Site icon HashtagU Telugu

YS Jagan: ఏపీ టీచ‌ర్ల హాజ‌రుపై జ‌గ‌న్ మూడోక‌న్ను

Jagan Victory

Jagan AP employees

ఏపీ టీచ‌ర్ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ చెక్ పెట్టింది. విద్యా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా తొలుత టీచ‌ర్ల నుంచి క్ర‌మ‌శిక్ష‌ణ తీసుకు రావ‌డానికి సిద్ధ ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లువురు టీచ‌ర్లు వ్యాపారాలు, సొంత కార్య‌క‌లాపాల్లో ఉండే వాళ్లు. స్కూళ్ల‌కు టైంకు వ‌చ్చే ఉపాధ్యాయులు చాలా త‌క్కువ‌. క్ర‌మ‌శిక్ష‌ణ లేకుండా ఉండే టీచ‌ర్ల‌ను గాడిలో పెట్ట‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `సిమ్స్-ఏపీ` అనే మొబైల్ యాప్ ను క్రియేట్ చేశారు.

ఇప్పటి వరకు బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం ఉంది. దాని స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్‌ను విద్యాశాఖ తీసుకొచ్చింది. ఉపాధ్యాయులు సహా పాఠశాలల్లో పనిచేసే అందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాగిన్ అయిన త‌రువాత‌ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను న‌మోదు చేస్తారు. వారి ఫొటోలను మూడు యాంగిల్స్‌లో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సెలవుల స‌హా సిబ్బంది వివ‌రాల‌న్నీ ఆ యాప్ లో ఉంటాయి.

పాఠశాలకు వచ్చిన వెంటనే యాప్‌లో లాగిన్ అయి ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలలోపే ఇదంతా జ‌ర‌గాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా యాప్ నిరాక‌రిస్తుంది. ఫలితంగా ఆబ్సెంట్ పడుతుంది. అనివార్యంగా లీవ్ పెట్టుకోవాలని సూచిస్తుంది. జీపీఎస్ ఆధారంగా ప్రతి పాఠశాలను గుర్తిస్తారు. కాబట్టి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే, ఉపాధ్యాయులు కచ్చితంగా 9 గంటలలోపు స్కూల్లో ఉండాల్సిందే.

జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన కొత్త హాజ‌రు విధానంపై ఉపాధ్యాయులు ధ‌ర్మ సందేహాల‌ను లేవ‌నెత్తుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేని ఉపాధ్యాయుల సంగతేంటన్న ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య ఉంటుందని, అప్పుడెలా అని టీచర్లు అడుగుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు, బస్సుల ఆలస్యం వంటి సమస్యలు కూడా ఉంటాయ‌ని ధ‌ర్మ‌సందేహాలు వెలుబుచ్చుతున్నారు. నేపథ్యంలో సిమ్స్-ఏపీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) ఉపాధ్యాయులకు సూచించింది. మొత్తం మీద జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న షేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.