YS Jagan : ఆర్థికంగా ఏపీకి ఢోకాలేదు: అసెంబ్లీలో ఏపీ సీఎం జ‌గ‌న్

`ఏపీ ఆర్థికంగా చితికిపోయింది. ఎఫ్ఆర్బీఎం నిబంధ‌న‌ల‌ను దాటి వెళ్లింది. ఇక ఏపీ అంత‌టా చీక‌టే. రోడ్లు వేయ‌డానికి డ‌బ్బుల్లేవ్. జీతాలు ఇవ్వ‌డానికి నిధులు లేవు. రాష్ట్రం గురించి ఇక మ‌ర‌చిపోవ‌డ‌మే. ` అంటూ ఇటీవ‌ల ఏపీ మీద జ‌రిగిన ప్ర‌చారం.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 04:27 PM IST

`ఏపీ ఆర్థికంగా చితికిపోయింది. ఎఫ్ఆర్బీఎం నిబంధ‌న‌ల‌ను దాటి వెళ్లింది. ఇక ఏపీ అంత‌టా చీక‌టే. రోడ్లు వేయ‌డానికి డ‌బ్బుల్లేవ్. జీతాలు ఇవ్వ‌డానికి నిధులు లేవు. రాష్ట్రం గురించి ఇక మ‌ర‌చిపోవ‌డ‌మే. ` అంటూ ఇటీవ‌ల ఏపీ మీద జ‌రిగిన ప్ర‌చారం. ఆర్థిక వేత్త‌లు కూడా ఏపీ ఆర్థిక దుస్థితిపై ఆందోళ‌న చెందారు. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత అప్పులు 5ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయ‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. దానికి భిన్నంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా లెక్కులు బ‌య‌ట‌పెట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత తొలి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబు చేసిన అప్పుల కంటే తాను చేసిన అప్పులు త‌క్కువంటూ జ‌గ‌న్ లెక్క‌లు బ‌య‌ట‌కు తీశారు. అంతేకాదు, ఆర్థికాభివృద్ధి కూడా చంద్ర‌బాబు కంటే త‌న హ‌యాంలోనే మెరుగ్గా ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని టీడీపీ నేత‌ల మీద విరుచుకుప‌డ్డారు జ‌గ‌న్‌.

2018-19లో జీడీపీ 5.36 ఉంటే ఇప్పుడు 6.89 శాతంగా ఉందని చెప్పుకొచ్చారు. దేశంలో జీడీపీ పరంగా ఆరోస్థానానికి చేరుకున్నామని ప్రకటించారు. విభజన నాటికి రాష్ట్ర రుణాలు రూ.1.26 లక్షల కోట్లుగా ఉంటే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 2.69 లక్షల కోట్లుగా ఉందని వెల్ల‌డించారు. చంద్రబాబు ఐదేళ్లలో పాల‌న స‌మ‌యంలో రాష్ట్రంలో 123.52% అప్పులు పెరిగాయని, అదే ఈ మూడేళ్లలో రుణాలు 41.4 శాతం మాత్ర‌మే పెరిగాయ‌ని చెప్పారు. రాష్ట్ర రుణాలు 3.82 లక్షల కోట్లకు పెరిగాయని వివరించారు. కేంద్రం చేసిన అప్పుల‌తో పోల్చితే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు శాతం త‌గ్గింద‌ని వివ‌రించారు.

రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని జ‌గ‌న్ స్పష్టం చేశారు శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయ‌న గతంలోనే చంద్రబాబు సర్కారే ఎక్కువ అప్పులు చేసిందని విమర్శించారు. వారితో పోల్చితే తమ ప్రభుత్వం తక్కువ అప్పులు చేసిందని సంక్షేమ పథకాలను ఎక్కువ చేపట్టిందని వివరించారు. అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా దుష్ట‌చ‌తుష్ట‌యం ప్రభుత్వంపై తప్పుడు క‌థ‌నాల‌ను ప్రచారం చేస్తుందని, వీటిని ప్రజలంతా గమనించాలని కోరారు. ఆర్థిక ప‌రిస్థితి గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేసిన ఆయ‌న ఏపీ ఆర్థిక ప‌రిస్థితికి ఢోకాలేద‌ని స్ప‌ష్టం చేశారు.

పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై జరిగిన చర్చలో సీఎం పాల్గొన్న జగన్‌ మాట్లాడుతూ తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కొవిడ్ సహా ఎన్నో సవాళ్లు ఎదురైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందన్నారు. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రం బాగున్నా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని జ‌గ‌న్ అన్నారు.