YS Avinash Reddy: హైదరాబాద్ బయల్దేరిన ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే పలు ఆధారాలతో అరెస్టుల పరంపర కొనసాగిస్తోంది

YS Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే పలు ఆధారాలతో అరెస్టుల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. పులివెందులలోని భాస్కర్‌రెడ్డి నివాసానికి చేరుకుని, అక్కడ విచారణ అనంతరం భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు. కోర్టు 14రోజుల రిమాండ్ విధించడంతో భాస్కర్ రెడ్డిని చంచల్​గూడ జైలుకు తరలించారు.

నిన్న సాయంత్రం సీబీఐ అధికారులు అవినాష్ ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. ఈ రోజు సోమవారం విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు నేడు సీబీఐ ఎదుట హాజరవ్వనున్నాడు అవినాష్ రెడ్డి. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 5.30 గంటలకు పులివెందుల నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయానికి చేరుకొని విచారణ ఎదుర్కొంటారు. అవినాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఆయన 5వ సారి సీబీఐ గడపతొక్కడం.

రెండ్రోజుల క్రితమే అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు వస్తున్నారు. ఈ రోజు అవినాష్ అరెస్ట్ ఖాయమంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అవినాష్ ఇంటివద్ద భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఇక ఈ రోజు సీబీఐ విచారణ నిమిత్తం అవినాష్ రెడ్డితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డితో పాటు భారీగా వైసీపీ శ్రేణులు హైదరాబాద్ బయల్దేరారు. దీంతో హైదరాబాద్ సీబీఐ కార్యాలయం ప్రాంగణం పోలీసులతో నిండిపోయింది. ఎటువంటి ఆందోళనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Read More: YS Murder : వివేకా `కుక్క‌`ను చంపిందెవ‌రు? తండ్రీకొడుకుల‌పై సీబీఐ ప్ర‌శ్నాస్త్రాలు!