AP Cabinet Expansion : మంత్రివ‌ర్గంలో ’70 ప్ల‌స్’ కటాఫ్‌.?

ఏపీ సీఎం జ‌గ‌న్ క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు కొత్త జిల్లాల ప్రాతిప‌దిక కానుంది. ఒక్కో కొత్త జిల్లాకు ఒక మంత్రి ఉండేలా మంత్రివ‌ర్గం మార్పు ఉంటుంద‌ని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - March 12, 2022 / 05:32 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు కొత్త జిల్లాల ప్రాతిప‌దిక కానుంది. ఒక్కో కొత్త జిల్లాకు ఒక మంత్రి ఉండేలా మంత్రివ‌ర్గం మార్పు ఉంటుంద‌ని తెలుస్తోంది. మొత్తం 26 జిల్లాల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ ఏర్పాటు చేస్తోంది. అందుకు సంబంధించిన ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌కు చేరింది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ తో క‌లుపుకుని 26 మంది మంత్రివ‌ర్గంలో ఉన్నారు. అదే సంఖ్య‌ను కొన‌సాగిస్తూ ఈసారి మంత్రివ‌ర్గం మార్పు ఉంటుంద‌ని స‌చివాల‌య వ‌ర్గాల భావ‌న‌.ప్ర‌స్తుతం ఉన్న మంత్రి వ‌ర్గాన్ని 100శాతం మార్చే అవ‌కాశం ఉంద‌ని నాలుగు నెల‌ల క్రిత‌మే మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మీడియాకు వెల్ల‌డించాడు. ఆ మేర‌కు మార్పులు చేయ‌డానికి జ‌గ‌న్ స‌న్న‌ద్ధం అయ్యాడు. కానీ, ప‌నితీరు బాగా ఉన్న ఒక‌రిద్ద‌రు మంత్రుల‌ను మాత్రం ప్ర‌స్తుత క్యాబినెట్ లో కొన‌సాగించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. సుమారు 23 కొత్త ముఖాలు ఈసారి జ‌గ‌న్ క్యాబినెట్లో క‌నిపిస్తాయ‌ని చ‌ర్చించుకుంటున్నారు. మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానాల్లో వ‌చ్చిన మంత్రులు అప్ప‌ల‌రాజు మ‌రో మంత్రికి కొన‌సాగింపు ఉంటుంద‌ని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని కొన‌సాగించే అవ‌కాశాలు లేక‌పోలేదు.ఆ ముగ్గురు మిన‌హా క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని టాక్‌.

ఒక వేళ పెద్దిరెడ్డిని కొన‌సాగిస్తే, రోజాకు మంత్రి ప‌ద‌వి లేన‌ట్టే. ఇటీవ‌ల ఏపీఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి ఆమెను త‌ప్పించారు. ఆనాటి నుంచి జ‌గ‌న్ తో ముఖాముఖి క‌లిసేందుకు ఆమెకు అవకాశం రాలేదు. పైగా ఆమె మీద ఉన్న ప‌లు ఫిర్యాదులు, చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో రోజా ఇమ‌డ‌లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాలు మైన‌స్ గా ఉన్నాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌త ఆమెకు ప్ర‌తికూలంగా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రోజాకు డిప్యూటీ స్పీక‌ర్ లేదా స్పీక‌ర్ గా అవ‌కాశం ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, జగ‌న్ వ‌ద్ద ఉన్న స‌ర్వే రిపోర్టుల ప్ర‌కారం ఆమెకు ఎలాంటి పద‌వి ఇచ్చే ఛాన్స్ లేద‌ని న‌గ‌రిలోని ఆమె వ్య‌తిరేక వ‌ర్గీయుల టాక్‌.
కొత్త జిల్లాల నుంచి ప‌రిపాల‌న ఈ ఉగాది నుంచి ప్రారంభం కానుంది. అంతేకాదు, ప్ర‌తి మూడు జిల్లాల‌కు ఒక ప్రాంతీయ మండ‌లిని ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. వాస్త‌వంగా నాలుగు ప్రాంతీయ మండ‌ళ్ల‌ను పాత జిల్లాల వారీగా చేయాల‌ని తొలుత భావించారు. కానీ, ఇప్పుడు కొత్త జిల్లాల పాల‌న అమ‌లులోకి రావ‌డంతో ప్ర‌తి మూడు జిల్లాలకు ఒక ప్రాంతీయ బోర్డు ఏర్పాటు కానుంది. వాటికి అనుగుణంగా ఎనిమిది బోర్డుల‌ను ఏర్పాటు చేసి ఎనిమిది మందికి చైర్మ‌న్ ప‌ద‌వులు మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించిన వాళ్ల‌కు కేటాయించే అవకాశం ఉంద‌ని వినికిడి. మిగిలిన వాళ్ల‌కు జిల్లా ఇంచార్జిల‌ను చేయ‌డం ద్వారా పార్టీకి సేవ చేసే అవ‌కాశాన్ని ఇస్తారు. ఈసారి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాళ్ల పనితీరు ఆధారంగా మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటారు.

