YSR Vardhanthi : ఇడుపుల‌పాయ వేదిక‌గా మూగ‌సైగ‌లు

స్వ‌ర్గీయ డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 13వ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఇడుపుల‌పాయ వ‌ద్ద ఆయ‌న కుటుంబం ఒకే ఫ్రేమ్ లో క‌నిపించింది.

  • Written By:
  • Updated On - September 1, 2023 / 05:08 PM IST

స్వ‌ర్గీయ డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 13వ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఇడుపుల‌పాయ వ‌ద్ద ఆయ‌న కుటుంబం ఒకే ఫ్రేమ్ లో క‌నిపించింది. ఎవ‌రికివారే ఇడుపుల‌పాయ‌కు విడివిడిగా వెళ్లిన‌ప్ప‌టికీ ఒకే టైంకు వైఎస్ ఘాట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. తొలుత ష‌ర్మిల ఆ త‌రువాత జ‌గ‌న్ రావ‌డం క‌నిపించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల‌, వైఎస్ భార‌తి మ‌ధ్య మూగ‌సైగ‌లు కనిపించ‌డం గ‌మ‌నార్హం.

ప్రార్థ‌న చేసే స‌మ‌యంలో జ‌గ‌న్‌, ష‌ర్మిల ప‌క్క‌ప‌క్క‌నే కూర్చొన్నారు. అయిన‌ప్ప‌టికీ ఒక‌రు మొఖాలు మ‌రొక‌రు చూసుకోలేదు. అయితే, ప్రార్థ‌న చేయ‌డానికి ఒక ప‌త్రాన్ని వైఎస్ విజ‌య‌మ్మ ష‌ర్మిల‌కు అంద‌చేసింది. మ‌రో ప‌త్రాన్ని జ‌గ‌న్ కు ఇవ్వాల‌ని ష‌ర్మిల‌కు ఇచ్చారు. ఆ ప‌త్రాన్ని జ‌గ‌న్ కు ఇవ్వ‌డానికి ష‌ర్మిల ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించిన దృశ్యం వాళ్ల మ‌ధ్య ఉన్న విభేదాల‌కు అద్దం ప‌డుతోంది. స‌మాధి వ‌ద్ద‌కు వ‌స్తోన్న సంద‌ర్భంగా భార‌తికి అభివాదం చేసే ప్ర‌య‌త్నం ష‌ర్మిల చేశారు. కానీ, భార‌తి నుంచి ఎలాంటి రియాక్ష‌న్ రాక‌పోవ‌డంతో సమాధి వ‌ద్ద‌కు నేరుగా వెళ్లి కూర్చున్నారు.

గ‌త రెండేళ్లుగా కుటుంబం మొత్తం ఒకేచోట క‌నిపించ‌క‌పోవ‌డం వైసీపీ శ్రేణుల‌కు ఒకింత లోటుగా ఉంది. కానీ, ఈ ఏడాది ఇడుపులపాయ వ‌ద్ద జ‌రిగిన వ‌ర్థంతి సంద‌ర్భంగా కుటుంబమంతా ఒకేచోట క‌నిపించింది. ఒక‌రికొక‌రు ప‌లుక‌రించుకోక‌పోయిన‌ప్ప‌టికీ ఒకే చోట సామూహిక ప్రార్థ‌న‌ల‌ను నిర్వ‌హించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి జగన్, విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిళ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీరంతా ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు.

తండ్రిని తలచుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. ‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’ అని ట్వీట్ చేశారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి 1949 జులై 8న కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. 1978లో వైఎస్సార్ రాజకీయ అరంగేట్రం చేశారు. 1978, 1983, 1985 లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా వ‌రుసగా గెలుపొందారు. ఆ త‌రువాత 1989, 1991, 1996, 1998 లో కడప లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పార్ల‌మెంట్లోకి అడుగుపెట్టారు. రాష్ట్ర రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన వైఎస్ 1999, 2004, 2009 లో పులివెందుల నుంచి విజయం సాధించారు. 2004 నుంచి ఐదేళ్ల మూడు నెలల పాటు ఉమ్మ‌డి ఏపీకి సీఎంగా పని చేశారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ క్రాష్ ఘటనలో దుర్మరణం చెందారు.

వైఎస్సాఆర్ వ‌ర్థంతికి ఇడుపులపాయ వెళ్లిన జ‌గ‌న్ శుక్ర‌వారం విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. స్థానిక నేతలు, అధికారులు హాజరుకానున్నారు.