ప్ర‌జ‌లు వ‌దిలిన అశుద్ద‌పు నీళ్ళు తాగి బ‌తికే ఆంధ్రోళ్లు అంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన జ‌ర్న‌లిస్ట్ అమ‌ర్ ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కార్ కు మీడియా స‌ల‌హాదారుగా ఉన్నారు. అంతేకాదు, తెలంగాణ‌కు చెందిన ప‌లువురు స‌ల‌హాదారులుగా, నామినేటెడ్ పోస్టుల్లో కొన‌సాగుతున్నారు. సాక్షి ప‌త్రిక‌లో ప‌నిచేసిన తెలంగాణ జ‌ర్న‌లిస్ట్ ల‌కు పీఆర్వోల నుంచి ప‌లు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను ప‌ప్పుబెల్లాల్లా జ‌గ‌న్ పంచారు. తాజాగా నిరంజ‌న్ రెడ్డి, ఆర్ కృష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ ప‌ద‌వుల‌ను ఇవ్వ‌డం ఏపీ ప్ర‌జ‌ల విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. కేవ‌లం బీసీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి కృష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ ఇచ్చార‌ని వైసీపీలోని టాక్. కానీ, ఏపీ వెనుకబ‌డిన వ‌ర్గాల నుంచి వ‌స్తోన్న రివ‌ర్స్ వాయిస్ జ‌గ‌న్ కు 2024 ల‌క్ష్యాన్ని ప్ర‌శ్నించేలా ఉంది.

సోషల్ ఇంజ‌నీరింగ్ ద్వారా 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. అందుకే, క్యాబినెట్ రెండో విడ‌త ఏర్పాటు, రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక‌లో బీసీల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. క్యాబినెట్ లో ఎస్టీ, ఎస్సీల‌కు త‌గిన గుర్తింపు ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. బీసీ ఉప‌కులాల వారీగా కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా అంద‌ర్నీ సంతృప్తి ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు జ‌గ‌న్ ఇస్తోన్న ప్రాధాన్యం ఫోక‌స్ కావ‌డానికి ఇప్పుడు జ‌గ‌న్ ప్లాన్ చేశారు. ఆ క్ర‌మంలో ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఏపీ కేబినెట్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా బ‌స్సు యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నారు. ఈ నెల 26న విశాఖ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్న‌ట్లుగా స‌మాచారం. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకోగా, బ‌స్సు యాత్ర‌కు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఆయా మంత్రుల‌కు ఆదేశాలు జారీ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఈ నెల 26 నుంచి 29 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు సాగ‌నున్న ఈ యాత్ర‌లో భాగంగా రాష్ట్రంలోని ముఖ్య ప‌ట్ట‌ణాల్లో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ సాగుతుంద‌ని స‌మాచారం. ఆయా ప‌ట్ట‌ణాల్లో ఏర్పాటు చేసే స‌మావేశాల్లో మాట్లాడ‌నున్న మంత్రులు, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించనున్నారు. తొలి విడ‌త మంత్రుల‌తో కూడిన బ‌స్సు యాత్ర విజ‌య‌వంతం అయిన త‌రువాత ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌కు ప్లాన్ చేస్తున్నారు. బీసీ ఉప కులాల వారీగా నియ‌మించిన కార్పొరేష‌న్ చైర్మ‌న్ల ఆధ్వ‌ర్యంలో సమ్మేళ‌నాలు. పెద్ద ఎత్తున నిర్వ‌హించాల‌ని వైసీపీ క‌స‌ర‌త్తు చేస్తోంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కార్పొరేష‌న్ చైర్మ‌న్ల ఆధ్వ‌ర్యంలో ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని స్కెచ్ వేశారు. ఫైన‌ల్ గా రాజ్య స‌భ‌, లోక్ స‌భ కు ఎంపికైనా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎంపీలతో బ‌స్సు యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేయించాల‌ని రూట్ మ్యాప్ త‌యారు అవుతోంది. ఇలా సామాజిక స‌మీక‌ర‌ణాల కోణం నుంచి ఈసారి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. 2024 దిశ‌గా జ‌గ‌న్ ర‌చించిన సోష‌ల్ ఇంజ‌నీరింగ్ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూద్దాం.!