Site icon HashtagU Telugu

YSRCP Plenary: ఎన్నిక‌ల‌కు సిద్ధం కండి: వైసీపీ శాశ్వ‌త చీఫ్ జ‌గ‌న్‌

Cm Jagan

Cm Jagan

ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని క్యాడ‌ర్ కు వైసీపీ శాశ్వ‌త అధ్యక్షుడిగా ఎన్నికైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వాలంటీర్లు, క్యాడ‌ర్, లీడ‌ర్లు సంయుక్తంగా ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య‌కు వెళ్లాల‌ని ఆదేశించారు. మూడేళ్లుగా చేసిన సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌తి ఇంటికి వెళ్లి చెప్పాల‌ని సూచించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 స్థానాల‌కు 175 వ‌చ్చేలా ప్ర‌జ‌ల్ని స‌న్న‌ద్ధం చేయాల‌ని పిలుపునిచ్చారు. ప‌దేప‌దే `ఎల్లో మీడియా-దుష్ట‌చ‌తుష్ట‌యం` గురించి ప్ర‌స్తావిస్తూ ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని దిశానిర్దేశం చేయ‌డం `ముంద‌స్తు`ఎన్నిక‌ల అనుమానాల‌కు తావిస్తోంది. సంక్షేమ ప‌థ‌కాలు ఎజెండాగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాడ‌ర్ కు సూచించారు. ప్ర‌తిప‌క్షాల‌కు ఓటు వేస్తే సంక్షేమ ప‌థ‌కాలు వ‌ద్ద‌ని చెప్పిన‌ట్టు అవుతుంద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

అందుకే, ప్ర‌జ‌లు ఆలోచించి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు. ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌సంగంలా ఆద్యంతమూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగం సాగింది. మున్నెన్న‌డూ లేనివిధంగా గంట‌కుపైగా మాట్లాడిన జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల గురించి ప‌దేప‌దే వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో 95శాతం పూర్తి చేసి 85శాతం మంది ప్ర‌జ‌ల‌కు ల‌బ్దిచేకూర్చామ‌ని వెల్ల‌డించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) వెల్లడించారు. పార్టీ రాజ్యాంగం సవరణ ప్రతిపాదనలను ప్లీనరీలో ఆమోదించిన విష‌యాన్ని ప్ర‌క‌టించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీ (YSRCP)గా గుర్తించాలని కోరారు. పార్టీ అధ్యక్షుడు జీవితకాలం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేలా సవరణ చేశామని పేర్కొన్నారు. ప్లీనరీలో జరిగిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో (elections) వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. జగన్ జీవితకాల పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటారని విజయసాయి రెడ్డి ప్ర‌క‌టించారు.

సుదీర్ఘంగా జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలవి.

*13ఏళ్లుగా ఇదే ప్రేమ, అభిమానం నమ్మకం నాపై చూపిస్తున్నారు. మహా సైన్యానికి ప్రేమతో సెల్యూట్ చేస్తున్నా. కార్యకర్తల కష్టం వలనే మన ప్రభుత్వం ఏర్పడింది.

*నన్ను టార్గెట్ చేసిన పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఓదార్పయాత్ర చేయొద్దని వ్యతిరేకించి నాపై కుట్రపన్ని టీడీపీ, కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టారు

*ఆనాడు లొంగిపోయి ఉంటే ఈరోజు జగన్ మీ ముందు ఉండేవాడు కాదు. కానీ దేవుడు స్క్రిప్టు మరోలా రాశాడు

*ఒక ఎమ్మెల్యే తో ప్రారంభమై నేడు 150 మందికి చేరింది. ఒక్క ఎంపీ నుంచి 22మందికి చేరింది

*23 మంది ఎమ్మెల్యే లను సంతలో పశువుల్లా కొన్నారు .జగన్ కనపడకుండా పోవాలని కుట్రలు చేసారు. నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయాలని మాత్రమే

*చంద్రబాబు డిజిటల్ రింగ్ పై జగన్ సెటైర్లు. చిప్ కాళ్ళకి, వేళ్ళకి కాదు ఉండాల్సింది మెదడులో ఉండాలి

*టీడీపీ పెత్తందార్ల పార్టీ, చంద్రబాబు పార్టీ సిద్ధాంతం వెన్నుపోట్లే. ఆయన మమనైనా వెన్నుపోట్లు పొడుస్తారు. ప్రజలకి వెన్నుపోట్లు పొడుస్తారు

*కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసింది వైసిపి ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడమే లక్ష్యం. అందుకే బైజుస్ తో ఒప్పందం చేసుకున్నాం. కానీ చంద్రబాబు దాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు

*అమ్మఒడి పథకం ద్వారా 19వేల కోట్లు చెల్లించాం. నాడు- నేడు పదకం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చాం. ధర్మం వైపు మనం ఉన్నాం, అధర్మం వైపు వాళ్ళు ఉన్నారు

*మూడేళ్లలో మేనిఫెస్టోలో 95 శాతం హామీలు నిలబెట్టుకున్నాం. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం

*జగన్ చెప్పేది నిజమని నమ్మితే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయండి