YS Jagan & Chandrababu : చంద్ర‌బాబు లోపాల‌పై జ‌గ‌న్ స్వారీ

సామాజికంగా బీసీ, ఎస్టీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి మొద‌టి నుంచి బ‌లంగా ఉండేది. ఎస్సీల్లో మాదిగ సామాజిక వ‌ర్గం అత్య‌ధికంగా టీడీపీతో ఉండేద‌ని ఆ పార్టీ లెక్క‌

  • Written By:
  • Publish Date - April 12, 2022 / 01:11 PM IST

సామాజికంగా బీసీ, ఎస్టీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి మొద‌టి నుంచి బ‌లంగా ఉండేది. ఎస్సీల్లో మాదిగ సామాజిక వ‌ర్గం అత్య‌ధికంగా టీడీపీతో ఉండేద‌ని ఆ పార్టీ లెక్క‌. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి బీసీ, ఎస్టీ, ఎస్సీలోని మాదిగ‌, క‌మ్మ ఓటు బ్యాంకు సాలిడ్ గా ఉండేదని ప్ర‌త్య‌ర్థులు అంచ‌నా వేసే వాళ్లు. ఎన్టీఆర్ 1982లో పార్టీ పెట్టే నాటికి కాంగ్రెస్ పార్టీ హ‌వా ఉండేది. 1983లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కులాలు, మ‌తాల‌కు అతీతంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు. అందుకే, ద‌శాబ్దాలుగా వేళ్లూనుకున్న కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ పెక‌లించారు.ఉమ్మ‌డి ఏపీలోని ప‌టేల్ , ప‌ట్వారీ, మున‌సుబు, క‌ర‌ణాల వ్య‌వ‌స్థ‌ను ఎన్టీఆర్ ర‌ద్దు చేశారు. అప్ప‌టి వ‌ర‌కు ఆ హోదాల‌ను ఎక్కువ‌గా బ్రాహ్మ‌ణులు ఏపీలో అనుభ‌విస్తుండే వాళ్లు. తెలంగాణ ప్రాంతంలో రెడ్డి సామాజిక వ‌ర్గం ప‌టేల్‌, ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌తో మిగిలిన వ‌ర్గాల‌ను అణ‌గ‌తొక్కే సంస్కృతి ఉండేద‌ట‌. ఆంధ్రాలో మున‌సుబు, క‌ర్ణాల వ్య‌వ‌స్థ ద్వారా బ్రాహ్మ‌ణ రాజ్యం గ్రామాల్లో క‌నిపించేది. ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో ఏపీలోని బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం పూర్తిగా వ్య‌తిరేకంగా ఆనాడు మారింది. తెలంగాణ‌లో ప‌టేల్, ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌డంతో రెడ్డేత‌ర వ‌ర్గాల‌న్నీ టీడీపీకి సాలిడ్ గా మారాయి . అందుకే, ఆంధ్రా కంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం హ‌వా 2014 వ‌ర‌కు కొన‌సాగింద‌ని ఆ పార్టీ లెక్కిస్తోంది.ఆంధ్రా ఎస్సీల్లో మాల సామాజిక‌వ‌ర్గం ఆధిప‌త్యం ఉంటుంది. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిప‌రులుగా మాల సామాజిక‌వ‌ర్గంలోని కీల‌క లీడ‌ర్లు ఉంటారు. ఇందిర‌మ్మ బొమ్మ‌ను చూడ‌గానే ఓటు వేసే సామాజిక‌వ‌ర్గంగా మాల వ‌ర్గంపై నాయ‌కుల అంచ‌నా ఉండేది. ఆ ఓటు బ్యాంకు ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ‌ళ్లింది. దానికి కార‌ణంగా క్రిస్టియానిటీ బాగా ప‌నిచేస్తుంద‌ని ప్ర‌త్య‌ర్థుల భావ‌న‌. ఆంధ్రాలోని ఎస్సీల్లో మాల సామాజిక‌వ‌ర్గం 85శాతం క్రిస్టియ‌న్ మ‌తం తీసుకున్నార‌ని అంచ‌నా.