క్యాబినెట్ లో చోటు కోసం చాలా మంది సీనియ‌ర్లు వేచిచూస్తున్నారు. కానీ, 70 ప్ల‌స్ వ‌య‌స్సున్న వాళ్ల‌కు మంత్రివ‌ర్గంలో స్థానం ఇవ్వ‌కుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ట‌. గ్రాండ్ ఓల్డ్ సీనియ‌ర్లు పార్టీకి అవ‌స‌రం లేద‌నే భావ‌న‌తో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఆ ఈక్వేష‌న్ ప్ర‌కారం 70 ప్ల‌స్ లీడ‌ర్ల‌కు వైసీపీ ఈసారి పోటీ చేసే అవ‌కాశం కూడా దాదాపు ఇవ్వ‌క‌పోవ‌చ్చు. ఆ మేర‌కు స‌ర్వే రిపోర్టుల సారాంశం కూడా ఉంద‌ట‌. ప్ర‌స్తుతం ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో క‌నీసం 100 మందిని మార్పు చేయాల‌నే ఆలోచ‌న ఉంద‌ని వైసీపీలో న‌డుస్తోన్న టాక్‌. 75 మంది ఎమ్మ‌ల్యేల ప‌నితీరు నాశిర‌కంగా ఉంద‌ని పీకే స‌ర్వే సారాంశ‌మ‌ని తెలుస్తోంది. వాళ్లంద‌రూ ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నార‌ని టాక్‌. అక్క‌డ కూడా అవ‌కాశం లేక‌పోతే జ‌న‌సేన వైపు మ‌ళ్లేలా ఉన్నార‌ని వైసీపీలోని అంత‌ర్గ‌త స‌మాచారం. అయితే, వాళ్ల‌ను వ‌దిలించుకోవ‌డానికి వైసీపీ సిద్ధం అయిన‌ట్టు తెలుస్తోంది.
మొత్తం మీద యంగ్ త‌రంగ్ తో పాటు కొత్త జిల్లా, సామాజిక వ‌ర్గం ప్రాతిప‌దిక‌న మంత్రివ‌ర్గంలో మార్పులుంటాయ‌ని స‌మాచారం. ఉగాదికి సంపూర్ణంగా కొత్త త‌ర‌హా పాల‌న సాగించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడ‌ట‌. అందుకే, అధికారులు కొత్త జిల్లాల ఆఫీస్ ల‌ను వేగంగా సిద్ధం చేస్తున్నారు. వాటిని ప్రాంతీయ మండ‌ళ్ల‌కు అనుసంధానం చేయ‌డం ద్వారా అవినీతిర‌హితంగా పాల‌న చేయాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్నాడు. విశాఖ రాజ‌ధాని కేంద్రంగా కొత్త ప‌రిపాల‌న కు శ్రీకారం చుట్టాల‌ని జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడ‌ని తెలుస్తోంది. ఆయ‌న అనుకున్న ప్ర‌కారం జ‌రిగితే, మూడు రాజ‌ధానుల స‌మ‌గ్ర బిల్లు కొత్త ఏడాది నుంచి అమలులోకి రాన‌ప్ప‌టికీ ప‌రిపాల‌న మాత్రం విశాఖ నుంచి జ‌ర‌గ‌నుందని అధికారిక వ‌ర్గాల్లో టాక్‌.