Site icon HashtagU Telugu

YS Jagan : నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Ys Jagan Assembly2022

Ys Jagan Assembly2022

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సోమ‌వారం నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రార‌భ‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొద‌లు కాగానే టీడీపీ స‌భ్యులు పెద్ద ఎత్తున ర‌చ్చ చేసి, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ క్ర‌మంలో సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించి ప్రసంగం ప్రతులను చించివేయడం సరికాదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద జగన్ ప్రస్తావిస్తూ, చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని టీడీపీ సభ్యుల తీరు అసెంబ్లీ పవిత్రను నాశనం చేసేలా ఉందని జగన్ సీరియ‌స్ అయ్యారు.

అయితే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి నిర‌స‌న తెల‌ప‌డం ఇదే మొద‌టిసారి కాదు క‌దా, గతంలో వైసీపీ నేత‌లు కూడా ఇలాంటి పని చేశారని అచ్చెన్న కౌంట‌ర్ ఇచ్చారు. దీనిపై స్పందించిన జ‌గ‌న్.. గతంలో తాను ఇలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, మంత్రి మండలిని రద్దు చేసుకుంటానని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు చేశార‌ని తాను అన‌లేద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మ‌డిగా ఉన్నప్పుడు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి నిర‌స‌న తెల‌ప‌డం అనేది అనేక‌సార్లు జ‌రిగింద‌ని చెప్ప‌డ‌మే తన ఉద్దేశ‌మ‌ని అచ్చెన్నాయుడు వివ‌రించారు.

ఇక ఈసారి ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 25వ తేదీ వరకూ నిర్వహించనున్నార‌నే సంగ‌తి తెలిసిందే. ఏపీ రాజ‌ధాని విష‌యంలో హైకోర్టు ఇచ్చిన‌ తీర్పు పై అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చ‌ర్చించ‌నున్నార‌ని తెలుస్తోంది. దీంతో శాసనసభ వర్సెస్ న్యాయ వ్యవస్థ ఎవరు గొప్ప, ఎవరిది పైచేయి, ఎవరి అధికారాలేంటనే విషయంపై ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి సందేహాలు వస్తూనే ఉన్నాయి.వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని న్యాయ వ్యవస్థ కాదన్నప్పుడు, న్యాయవ్యవస్థ అధికారాలు, శాసనసభ అధికారాలపై వాదన వస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఏపీ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి చర్చనీయాంశం కానుంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.