 

ఇక ఎస్సీల్లోని మాదిగ సామాజిక‌వ‌ర్గం తొలి నుంచి రైతాంగంతో అనుబంధంగా ఉంటుంది. అందుకే, తొలి నుంచి టీడీపీ మాదిగ‌ల‌ను ఆకర్షించింద‌ని ఒక విశ్లేష‌ణ‌. ఎన్టీఆర్ హ‌యాంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ‌గా టీడీపీ వైపు ఆక‌ర్షితుల‌య్యారు. స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం అయిన త‌రువాత కాంగ్రెస్ వైపు వాళ్ల‌ను పూర్తిగా మ‌ళ్లించారు. నాలుగుశాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డం ద్వారా వైఎస్ వాళ్ల మ‌న‌సును దోచుకున్నారు. ఆ ఓటు బ్యాంకు వార‌స‌త్వంగా వైసీపీకి మ‌ళ్లింది. పైగా ఎంఐఎం కూడా ప‌రోక్షంగా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇస్తోంది. ఫ‌లితంగా ముస్లిం ఓటు బ్యాంకును టీడీపీ చేజార్చుకుంది.అగ్ర‌వ‌ర్ణ పేద‌లు, వెనుక‌బడిన వ‌ర్గాల‌న్నీ టీడీపీకి అండ‌గా ఉండేవి. కాపు సామాజిక‌వ‌ర్గాన్ని ప‌వ‌న్ రూపంలో ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేశారు. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చే 10శాతం రిజ‌ర్వేష‌న్లో ఐదు శాతం కాపుల‌కు ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. దీంతో అగ్ర వ‌ర్ణ పేద‌లు, బీసీలు టీడీపీ దూరంగా జ‌రిగారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం 23 ఎమ్మెల్యేల‌కు టీడీపీ ప‌రిమితం అయింది. కాపు, బ‌లిజ‌, ఒంట‌రి కులాల్లో కాపు సామాజిక‌వ‌ర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేది. కానీ, బ‌లిజ‌, ఒంట‌రి కులాలు టీడీపీ వైపే ఉండేవ‌ని అంచ‌నా. ప్ర‌జారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టిన త‌రువాత కాపులు సాలిడ్ గా అటు వైపు వెళ్లారు. ఆ త‌రువాత జ‌న‌సేన కు మ‌ళ్లార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఎవ‌రైనా చెబుతారు. బ‌లిజ‌, ఒంట‌రి కులాల‌కు ప‌ద‌వుల‌ను ఇవ్వ‌డం ద్వారా వైసీపీ ఆక‌ర్షించింది. అందుకే, 2019 ఎన్నిక‌ల్లో 151 ఎమ్మెల్యేల‌ను గెలుచుకో గ‌లిగింది.

2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి ద‌గ్గ‌ర‌యిన బీసీ, ఎస్టీ, బ‌లిజ‌, ఒంట‌రి కులాలు బేసిగ్గా టీడీపీ ఓటు బ్యాంకు. తిరిగి టీడీపీ గూటికి వెళ్ల‌కుండా జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. ఏపీ చ‌రిత్ర‌లో లేని విధంగా ఎస్టీల‌కు మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించారు. శెట్టి బ‌లిజ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. బీసీల‌కు అత్య‌ధికంగా 10 మందికి క్యాబినెట్ లో అవ‌కాశం ఇచ్చారు. క‌మ్మ‌, బ్రాహ్మ‌ణ‌, వైశ్య‌, క్ష‌త్రియ కులాల‌ను పూర్తిగా జ‌గ‌న్ వ‌దిలేశారు. బ్రాహ్మ‌ణ‌, వైశ్య , క్ష‌త్రియ కులాల్లో ఎక్కువ మంది పోలింగ్ రోజు ఓటుకు దూరంగా ఉంటార‌ని అంచ‌నా. రాజ్యాధికారం చేజిక్కించుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోవాలి. ఆ ఓటు బ్యాంకు చంద్ర‌బాబు నిర్ణ‌యాల కార‌ణంగా టీడీపీకి దూరం అయింద‌ని ప్ర‌త్య‌ర్థులు విశ్వ‌సిస్తున్నారు.అధికారంలో ఉన్న‌ప్పుడు ఎస్టీ, బీసీల‌కు కీల‌క స్థానాల్లో చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇవ్వ‌లేక పోయారు. పైగా బీసీల్లోని యువ‌తను కాద‌ని సీనియ‌ర్లు ఒక‌రిద్ద‌రిని ఎప్పుడూ బీసీ కార్డ్ గా ఫోక‌స్ చేయ‌డం జ‌రిగింది. ఎస్సీల‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ప్ప‌టికీ మాల వ‌ర్గానికి చెందిని జూపూడి ప్రభాక‌ర్ లాంటి వాళ్ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి ఎన్టీఆర్ హ‌యాం త‌రువాత చంద్ర‌బాబు ప్రోత్స‌హించిన దాఖ‌లాలు లేవు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసిన‌ప్ప‌టికీ ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని చ‌క్రం తిప్పిన చంద్ర‌బాబు దాన్ని నెర‌వేర్చ‌లేక‌పోయారు. బీసీల రిజ‌ర్వేష‌న్ పై మంజునాథ‌న్ క‌మిటీ వేసి దానిలో కాపుల‌ను భాగ‌స్వామ్యం చేసే అత్యంత దారుణ‌మైన ప్ర‌య‌త్నాన్ని చేశారు.

క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలోని ఒక గ్రూప్ ను మాత్ర‌మే తొలి నుంచి చంద్ర‌బాబు ప్రోత్స‌హించారు. హైద‌రాబాద్ పార్టీ ఆఫీస్ ను ఆ గ్రూప్ వ్యాపార కేంద్రంగా మార్చుకుని జీరో నుంచి కుబేర సామ్రాజ్యాల‌ను స్థాపించింది. ఆ గ్రూప్‌ను బూచిగా చూపిస్తూ శ్ర‌మను న‌మ్ముకుని బ‌తికే క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని ఒక శ‌త్రువుగా సామాజానికి చూపించే ప్ర‌య‌త్నం జ‌గ‌న్ అండ్ కో చేస్తోంది. కానీ, పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు అండ‌తో కుబేరులుగా మారిన ఆ గ్రూప్ ఏనాడూ దైర్యంగా నిల‌బ‌డ‌లేదు. పైగా కుబేరులుగా మారిన గ్రూప్‌లోని పారిశ్రామిక‌వేత్తలు ప‌ర‌స్ప‌రం వెన్నుపోటు పోడుచుకుంటూ క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని బ‌జారు కీడ్చారు. అందుకు రెండు ఉదాహ‌ర‌ణ‌ల‌ను ప్ర‌ధానంగా కోడ్ చేయొచ్చు. అందులో ఒక‌టి మార్గ‌ద‌ర్శి ఇష్యూ వ‌చ్చిన‌ప్పుడు జ‌రిగిన త‌తంగాన్ని గుర్తు చేసుకోవ‌చ్చు. ఆనాడు సాక్షి పేప‌ర్ లేదు. మార్గ‌ద‌ర్శి మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఫోక‌స్ చేయ‌డానికి కమ్మ సామాజిక‌వ‌ర్గం కు ఉన్న మ‌రో ప‌త్రిక ద్వారా స్వ‌ర్గీయ వైఎస్ యుద్ధం చేశారు. 2009 ఎన్నిక‌ల్లో వైఎస్‌కు మ‌ద్ద‌తుగా జ‌య‌హో కాంగ్రెస్ అంటూ క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఛాన‌ల్ అండ‌గా నిలిచింది. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోవ‌డానికి కూడా కుబేరుల సామ్రాజ్యంలోని క‌మ్మ గ్రూప్ స‌హ‌కారం అందించింది. ఫ‌లితంగా సామాన్యులు, పేద క‌మ్మ వాళ్లు ఇప్ప‌టీకీ ఆ నష్టాన్ని అడుగ‌డునా భ‌రిస్తున్నారు. క‌మ్మ వ‌ర్గానికి చెందిన సంఘ‌సంస్క‌ర్త‌లుగా ఉండే పారిశ్రామిక‌వేత్త‌ల‌ను బాబు ఆక‌ర్షించ‌లేక‌పోయారు. ఫ‌లితంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని ఒక బూచిగా చూపుతూ నాడు వైఎస్ నేడు జ‌గ‌న్ వేస్తోన్న ఎత్తుగ‌డ‌లు ఫ‌లిస్తూ వ‌చ్చాయి. ఈసారి కూడా నేల విడిచి సాము చేస్తోన్న చంద్ర‌బాబుపై విజ‌యం సాధించే దిశ‌గా ఏర్పాటు చేసిన మంత్రివ‌ర్గం ప్ర‌భావం టీడీపీ సంప్ర‌దాయ ఓటు బ్యాంకుపై ఎలా ప‌నిచేస్తుందో..చూడాలి!